ప్రతిపక్షాలపై కేసీఆర్ హౌసింగ్  అస్త్రం

తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలను కంట్రోల్ చేసేందుకు కేసీఆర్ కొత్త వ్యూహం రచించారు.  అదికూడా అసెంబ్లీ వేదికగానే అమలుచేసేందుకు సిద్దమవుతున్నారు. 
2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్  సీఐడీ విచారణకు ఆదేశించారు.  ఇప్పుడు సీఐడీ మధ్యంతర నివేదిక కేసీఆర్ చేతికి చేరినట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని మరీ ఎక్కువగా ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తే సీఐడీ నివేదికను అసెంబ్లీ వేదికగా బయటపెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. స్కాం వెనుక ఉన్న నేతల పేర్లను కూడా సభలో చదవి వినిపించేందుకు రెడీ అవుతున్నారు. 
సీఐడీ విచారణ కేవలం కొందరు నేతలను లక్ష్యంగా చేసుకునే జరిగిందా అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే సిబ్బంది కొరత, ఇతర కారణాలతో కేవలం 18 నియోజకవర్గాల్లో మాత్రమే సీఐడీ  దర్యాప్తు సాగింది.  వీటిలో కాంగ్రెస్ ముఖ్యనేతల నియోజకవర్గాల్లో హౌజింగ్ స్కాం జరిగినట్టు సీఐడీ తేల్చినట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డీకే అరుణ, శ్రీధర్ బాబు నియోజకవర్గాలున్నాయి.  సీఐడీ నివేదిక ద్వారా కాంగ్రెస్ అగ్రనాయకత్వం మొత్తాన్ని కంట్రోల్ చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్న అనుమానాన్ని కాంగ్రెస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు.  కేసీఆర్‌పై పదేపదే తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలుచేస్తున్న రేవంత్ రెడ్డి సొంతం నియోజకవర్గం పేరు కూడా సీఐడీ నివేదికలో ఉన్నట్టు తెలుస్తోంది.  సదరు నియోజకవర్గాల్లో అసలు ఇళ్ల నిర్మాణాలు చేయకుండా వేలాది ఇళ్ల బిల్లులను నొక్కేశారని సీఐడీ తేల్చినట్టు చెబుతున్నారు.  ఈ వ్యవహారం  వెనుక అపట్లో సదరు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించిన నేతల హస్తం ఉందని సీఐడీ తేల్చిందని గులాబీ నేతలు అంటున్నారు.  తమ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ప్రతిపక్షం విమర్శలు చేస్తే హౌసింగ్ స్కాంతో తిప్పికొడుతామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.