Telugu Global
CRIME

బొమ్మ తుపాకీతో డ్యూటీ చేసిన నల్లగొండ ఎస్‌ఐ

మొన్నీ మధ్య నల్లగొండ జిల్లాలో ఓ ఎస్ఐ … ఓ పేద మహిళకు చెందిన మేకలు అమ్ముకున్న ఘటన మరవకముందే డిపార్ట్‌మెంట్‌నే దిగ్బ్రాంతికి గురి చేసే పని చేశారు మరో ఎస్‌ఐ. నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్ ఎస్‌ఐ చేసిన ఘనకార్యం చూసి పోలీసులంతా ముక్కున వేలేసుకుంటున్నారు. పెన్‌పహాడ్ పీఎస్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ శంకర్‌ రెడ్డి ఆరు నెలలుగా బొమ్మ తుపాకీతో డ్యూటీ చేశారు.  ఈ విషయం బయటకు పొక్కకుండా చాలా తెలివిగా వ్యవహరించారు. అయితే ఆరు నెలల తర్వాత […]

బొమ్మ తుపాకీతో డ్యూటీ చేసిన నల్లగొండ ఎస్‌ఐ
X

మొన్నీ మధ్య నల్లగొండ జిల్లాలో ఓ ఎస్ఐ … ఓ పేద మహిళకు చెందిన మేకలు అమ్ముకున్న ఘటన మరవకముందే డిపార్ట్‌మెంట్‌నే దిగ్బ్రాంతికి గురి చేసే పని చేశారు మరో ఎస్‌ఐ. నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్ ఎస్‌ఐ చేసిన ఘనకార్యం చూసి పోలీసులంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

పెన్‌పహాడ్ పీఎస్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ శంకర్‌ రెడ్డి ఆరు నెలలుగా బొమ్మ తుపాకీతో డ్యూటీ చేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా చాలా తెలివిగా వ్యవహరించారు. అయితే ఆరు నెలల తర్వాత కథ అడ్డం తిరిగింది. శంకర్‌ రెడ్డిది మహబూబ్‌నగర్ సొంత జిల్లా. ఆరు నెలల క్రితం సొంతూరు వెళ్లిన ఆయన కుటుంబసభ్యులతో కలిసి కర్నాటకలోని ఓ ఆలయానికి వెళ్లారు. దర్శనానికి వెళ్తున్న సమయంలో తుపాకీని ఆలయం బయట డిపాజిట్ చేసి వెళ్లారు. అయితే సరైన వ్యక్తుల వద్ద దాన్ని డిపాజిట్ చేయలేదన్న విషయం దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత గానీ ఎస్‌ఐకి అర్థం రాలేదు. అప్పటికే తుపాకీని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు.

తుపాకీ పోయిందని చెబితే ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారన్న భయంతో వెంటనే ఓ బొమ్మ తుపాకీని కొనుగోలు చేశారు. దాన్ని అసలు తుపాకీగా నమ్మిస్తూ డ్యూటీ చేశారు. అయితే ఎస్‌ఐ దగ్గర ఉన్నది బొమ్మ తుపాకీ అని మీడియాకు కొందరు సమాచారం అందించారు. దీనిపై ఆరా తీస్తే లేదు… నా తుపాకీ నా దగ్గరే ఉందంటూ ఫోటో తీసి వాట్సాప్‌లో కూడా పెట్టారు. దీంతో మీడియా ప్రతినిధులు కూడా ఆ విషయం జోలికి వెళ్లలేదు.

అయితే కర్నాటకలో పోయిన తుపాకీ అక్కడే ఓ భక్తుడికి దొరికింది. దీన్ని అక్కడి పోలీసులకు అందజేయగా … తుపాకీపై ఉన్న ఆనవాళ్లు బట్టి నల్లగొండ జిల్లా ఎస్పీకి పంపించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆరు నెలలుగా బొమ్మ తుపాకీతో డ్యూటీ చేసిన విషయం తెలుసుకుని ఎస్పీ కూడా షాకయ్యారు. వెంటనే ఎస్‌ఐ శంకర్‌ రెడ్డిని సస్పెండ్ చేశారు. నల్లగొండ జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు పదేపదే బయటపడుతున్న నేపథ్యంలో హఠాత్తుగా వారిని ఎదుర్కోవాల్సి వచ్చి ఉంటే పరిస్థితి ఏమిటని అందరూ ఆందోళన చెందుతున్నారు.

First Published:  2 Oct 2015 7:51 AM GMT
Next Story