ఒకటిరెండు రోజుల్లో ఏపీకి కేంద్ర సాయం: సుజన

ఎపికి కేంద్ర సాయంపై ఒకటిరెండు రోజుల్లో స్పష్టత వస్తుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పారు. ఈ విషయమై ఇప్పటికే నీతి ఆయోగ్‌లో చర్చించామని, దీనిపై సాధ్యమైనంత త్వరలో ప్రకటన వస్తుందని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్‌కు సాయం చేసే విషయంలో ఇప్పటికే అన్ని మంత్రిత్వశాఖలతో సంప్రదింపులు జరిపిందని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై కాకుండా ముందుగా ప్రత్యేక ప్యాకేజీ పైనే ప్రకటన చేయాలని కేంద్రం భావిస్తోందని కేంద్రమంత్రి సుజనా ప్రకటించారు. వివిధ రంగాలకు చెందిన పరిశోధన కేంద్రాలను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయడంతోపాటు వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలను ఇవ్వాలని కూడా కేంద్రాన్ని కోరినట్టు సుజనా తెలిపారు. కేంద్రం సానుకూలంగా స్పందించి, రాష్ట్రానికి న్యాయం చేస్తుందన్న నమ్మకంతోనే తామున్నామని ఆయన పేర్కొన్నారు. మరోసారి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమవుతామని, ఇందుకోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాజధాని నిర్మాణానికి కూడా నిధులు కోరామని చెప్పారు. ఏపీకి ఏ విధమైన ప్యాకేజీ ఇస్తారో… ఏ మేరకు నిధులు కేటాయిస్తారో ఒకటి రెండు రోజుల్లో తేలిపోయే అవకాశముందని ఆయన అన్నారు. ఈ అంశంపై స్పష్టత వస్తే ప్రత్యేక హోదాను రాజకీయ అవసరాలకు వాడుకునేవారు వెనక్కి తగ్గుతారని ఆయన అన్నారు. అయితే ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వదని తేలితే దీన్ని సెంటిమెంట్‌గా భావించి ఉద్యమ రూపం తలెత్తే ప్రమాదం కూడా ఉందనే విషయాన్ని కేంద్రమంత్రి సుజనా చౌదరి విస్మరించినట్టు కనిపిస్తోంది.