Telugu Global
Others

కడప ప్లగ్‌లో వేలెడుతున్న చినబాబు

కడప జిల్లాలో రాజకీయంగా వైఎస్ కుటుంబాన్ని బలహీనపరిచేందుకు దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.  టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే కాదు సొంతపార్టీ కాంగ్రెస్ హయాంలోనూ వైఎస్‌కు సమస్యలు తప్పలేదు. సొంత జిల్లాలో బలహీనపరచడం ద్వారా వైఎస్ ఎదుగుదలపై దెబ్బకొట్టాలని ఎందరో యోధానుయోధులు శక్తికి మించి శ్రమించారు.   లేటెస్ట్‌గా  సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ అదే పని చేయాలని వ్యూహం పన్నుతున్నారట. అందులోభాగంగా జగన్ సొంత జిల్లాలో కాస్త అసంతృప్తిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలను ఆకర్శించే పనిమొదలుపెట్టారు. అలా చేయడం […]

కడప ప్లగ్‌లో వేలెడుతున్న చినబాబు
X

కడప జిల్లాలో రాజకీయంగా వైఎస్ కుటుంబాన్ని బలహీనపరిచేందుకు దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే కాదు సొంతపార్టీ కాంగ్రెస్ హయాంలోనూ వైఎస్‌కు సమస్యలు తప్పలేదు. సొంత జిల్లాలో బలహీనపరచడం ద్వారా వైఎస్ ఎదుగుదలపై దెబ్బకొట్టాలని ఎందరో యోధానుయోధులు శక్తికి మించి శ్రమించారు. లేటెస్ట్‌గా సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ అదే పని చేయాలని వ్యూహం పన్నుతున్నారట. అందులోభాగంగా జగన్ సొంత జిల్లాలో కాస్త అసంతృప్తిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలను ఆకర్శించే పనిమొదలుపెట్టారు. అలా చేయడం ద్వారా జగన్ దూకుడుకు సొంత జిల్లా నుంచే అడ్డుకట్ట వేయాలని చినబాబు ఆలోచన. చాలాకాలంగా అసంతృప్తితో ఉన్న జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై లోకేష్ కన్నేశారు. ఇప్పటికే ఆదితో లోకేష్ సుధీర్ఘంగా చర్చలు జరిపారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అటు వైపు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందంటున్నారు. అయితే ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తెస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు అంచనా వేసుకుని టీడీపీ నేతలు కంగారు పడుతున్నారు.

ఆది గోడ దూకితే ఎవరికి లాభం?
ఆదినారాయణరెడ్డి వైసీపీని వీడినంత మాత్రాన జగన్ నీరుగారిపోతారని అనుకోవడం అమాయకత్వమేనని కడప టీడీపీ నేతలే చెబుతున్నారు. ఒక ఎమ్మెల్యే వెళ్లినంత మాత్రాన జగన్‌కు వచ్చేది లేదు పోయేది లేదంటున్నారు. పైగా పార్టీలో ఉంటూ నిత్యం అసంతృప్తి రాగాన్ని ఆలపించేవారు బయటకు వెళ్లిపోతే అది జగన్‌కే ప్లస్ అవుతుందంటున్నారు. టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి ఇటు వైపు వస్తే ఆదినారాయణరెడ్డికి ఆర్థికంగా, పోలీసు కేసులు తదితర అంశాల్లో మంచి జరగవచ్చని చెబుతున్నారు. కానీ టీడీపీకి మాత్రం ఉపయోగం లేకపోగా లేనిపోని తలనొప్పులు ఖాయమని అంచనా వేస్తున్నారు. ఆదినారాయణ రెడ్డికి, జమ్మలమడుగు టీడీపీ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి దశాబ్దాలుగా ఫ్యాక్షన్ వార్ ఉంది. ఈ నేపథ్యంలో ఆదిని పార్టీలోకి తెస్తే రామసుబ్బారెడ్డి అంగీకరించే ప్రసక్తే ఉండదంటున్నారు. ఒక ఒరలో రెండు కత్తులను ఇమడవన్న సాధారణ ఫార్ములా చినబాబుకు అర్థం కావడం లేదంటున్నారు.

