టీడీఎఫ్‌ ఛలో అసెంబ్లీ ఉద్రిక్తం… చుక్కా, వరవరరావు నిర్బంధం

తెలంగాణ డెమోక్రటిక్‌ ఫోరం (టీడీఎఫ్ ‌) తలపెట్టిన ఛలో అసెంబ్లీకి పోలీసులు తిర్కసరించినప్పటికీ అది జరపడానికే నిర్ణయించడంతో నగరంలో తీవ్ర ఉద్రక్తత చోటు చేసుకుంది. 135 ప్రజా సంఘాలు ఇందులో పాల్గొంటాయని ఆ ప్రతినిధులు ప్రకటించారు. దీంతో పోలీసులు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆయా సంఘాల ప్రతినిధులను, వామపక్షాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు. చుక్కా రామయ్యను ఎటూ కదలకుండా ఉండేలా గృహ నిర్భంధం విధించారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో వరవరరావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఖమ్మంలో న్యూ డెమొక్రసీ జిల్లా అధ్యక్షుడు రంగారావును పోలీసులు నిర్భంధించారు. హైదరాబాద్‌లో పోలీసులు ఉక్కు పిడికిలి బిగించారు. అసెంబ్లీ చుట్టూ, నిజాం కళాశాల చుట్టూ, ఇందిరాపార్కు చుట్టూ పోలీసులు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి ఒక్క మనిషిని కూడా బయటికి రాకుండా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్ష నేతలు, కార్యకర్తలు ఉన్నారని తెలుసుకుని అక్కడికి పోలీసు బలగాలు తరలించారు. ఎవరు బయటికి వచ్చినా అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఉస్మానియా యూనివర్శిటీ  లేడీస్‌ హాస్టల్‌  వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు హాస్టల్‌ విద్యార్థినిలను అదుపులోకి తీసుకోవడం, ఉస్మానియా యూనివర్శిటీ వద్ద ఆర్ట్స్‌ కాలేజీ విద్యార్థులను నిర్బంధించడంతో మొత్తం ఉద్రిక్త వాతావారణ ఏర్పడింది.

మంగళవారం సాయంత్రం నుంచి పలు జిల్లాల్లో వేలాది మంది కార్యకర్తలను, వామపక్షాల నాయకులను హైదరాబాద్‌ రాకుండా నిరోధించడానికి ముందస్తు అరెస్ట్‌లు చేశారు. వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై ప్రతిపక్షాలు నోరు విప్పాలని, అధికారపక్షం, ప్రభుత్వం ప్రజల నోరునొక్కడానికి ప్రయత్నిస్తున్న వేళ మౌనంగా ఉండడం సరికాదని వారు డిమాండు చేశారు. తాము శాంతియుతంగానే ర్యాలీ నిర్వహిస్తామని, 135 సంఘాలతో కూడిన సమాఖ్య ఇందుకు నిర్ణయించిందని, దీన్ని ఆపడానికి ప్రయత్నిస్తే తరువాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలంగాణ డెమోక్రటిక్‌ ఫోరం హెచ్చరించింది. ఛలో అసెంబ్లీని పురస్కరించుకుని ప్రజా సంఘాల నేతలను పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్‌లు చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకుంటున్నట్టు పోలీసులు చెబుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటికే పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. 10 జిల్లాల్లో ఇప్పటివరకు వెయ్యి మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారని, ఖమ్మంలోను, వరంగల్‌లోను, మహబూబ్‌నగర్‌లోను అరెస్ట్‌ చేసిన టీడీఎఫ్‌ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండు చేశారు.

వాస్తవానికి తెలంగాణ డెమోక్రటిక్‌ ఫోరం (టీడీఎఫ్ ‌) తరపున బుధవారం ఉదయం చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి చేసిన విజ్ఞప్తిని పోలీసులు తిరస్కరించారు. ఛలో అసెంబ్లీకి అనుమతిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశముందని పోలీస్ అధికారులు తెలిపారు. తెలంగాణ డెమోక్రటిక్‌ ఫోరం మావోయిస్టులకు మద్దతుగా పనిచేస్తుందని, ఇప్పటికే మావోయిస్టు పార్టీ, అనుబంధ సంఘాలపై నిషేధం ఉందని నగర సీపీ వ్యాఖ్యానించారు. అయితే పోలీసులు అనుమతి నిరాకరించినా ఛలో అసెంబ్లీ జరిగి తీరతామని ప్రజా సంఘాలు ప్రకటించడం, పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు జరపడంతో ఇరుపక్షాలు ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. టీడీఎఫ్‌ సభ్యులను ఒక్క అడుగు కూడా ముందుకేయనివ్వమని పోలీసులు, ఛలో అసెంబ్లీ జరిపి తీరుతామని టీడీఎఫ్‌ ప్రతినిధులు ప్రకటించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొ్ంది.  టీడీఎఫ్‌లో నిషేధిత సంస్థలేవీ లేవని, పోలీసులు కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని టీడీఎఫ్‌ ప్రతినిధులు ఆరోపించారు.