జగన్‌ నిర్ణయం సముచితం… సందర్భోచితం!

PR Chennuవైఎస్‌ జగన్మోహనరెడ్డిని నిరవధిక దీక్ష చేయకుండా నిరోధించడం ద్వారా… ఏలినవారు తలచుకుంటే ఏదైనా చేయగలరని మరోసారి నిరూపించారు తెలుగుదేశం ప్రభుత్వంలోని పెద్దలు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం జగన్‌ ఇప్పటికే ఢిల్లీలో దీక్ష చేశారు. ఆ సమయంలోనే సెప్టెంబర్‌ 15వ తేదీన ఏపీ రాజధానిలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. కొన్ని పరిస్థితుల కారణంగా దీక్షను 26కు వాయిదా వేశారు. అంటే దాదాపు ఇరవై రోజుల ముందే ఆయన దీక్షకు సంబంధించి ప్రకటన చేశారు. కాని ఏపీ ప్రభుత్వం దీనిపై స్పందించలేదు. తీరా తేదీ దగ్గరకు వచ్చిన తర్వాత దీక్షకు అనుమతించబోమని ఏపీ పోలీసులు ప్రకటించారు. దీక్షకు అన్ని ఏర్పాట్లూ చేసుకున్న తర్వాత ప్రకటించడంలో అంతర్యమేమిటి? జగన్‌కు ప్రజల్లో మైలేజ్‌ రాకుడదన్న కుటిలనీతి తప్ప ఈ నిర్ణయంలో మరొకటి కనిపించదు. మరో 24 గంటల సమయం ఉందనగా ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రజలు కూడా తప్పు పట్టారు.
నిజానికి కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి. ఎందుకంటే పార్లమెంట్‌ సాక్షిగా ఏపీకి లభించిన వరం ఇది. దీన్ని సాధించాల్సింది ఏపీ ప్రభుత్వం. కాని చంద్రబాబు నాయుడుకు అడిగే సత్తా లేదు. రాష్ట్ర విభజన సమయంలో పార్టీలన్నీ ఆడిన డ్రామాల మాదిరిగానే ఇపుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా ఆడుతోంది. ప్రత్యేక హోదా సాధించి తీరుతామని డాంభికాలు పలుకుతున్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి వంటివారు… దీనికి వంతపాడుతున్న బీజేపీ నేత హరిబాబులాంటివారు కూడా మాట మార్చారు. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ ఎంతో మేలు చేస్తుందన్న పల్లవి అందుకున్నారు. దీంతోనే వారి మనోగతం బయటపడింది. ఇలాంటి సమయంలో ప్రజల తరఫున, రాష్ట్రానికి మేలు చేసే పని ఎవరు చేసినా స్వాగతించాలి. కాని చంద్రబాబుకు అంత పెద్ద మనసు లేదు. ప్రభుత్వంలోని పెద్దలు కూడా ఇందుకు అతీతులు కారన్న విషయం వారి ప్రకటనల్లోనే తేటతెల్లమయ్యింది.రాష్ట్రానికి మేలు చేకూర్చే ప్రత్యేక హోదా సాధించాలన్న లక్ష్యం నెరవేరే దాకా పోరాటం కొనసాగిస్తానన్న జగన్‌ నిరవధిక నిరాహార దీక్షకు అనుమతించేలా ఆదేశాలివ్వాలని లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ ద్వారా హైకోర్టు తలుపు తట్టారు. అయితే లంచ్‌ మోషన్‌ పిటిషన్‌తో కాకుండా పూర్తి స్థాయి పటిషన్‌తో రావాలని హైకోర్టు ఆదేశించడంతో సోమవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయనుంది. మొత్తం మీద ఆయన ప్రత్యేక హోదా కోసం జగన్‌ పోరాటం ఆపేట్టు లేరన్నది సుస్పష్టంగా తెలుస్తోంది.
