Telugu Global
Others

జగన్‌కు రామోజీ ఆహ్వానం వెనుక...

నిన్న రామోజీ ఫిలిమ్‌సిటీలో జగన్‌ రామోజీల మధ్య జరిగిన రహస్య సమావేశం రెండు తెలుగు రాష్ట్రాలను ఒక కుదుపు కుదిపింది. అప్పుడే ఢిల్లీలో దిగిన చంద్రబాబు కూడా షాక్‌ తిని తన ప్రోగ్రామ్‌ మార్చుకున్నారు. రామోజీ జగన్‌ల భేటీ ఎలా జరిగింది.. ఎందుకు జరిగింది… రామోజీ పిలిస్తే జగన్‌ వెళ్ళాడా లేక కొన్ని పత్రికల్లో రాసినట్లు ఎవరో పెళ్ళికి ఆహ్వానించడానికి వెళ్ళాడా అనే విషయాలను టీడీపీ, వైయస్‌ఆర్‌ అభిమానులు తేల్చుకోలేకపోతున్నారు. భూమన కరుణాకర్‌ రెడ్డి తన ఇంట్లో […]

జగన్‌కు రామోజీ ఆహ్వానం వెనుక...
X

నిన్న రామోజీ ఫిలిమ్‌సిటీలో జగన్‌ రామోజీల మధ్య జరిగిన రహస్య సమావేశం రెండు తెలుగు రాష్ట్రాలను ఒక కుదుపు కుదిపింది. అప్పుడే ఢిల్లీలో దిగిన చంద్రబాబు కూడా షాక్‌ తిని తన ప్రోగ్రామ్‌ మార్చుకున్నారు.

రామోజీ జగన్‌ల భేటీ ఎలా జరిగింది.. ఎందుకు జరిగింది… రామోజీ పిలిస్తే జగన్‌ వెళ్ళాడా లేక కొన్ని పత్రికల్లో రాసినట్లు ఎవరో పెళ్ళికి ఆహ్వానించడానికి వెళ్ళాడా అనే విషయాలను టీడీపీ, వైయస్‌ఆర్‌ అభిమానులు తేల్చుకోలేకపోతున్నారు. భూమన కరుణాకర్‌ రెడ్డి తన ఇంట్లో పెళ్ళికి రామోజీని ఆహ్వానించడానికి వెళుతుంటే తానూ వస్తానని జగన్‌ వెళ్ళాడంటూ వచ్చిన వార్తలు హాస్యాస్పదం. చంద్రబాబు అభిమానుల్ని ఊరడించడానికి, జగన్‌ను తక్కువచేయడానికి తప్ప ఈ కథనం ఎందుకూ పనికిరాదు.

ఒకవేళ నిజంగానే పెళ్ళికి ఆహ్వానించడానికి వెళ్ళివుంటే మర్యాదపూర్వకంగా కలిసి ఐదారు నిముషాల్లో బయటపడతారు తప్ప, గంటసేపు రహస్య సమాలోచనలు జరుపరు కదా!నిన్న రామోజీ ఆహ్వానం మేరకే జగన్‌ వెళ్ళి కలిసాడు అనేది అక్షర సత్యం. అయితే ఇలా ఆహ్వానించడానికి తెర వెనుక జరిగిందేమిటనేది ఎవరికి వాళ్ళే ఊహించుకుంటున్నారు.

గతంలో రామోజీ, వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డిల మధ్య వివాదం ముదిరినప్పుడు విసు సంస్థల అధినేత సి.సి.రెడ్డి వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి మధ్యవర్తిగా వెళ్ళి రామోజీని కలిసాడు. అప్పుడు రామోజీరావును ఆయన ఏమి కోరాడంటే మీరు రాజశేఖర్‌ రెడ్డికి అనుకూలంగా ఎలాంటి వార్తలు రాయనవసరం లేదు, కాంగ్రెస్‌ను సపోర్ట్‌ చేయనవసరం లేదు. అయితే రాజశేఖర్‌రెడ్డి మీద అనవసరంగా బురద చల్లకుండా ఉంటే చాలు. మీకు చంద్రబాబు ఎలా సహకరించాడో అలాగే మీ పనులకు సహకరిస్తాం అని సి.సి.రెడ్డి రాయబారిగా వచ్చిన విషయం చెప్పాడు.

