Telugu Global
Cinema & Entertainment

సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ సినిమా రివ్యూ

రేటింగ్‌: 2.75 బాక్సింగ్‌లో ఒక రూలుంది. కిందపడితే అది ఓటమికాదు. కిందపడికూడా పైకి లేవలేకపోతే అది ఓటమి. దర్శకుడు హరీష్‌ శంకర్‌ రామయ్యవస్తావయ్యతో చతికిలపడ్డాడు. సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌తో లేచినిలబడి ఫైట్‌ చేస్తాడని అందరూ ఆశించారు. కానీ హరీష్‌ శంకర్‌ కాసేపు పైకిలేచి నిలబడతాడు, ఎవరూ కొట్టకుండానే, ఎవర్నీ కొట్టకుండానే కిందపడతాడు. మొత్తంమీద ఈ సినిమా బావుందని చెప్పలేం, బాలేదని చెప్పలేం యావరేజ్‌. దర్శకుడు ఏమీ రిస్క్‌తీసుకోకుండా పాత చింతకాయ పచ్చడి కథను ఎన్నుకున్నాడు. దాన్ని అమెరికా […]

సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ సినిమా రివ్యూ
X

రేటింగ్‌: 2.75

బాక్సింగ్‌లో ఒక రూలుంది. కిందపడితే అది ఓటమికాదు. కిందపడికూడా పైకి లేవలేకపోతే అది ఓటమి. దర్శకుడు హరీష్‌ శంకర్‌ రామయ్యవస్తావయ్యతో చతికిలపడ్డాడు. సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌తో లేచినిలబడి ఫైట్‌ చేస్తాడని అందరూ ఆశించారు. కానీ హరీష్‌ శంకర్‌ కాసేపు పైకిలేచి నిలబడతాడు, ఎవరూ కొట్టకుండానే, ఎవర్నీ కొట్టకుండానే కిందపడతాడు. మొత్తంమీద ఈ సినిమా బావుందని చెప్పలేం, బాలేదని చెప్పలేం యావరేజ్‌.
దర్శకుడు ఏమీ రిస్క్‌తీసుకోకుండా పాత చింతకాయ పచ్చడి కథను ఎన్నుకున్నాడు. దాన్ని అమెరికా రేపర్‌లో చుట్టి మనకు సేల్‌ చేయాలనుకున్నాడు. కానీ ప్రేక్షకులు తెలివైన వాళ్ళు, ఇలాంటి సినిమాల్ని సవాలక్ష చూసామని వాళ్ళకు తెలుసు.
సాయిధరమ్‌తేజ (సుబ్రమణ్యం) న్యూయార్క్‌లో ఉంటాడు. రేడియో అనౌన్సర్‌గా, హోటల్లో కుక్‌గా పార్ట్‌టైం జాబ్స్‌ చేస్తూవుంటాడు. డబ్బుకోసం ఏ పనయినా చేస్తానంటాడు కానీ చేయడు. ఇండియానుంచి హీరోయిన్‌ న్యూయార్క్‌కి పారిపోయి వస్తుంది. కొన్ని కారణాల వల్ల ఆమె హీరోకి దగ్గరవుతుంది. ఆ తరువాత ఇండియాకి చెల్లి పెళ్ళికోసం వస్తుంది. ఆమెకు భర్తగా హీరో యాక్ట్‌చేయాల్సివస్తుంది. బావగారు బాగున్నారా గుర్తుకొచ్చిందా, సినిమా చూస్తుంటే ఇంకా చాలా గుర్తుకొస్తాయి.
హీరోయిన్‌ది పెద్ద ఫ్యామిలీ. కృష్ణవంశీ సినిమాలో ఉన్నట్టు ఎవరు ఎవరో తెలియనంత పెద్ద ఫ్యామిలీ (ఈ డైలాగ్‌ సినిమాలో ప్రభాస్‌శ్రీను అంటాడు). పెళ్ళిరోజు రాత్రి చీకట్లో ఇల్లు వదిలి హీరోయిన్‌ పారిపోతుంది. ఇది ఓపెనింగ్‌. అద్భుతమైన మూడ్‌తో ప్రారంభమయ్యే సినిమా కాసేపటికే బరువు కోల్పోతుంది. దీనికి కారణం దర్శకుడే. హీరో క్యారెక్టర్‌ని సరిగా మలచకపోవడం వల్ల గందరగోళం సీన్స్‌ వస్తాయి. ఆ సన్నివేశాలన్నీ ఎక్కడో చూసినట్టు ఉండడం ఇంకో లోపం. బ్రహ్మానందం ఎంట్రీతో కామెడీ పండుతుందని ఆశిస్తే అది పచ్చి కాయగా మారింది.
