Telugu Global
POLITICAL ROUNDUP

చంద్రబాబు వైఖరి ప్రాంతీయ చిచ్చు రేపుతోందా?

అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కావడంవల్ల వెనుకబడిన ప్రాంతాల్లో ఉద్యమాలు వస్తాయని చరిత్రలో చూశాం. హైదరాబాద్ రాజధానిగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అదే జరిగింది.  ఒక ప్రాంతంపై మరో ప్రాంతం పెత్తనం సాగితే ప్రత్యేక ఉద్యమం తప్పదని తెలంగాణ ఉద్యమం చాటిచెప్పింది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక కూడా ఏపీలో పాలకుల వైఖరి మారడం లేదు. రాజధాని నిర్మాణం, ఆప్రాంత అభివృద్ధి, పెట్టుబడులు, భూముల సమీకరణ చుట్టే పాలన తిరుగుతోందన్న భావన ఉంది.. చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న […]

చంద్రబాబు వైఖరి ప్రాంతీయ చిచ్చు రేపుతోందా?
X
అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కావడంవల్ల వెనుకబడిన ప్రాంతాల్లో ఉద్యమాలు వస్తాయని చరిత్రలో చూశాం. హైదరాబాద్ రాజధానిగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అదే జరిగింది. ఒక ప్రాంతంపై మరో ప్రాంతం పెత్తనం సాగితే ప్రత్యేక ఉద్యమం తప్పదని తెలంగాణ ఉద్యమం చాటిచెప్పింది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక కూడా ఏపీలో పాలకుల వైఖరి మారడం లేదు. రాజధాని నిర్మాణం, ఆప్రాంత అభివృద్ధి, పెట్టుబడులు, భూముల సమీకరణ చుట్టే పాలన తిరుగుతోందన్న భావన ఉంది.. చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వెనుక బడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర వాసుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్రం బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చింది. అయినా ఇప్పటి వరకు చంద్రబాబు కేంద్రం నేతల ముందు ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు కనిపించదు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కింద కేంద్రం ఈ జిల్లాలకు ఇస్తున్న నిధులను కూడా ఏపీ ప్రభుత్వం రాజధాని అవసరాలకు మళ్లించిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇవే కాకుండా కీల‌క‌మైన అనేక సంస్థల ఏర్పాటులో ఉత్తరాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌కు అన్యాయం జరిగేలా వ్యవ‌హ‌రిస్తోంది.
సీమలో ఇప్పటికే అస్తిత్వ పోరు
మరోవైపు రాయలసీమలో ఇప్పటికే మరో ఉద్యమం పురుడు పోసుకుంది. తిరుపతిలోని పద్మావతీ మెడికల్ సీట్ల వ్యవహారం రాయలసీమ వాసుల్లో స్థానికత చిచ్చు పెట్టింది. ఈ సీట్లలో మెజారిటీ సీట్లు రాయలసీమ ప్రాంతానికి చెందుతూ వస్తున్నాయి. అయితే ఈఏడాది ప్రభుత్వం జీవో120 విడుదల చేసి వివాదానికి కారణమైంది. ఈ జీవో వల్ల అన్ని ప్రాంతాల వారీకీ అవకాశాలు కల్పించామని ప్రభుత్వం అంటోంది. అయితే వెనకబడిన రాయలసీమ వాసులకు కేటాయించిన కోటాను ఎలా మారుస్తారని సీమ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా రాయలసీమ విద్యార్థులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం సీమ వాసులను మరింత ఆగ్రహానికి గురిచేసింది. ఆ తరువాత సుప్రిం కోర్టు కూడా ప్రభుత్వానికి మొట్టికాయలు వేసి వచ్చే విద్యాసంవత్సరం నుంచి జీవో 120 చెల్లదని తీర్పు ఇచ్చింది. చంద్రబాబు వైఖరి వల్ల రాయలసీమ విద్యార్ధులకు దక్కవలసిన మెడికల్ సీట్లను కోల్పోయారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రం మొత్తానికి కాక‌ ఒక ప్రాంతానికే ప్రాతినిథ్యం వహిస్తున్నట్టు కనిపిస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే సీమజిల్లాల్లో రాయలసీమ పరిరక్షణ పేరుతో ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఉత్తరాంధ్రలో ఎయిర్ పోర్టు చిచ్చు
అటు ఉత్తరాంధ్రలోనూ ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. విజయనగరం జిల్లా బోగాపురంలో ఎయిర్ పోర్ట్ కోసం 16వేలకు పైగా ఎకరాలు సేకరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్థానికులు వ్యతిరేకించారు. ఎయిర్ పోర్టు నిర్మాణానికి అన్ని భూములు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. రాజ‌ధాని ఊసు త‌ప్ప ఉత్తరాంధ్ర వ‌ల‌సాంధ్రగా మారుతున్నా పట్టించుకోవడం లేదన్న భావన ప్రజల్లో పెరిగిపోతోంది. ఇక ప‌ట్టిసీమ ద్వారా రాయలసీమకు నీరు ఇస్తామంటున్న ప్రభుత్వ హామీని సీమవాసులు నమ్మడం లేదు. పట్టిసీమ పనులు హ‌డావిడిగా ప్రారంభించ‌డం వెనుక పెద్ద వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది. రాజ‌ధాని శంఖుస్థాప‌నలోపు కృష్ణా బ్యారేజీకి నీటిని త‌ర‌లించే ప్లాన్ లో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఒక ప్రాంత ప్రయోజనం కోసమో, మరో వర్గం ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఇతర ప్రాంతాలకు అన్యాయం చేసే పరిస్థితులు తలెత్తితే భవిష్యత్తుకే ప్రమాదం.
ఇప్పటికైనా ఆంధ్రా, రాయ‌ల‌సీమ ప్రాంతాల మ‌ధ్య విభ‌జ‌న రేఖ‌ గీసే ధోర‌ణికి ప్రభుత్వం దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాకాకపోతే ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో మరోసారి ప్రత్యేక ఉద్యమాలు వచ్చినా ఆశ్చర్యం లేదు.
First Published:  2 Oct 2015 1:23 AM GMT
Next Story