అందుకు రామోజీ నవ్వుతూ… కాంగ్రెస్‌ అధికారంలో ఉండటమే తాను భరించలేనట్లుగా సమాధానమిచ్చాడట. అంటే ముఖ్యమంత్రి పీఠం మీద తెలుగుదేశం వాళ్ళే కూర్చోవాలనేది ఆయన అభిప్రాయం అని అర్ధం చేసుకున్న సి.సి.రెడ్డి ఆ విషయాలను రాజశేఖర్‌ రెడ్డికి క్షుణ్ణంగా వివరించాడు. సరే అట్లయితే అన్న.. వైయస్‌… రామోజీ సంస్థలమీద విచారణ జరిపించాడు. తరువాత ఏం జరిగిందో తెలుగు ప్రజలందరికీ తెలిసిందే. అయితే ఒక దశలో ఈ కేసులను విచారిస్తున్న పోలీసు అధికారి వైయస్‌ను కలిసి రామోజీని అరెస్టు చేయడానికి కావాల్సిన అధారాలన్నీ ఉన్నాయి అని చెప్పినపుడు వైయస్‌ స్పందిస్తూ ఆయనను అరెస్టు చేయడం లాంటి ఆలోచనలొద్దు. ఆయన మన పరువు తీస్తున్నాడు. మనం ఆయన పరువు తీసాం… ఇక చాలు అన్నాడట.

ఈ కేసుల సందర్భంగా రామోజీ కుటుంబంలో కలహాలు రేగాయి అని సమాచారం. వ్యాపారాలు చేసుకునే మనకు ఇంత కక్షలు ఎందుకు? ఒక పార్టీని భుజాన వేసుకొని ఇంకొకరిని బదనాం చేయడానికి ప్రయత్నిస్తూ మనం ఇబ్బందులు పడడం దేనికి? అని కుటుంబ సభ్యులు రామోజీని గట్టిగా నిలదీసారని సమాచారం. వైయస్‌ చనిపోయాక అనేక మార్పులు వచ్చాయి. రామోజీ విజృంభించి జగన్‌ను ఎంత ఇబ్బంది పెట్టాలో అంతా ఇబ్బంది పెట్టాడు. గత ఎన్నికల్లో జగన్‌ ఓడిపోయి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పరిచాడు. ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ జనం నాడిని ఖచ్చితంగా అంచనా వేసే రామోజీ చంద్రబాబు పాలనపై సర్వేలు జరిపించాడు. ఆయన పాలన సవ్యంగా లేదు. ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చంద్రబాబు ఓడిపోవడం ఖాయం. ఒకవేళ అలా జరగకున్నా వచ్చే ఎన్నికల తరువాత అయినా జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని ఒక అభిప్రాయానికొచ్చాడు.

రామోజీ వయస్సు దృష్ట్యా ఎంతకాలం తన సామ్రాజ్యాన్ని కాపాడుకోగలడో తెలియదు. చంద్రబాబు ఎంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటాడో తెలీదు. జగన్‌ ముఖ్యమంత్రి అయితే వైయస్‌లాగా ఒదిలేస్తాడా? కక్ష సాధింపులకు పాల్పడి తన సామ్రాజ్యాన్ని దెబ్బతీస్తాడా? తన కుటుంబ సభ్యుల మీద పగ సాధిస్తాడా? అనే సందేహాలు రామోజీకి ఉన్నాయి. కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయాన్ని పదేపదే రామోజీ దృష్టికి తీసుకొస్తున్నారట.

వైయస్‌ కుటుంబంలో కూడా జగన్‌ భార్య భారతిది వ్యాపార ధోరణి. మనకు కక్షలు ఎందుకు? రామోజీ లాంటి వారితో విరోధాలెందుకు? అనే అభిప్రాయం.. ఈ నేపథ్యంలో శైలజా కిరణ్‌, భారతీల మధ్య పెరిగిన స్నేహం వల్ల ఇటీవల ఈనాడు సంస్థల్లో సమ్మె జరిగినప్పుడు సాక్షి సంస్థ ఈనాడు సంస్థకు సహకరించిందని కూడా పుకార్లు వచ్చాయి. భారతి, శైలజలకు వ్యాపారం ముఖ్యం. అందుకే కొద్దినెలల క్రితం రామోజీ రావు కేసీఆర్‌ను కూడా తన ఫిలిమ్‌సిటీకి ఆహ్వానించాడు. ఇప్పుడు జగన్‌వంతు వచ్చింది.

ఈ సమావేశం జరగడానికి కారకులు ఎవరు? ఈ భేటీలో ఏం జరిగింది? తదనంతర పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? మొదలైన విషయాలు తెలియడానికి కొంత సమయం పట్టవచ్చు.

First Published:  25 Sep 2015 1:14 AM GMT
Next Story