కొన్ని సన్నివేశాలు అసందర్భంగా వచ్చి వెళతాయి. బ్రహ్మానందం అంతరాత్మ ప్రబోధం సూపర్‌ వేస్ట్‌. హోటల్‌ వోనర్‌ భార్యతో బ్రహ్మానందం ఏదో సాగిస్తాడని బిల్డప్‌ ఇచ్చి మళ్ళీ ఆ జోలికే వెళ్ళడు. అయినా అమెరికాలో స్థిరమైన ఉద్యోగం లేకుండా పార్ట్‌టైం జాబ్‌లు చేసి హీరో డబ్బెలాసంపాదిస్తాడో అర్థంకాదు.
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమా హీరోయిన్‌లా ‘సీత ఇక్కడ’ అని అతి తెలివి ప్రదర్శించే హీరోయిన్‌ ఫేస్‌బుక్‌లో పరిచయమైనవాడిని నమ్ముకుని వాడితో పెళ్ళివరకూ ఎలా వెళుతుందో అర్థంకాదు.
సినిమాలో లాజిక్‌లు అవసరంలేదనే మాట నిజమే కానీ, లాజిక్‌గా ఉంటే ఆడియన్స్‌ బాగా కనెక్టవుతారనే మాట కూడా నిజం. అయితే దర్శకుడు దీన్ని మంచి కామెడి ఎంటర్‌టైనర్‌గా మలచడానికి ప్రయత్నం చేసాడు. పాక్షికంగా విజయం సాధించాడు కూడా. సెకెండాఫ్‌లో కొన్ని సీన్స్‌ చాలా బావున్నాయి.
సాయిధరమ్‌తేజలో ఈజ్‌ ఉంది. హీరోయిజం, పంచ్‌ డైలాగులు ఫైట్‌ల సంగతి పక్కన పెడితే నటనలో పరిపక్వత ఉంది. ప్రేమ సన్నివేశాలు, చివర్లో తండ్రి దగ్గర సెంటిమెంటల్‌ సీన్‌ని పండించాడు. బిగువైన కథ దొరికితే అతను సూపర్‌హిట్‌ కొడతాడు. ముఖ్యంగా హాస్యాన్ని పండించడం కష్టం. కొన్నిచోట్ల మైనస్‌ అయినా, చాలాచోట్ల బాగా చేసాడు. హీరోయిన్‌ రెజినా అందంగా ఉంది. సినిమా మొత్తంపైన బాగా నటించింది. ఫీలింగ్స్‌ చక్కగా పలుకుతాయి ఆమెలో. పాటలు బావున్నాయి. గ్రాండ్‌ కాన్యన్‌లో తీసిన రీమేక్‌సాంగ్‌ గువ్వగోరింకతో కొరియోగ్రఫి బావుంది.
రావురమేష్‌ కాసేపు కనిపించినా అదరగొట్టాడు. కర్నూల్‌లో ఉండే విలన్‌ గోదావరి యాస మాట్లాడ్డమే విచిత్రం. రమేష్‌ ఏం మాట్లాడినా అలాగే ఉంటుంది అదే అతని ప్లస్‌. సుమన్‌ ఉన్నా లేనట్టే.
హీరో పేరు మొదట్లో టైటిల్స్‌లో సుప్రీం హీరో అని వేసారు. గట్టిగా నాలుగు సినిమాలు చేయలేదు, అప్పుడే బిరుదులెందుకో? ఫైటింగ్‌ల గోలలో ఇరుక్కోకుండా కథలో ఇమిడిపోతేనే హీరోకి ఫ్యూచర్‌ బావుంటుంది. గబ్బర్‌సింగ్‌ గ్యాంగ్‌ అంతా కూడా ఈసినిమాలో కనిపించి నవ్వించాలని ప్రయత్నం చేయడం విశేషం. ఎక్కువ ఎక్స్‌ఫెక్ట్‌ చేస్తే నిరాశపరుస్తుంది కానీ యావరేజ్‌ అని వెళితే కాసేపు నవ్విస్తుంది. అది సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌.

– జిఆర్‌. మహర్షి

First Published:  24 Sep 2015 3:04 AM GMT
Next Story