జగన్‌ దీక్ష తాత్కాలికంగా ఆగిపోయినప్పటికీ ఆయన లక్ష్యం నెరవేరిందనే చెప్పాలి. ప్రత్యేక హోదా కోసం ఆయన చిత్తశుద్ధితో పోరాడుతున్నారన్న విషయం జనం గమనించారు. ప్రజాస్వామ్యబద్దంగా చేయాలనుకుంటున్న దీక్షను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం బదనాం అయ్యింది. ఆఖరి నిమషం వరకు అనుమతి విషయంలో మాట్లాడకుండా పోలీసులు వ్యవహరించిన తీరు ప్రభుత్వ వైఖరిని తేటతెల్లం చేసింది. కావాలనే జగన్‌ను వేధిస్తున్నారనే విషయం జనంలోకి వెళ్ళింది. అనుమతి నిరాకరించడానికి పోలీసులు చెప్పిన కారణాలు కూడా సహేతుకంగా లేవన్న విషయం జనం గమనించారు. జగన్‌ ప్రతిపాదిత దీక్ష స్థలికి దగ్గరలో ఆస్పత్రులు, విద్యాలయాలు ఉన్నాయని… అందుకే అనుమతి ఇవ్వలేమని పోలీసులు చెప్పడం జనమే తప్పు పట్టేలా ఉంది.
విజయవాడలో పునరంకిత సభ ఏర్పాటు చేసిన ప్రాంతం బెంజ్‌ సర్కిల్‌. ఇది రెండు జాతీయ రహదారుల కూడలి. ఈ నాలుగు రోడ్ల కూడలిలో ఒకవైపు విశాఖపట్నం రహదారి, మరోవైపు మచిలీపట్నం… ఇంకోవైపు హైదరాబాద్‌… నాలుగోవైపు చెన్నై వెళ్ళే దారుల కూడలి. అక్కడ ఎప్పుడూ జనసమర్ధంగా ఉండే ప్రాంతం. అలాంటి ప్రాంతంలో పునరంకిత సభ పెట్టుకోవడానికి అనుమతించిన పోలీసులు ఒక ప్రయివేటు స్థలంలో… అదీ ప్రయాణాలకు ఏ మాత్రం ఇబ్బంది కలిగించిన ప్రాంతంలో దీక్షకు అనుమతి నిరాకరించడం ప్రభుత్వ దమననీతిని తేటతెల్లం చేసింది. ఆమరణ దీక్ష చేసి ప్రాణం తీసుకుంటానంటే పోలీసులు అనుమతిస్తారా అని చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కారు. మరి బాబు ఢిల్లీ లోని ఏపి భవన్, హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోను చేసిన దీక్ష ఏమిటి? అలాగే కావేరీ జలాల కోసం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చేసిన దీక్ష సంగతేంటి? గురివిందలా మాట్లాడితే ఎలా అని జనమే ప్రశ్నిస్తున్నారు. 
మొత్తం మీద జగన్‌ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దీక్షను మళ్ళీ ప్రారంభిస్తానని చెప్పడం ద్వారా ప్రత్యేక హోదాపై తన నిబద్దతను చాటారు. దీక్షకు నిరాకరించడం ద్వారా ప్రభుత్వ కపట నీతి బయట పడింది. జగన్‌ను ఏకాకిని చేయాలనుకున్న ప్రభుత్వ పెద్దల ప్రకటనలను జనం గమనించారు. మొత్తం మీద ఎలా చూసినా దీక్షను వాయిదా వేయాలన్న జగన్‌ నిర్ణయం సముచితమైంది… సందర్బోచితమైంది. ఇక్కడ గుర్తు చేసుకోవలసింది….మహా భారతంలో ఓచోట కనిపించే మాట… అదృష్టవంతులకు ఆపదలు కూడా సంపదలుగానే పరిణమించును… ఇది జగన్‌ విషయంలో అక్షర సత్యమైంది.
– పీఆర్‌ చెన్ను