‘దేశం’ కమిటీలపై ఏపీలో రగులుతున్న అసంతృప్తి!

naniనందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబునాయుడు జాతీయ పార్టీగా ప్రకటించుకున్నాడు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా తన పేరును, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా తన కుమారుడు లోకెష్‌ను నియమించి ఆనందపడుతున్న చంద్రబాబుకు ఆ సంతోషం ఎక్కువ కాలం ఉండేటట్లు లేదు. చంద్రబాబు నియమించిన టిడిపి కమిటీలపై చాలామంది టిడిపి సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారు తమ అసంతృప్తిని ఎప్పుడెప్పుడు వెళ్ళగక్కుదామా అని ఎదురు చూస్తున్నారు.

పార్టీలో ఎంతో కాలంగా పని చేస్తున్న తమను ప్రక్కకునెట్టి… గత్యంతరం లేక వేరే పార్టీల్లోంచి వచ్చిన నాయకులకు, అసలు రాజకీయ అనుభవం లేని తన కుమారుడు లోకెష్‌కు చంద్రబాబు పెద్దపీట వేస్తున్నాడని పార్టీ పెద్దలు ఆవేదన చెందుతున్నారు. టిడిపి అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని అలాంటి పార్టీలో జైళ్ళకు వెళ్ళోచ్చిన వారికి… పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి పార్టీ కమిటీలలో చోటు కల్పించడం వల్ల ప్రజలకు తెలుగుదేశం పార్టీపై ఉన్న గౌరవం పోతుందని కొంతమంది టిడిపి నేతలు ఆందోళన చెందుతున్నారు.

ఉత్తరాంధ్రలో ఆగ్రహం

రెండు తెలుగు రాష్ట్రాలకు చంద్రబాబు టిడిపి కమిటీలను వేశాడు. అటూ తెలంగాణా… ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని టిడిపి నాయకులు ఈ కమిటీల ఎంపికపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎపిలో అయితే అసంతృప్తుల బెడద ఎక్కువగానే ఉంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన గౌతు శివాజి పార్టీ ఆవిర్భావం నుంచి టిడిపిలో కొనసాగుతూ… జిల్లాలో అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి ఇవ్వక పోగా… కేంద్ర కమిటీలోగాని, రాష్ట్ర కమిటీలోగాని చోటు కల్పించక పోవడంతో చంద్రబాబుతో అమీతుమి తేల్చుకోవడానికి శివాజి సిద్ధపడుతున్నాడు.

పెదవి విరుస్తున్న గంటా

ఉత్తరాంధ్రాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా పార్టీ కమిటీలపై పెదవి విరుస్తున్నాడు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అన్నీ విధాలా సాయపడిన తనకు కమిటీల్లో చోటు కల్పించకపోగా… తన ప్రత్యర్ధి అయిన అయ్యన్నపాత్రుడికి అవకాశమిచ్చి చంద్రబాబు తనను అవమానించాడని గంటా భావిస్తున్నాడు. రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణామైన పశ్చిమగోదావరి జిల్లా రుణం తీర్చుకుంటానని పదేపదే చెప్పే చంద్రబాబు… గత కమిటీలో జిల్లా నుంచి తొమ్మిది మందికి చోటు ఉండగా… ఇప్పుడు మాత్రం ఐదుగురికే చోటు కల్పించి చేతులు దులుపుకున్నాడు.

ఇంక ప్రకాశం జిల్లా విషయానికొస్తే పార్టీ కోసం ఏళ్ళ తరబడి పనిచేస్తున్న వారిని కాదని… వేరే పార్టీ నుంచొచ్చిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి, జూపూడి ప్రభాకర్‌కు కమిటీలో చోటు కల్పించడంతో ప్రకాశం జిల్లా టిడిపి శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. టిడిపి సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి కూడా చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వక పోగా… కమిటీలో కూడా చోటు కల్పించక పోవడంతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ తెలుగుదేశంలోనూ…

మరొక తెలుగు రాష్ట్రం తెలంగాణాలో కూడా టిడిపి కమిటీపై అసంతృప్తి సెగలు రెగుతున్నాయి. తెలంగాణా వర్కింగ్ ప్రెసిడెంటు పదవిని రేవంత్ రెడ్డికి ఇవ్వడంతో… తెలంగాణా రాష్ట్ర టిడిపి సీనియర్ నాయకులైన ఎర్రబెల్లి దయాకర్రావు, మోత్కుపల్లి నర్శింహులు, ఉమా మాధవరెడ్డి వంటి వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. తనలాంటి సీనియర్‌కు తగిన పదవి ఇవ్వకుండా అవమానించారని సాయన్న కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ టీడీపీ ఎన్నికల కమిటీకి కన్వీనర్లుగా చేసిన పెద్దిరెడ్డి, ఇదే పదవిని నిర్వహించిన కళావెంకటరావును పోల్చకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను పార్టీ అధికార పదవిలో ఉంచి కళాకు ఏకంగా ఏపీ టీడీపీకి అధ్యక్షుడిని చేయడాన్ని ఆయన సన్నిహితుల వద్ద ప్రశ్నిస్తున్నారు. ఇక కృష్ణయాదవ్‌ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా లేదు. టీటీడీపీ నగర బాధ్యతలు తనకు అప్పగిస్తారనుకున్న ఆయనకు నిరాశే మిగిలింది. పార్టీ నుంచి వైదొలగే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అటు తెలంగాణలోను, ఇటు ఆంద్రప్రదేశ్‌లోను కూడా చంద్రబాబు నియమించిన కమిటీలు పార్టీకి మేలు చేయకపోగా కీడు చేసేట్టుగానే కనిపిస్తున్నాయి. చంద్రబాబునాయుడు ప్రకటించిన టిడిపి కమిటీలపై నివురుకప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఏక్షణాన్నయినా చంద్రబాబుకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చని పార్టీ సినీయర్లు అంటున్నారు.

– సవరం నాని