ఆది బలంపై తమ్ముళ్ల అనుమానాలు
ఆదినారాయణరెడ్డి వరుసగా గెలుస్తున్నారు కాబట్టి ఆయన బలంపై లోకేష్ ఎక్కువగా ఊహించుకుంటున్నారా అన్న అనుమానాన్ని సొంతపార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అదే నిజమైతే చినబాబు అంచనా సరైంది కాదంటున్నారు. రామసుబ్బారెడ్డి కూడా బలమైన, మంచి నాయకుడేనని పేరున్నా… జిల్లాలో టీడీపీకి సరైన ఆదరణ లేకపోవడం, వైఎస్ ఇమేజ్‌ వల్ల అక్కడ ఆదినారాయణరెడ్డి గెలుస్తూ వచ్చారని చెబుతున్నారు. ఒకవేళ ఆదినారాయణరెడ్డి ఇటు వచ్చి… రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వెళ్తే అప్పుడు పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జగన్, రామోజీరావు లాంటి వారే కలిసి మాట్లాడుకుంటున్న తరుణంలో రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వెళ్తే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు. వరుస ఓటములతో రామసుబ్బారెడ్డిపై సానుభూతి కూడా ఉందని అలాంటి వ్యక్తి ఒకవేళ టీడీపీని వీడితే అది వైసీపీకే ప్లస్ అవుతుందని తమ్ముళ్లు లెక్కలేస్తున్నారు. తనను ఎమ్మెల్యేను చేయడంతో పాటు, సోదరుడికి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చిన జగన్‌పైనే విధేయత ప్రకటించలేని ఆదినారాయణరెడ్డి టీడీపీకి నమ్మకస్తుడిగా ఎలా ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు..

ఈ పరిణామంపై రామసుబ్బారెడ్డి మీడియాతో బహిరంగంగానే తన అభిప్రాయం చెప్పారు. ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకురావడాన్ని తాము వ్యతిరేకిస్తామని చెప్పారు. ఒక ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకురావడం ద్వారా అవతలిపార్టీని దెబ్బతీయొచ్చన్న ఆలోచన వల్ల ప్రయోజనం ఉండదన్నారు. రామసుబ్బారెడ్డి కుటుంబానికి చెందిన ఓ మహిళ ప్రస్తుత పరిణామాలపై మీడియా ముందే కంటతడి పెట్టుకున్నారు. 30 ఏళ్లు కుటుంబసభ్యులను, ఆస్తులను పొగొట్టుకుని పార్టీకి కట్టుబడి ఉన్నామని.. అలాంటి తమకు చంద్రబాబు అన్యాయంచేయకూడదని కోరారు.

మొత్తం మీద కడప జిల్లా రాజకీయాల్లో లోకేష్ వేస్తున్న ఎత్తులు తెలుగుతమ్ముళ్లకే మింగుడుపడడం లేదు. తరతరాలుగా కష్టనష్టాల్లో పార్టీ కోసం నిలబడ్డవారిని పక్కనపెట్టి వారికి శత్రువులైన వారిని పార్టీలోకి తెస్తే మంచి ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. మంచి చేసిన వారికి విధేయుడిగా ఉండడం తెలియని ఆదినారాయణరెడ్డి వస్తే టీడీపీకి వచ్చే లాభమేంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు కడప జిల్లాలో వైఎస్ క్రేజ్‌తో, టీడీపీపై వ్యతిరేకతతో ఎమ్మెల్యేలు గెలుస్తున్న విషయాన్ని లోకేష్ గుర్తుపెట్టుకోవాలంటున్నారు.

First Published:  29 Sep 2015 1:04 AM GMT
Next Story