మక్కాలో తొక్కిసలాట… 750 మంది దుర్మరణం

హాజ్‌ యాత్రలో మళ్ళీ అపశ్రుతి… ముస్లింల పవిత్ర పుణ్యస్థలమైన మక్కా మసీదులో మరోసారి భారీ విషాదం చోటు చేసుకుంది. మసీదులోని తొక్కిసలాట జరిగి 750 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 500 మందికి పైగా గాయపడ్డారు. గత 15 రోజులలో ఇలాంటి విషాధ ఘటన చోటు చేసుకోవడం ఇది రెండోసారి. మొదటిసారి సెప్టెంబర్‌ 12న తొలిసారి విషాదం చోటు చేసుకుంది. మరమ్మతులకు ఉపయోగించే భారీ క్రేన్‌ ఒకటి అకస్మాత్తుగా పడిపోయిన ఘటనలో 107 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వందమందికి పైగా గాయాలకు గురయ్యారు. ఆ సంఘటనను ఇంకా మరిచిపోక ముందే మళ్ళీ ఇపుడు ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ఈ సంఘటనలో 750 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా ఐదొందల మందికి పైగా గాయపడినట్టు అధికారవర్గాల సమాచారం. మృతులు భారీగా పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఘటన స్థలి దగ్గర 20 వేల మంది ఉన్నారు. వీరంతా ఒక్కసారిగా కదలడంతో కంగారులో తొక్కిసలాట జరిగింది. ఇందులో దాదాపు వెయ్యి మంది వరకు ఒకరిపై ఒకరు పడడంతో ఈ ప్రమాదం జరిగింది. సంఘటన స్థలిలోనే 500 మంది పైగా చనిపోయారు. అయితే గాయపడిన వారు 500 మంది వరకు ఉన్నారు. వీరిని పలు ఆస్పత్రిల్లో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. సైతాన్‌ను రాళ్ళతో ఏడుసార్లు కొట్టాలని ముస్లింలు నమ్ముతారు. అలా కొడుతుండగా ఒక్కసారిగా అందరూ ముందుకు ఎగబడడంతో ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. మృతుల్లో 12 మంది భారతీయులు ఉన్నట్టు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఐదు వేల మందికిపైగా హాజ్‌ యాత్రకు వెళ్ళినట్టు ఆ వర్గం ప్రతినిధులు చెబుతున్నారు. మక్కాలో జరిగిన సంఘటనపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రాల్లో బాధితుల గురించిన సమాచారం ఇచ్చేందుకు అధికారులు కాల్‌సెంటర్లు ఏర్పాటు చేశారు.