య‌జ‌మాని కోసం ప్రాణాలు ఇచ్చిన శున‌కం!

ఈ భూమి మీద 40 వేల ఏళ్లుగా మ‌నిషికి అత్యంత విశ్వాసంగా ఉంటున్న ఏకైక జీవి కుక్క‌. ఇవి య‌జ‌మానికి కోసం ప్రాణాలు ఇవ్వ‌డానికైనా వెన‌కాడవు. తాజాగా ఓ కుక్క త‌న య‌జ‌మాని కోసం ప్రాణాలు అర్పించిన ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని ట్యుటికోరిన్‌లో జ‌రిగింది. ట్యుటికోరిన్ పట్టణానికి చెందిన ఓ మహిళ తన ఇంట్లో ప‌మ్మేరియ‌న్ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నది. గురువారం రాత్రి ఓ విష‌నాగు ఇంట్లోకి దూరింది. దీంతో కుక్క దాన్ని చూసి మొర‌గ‌డం ప్రారంభించింది. అదే ప‌నిగా కుక్క ఎందుకు మొరుగుతుందోన‌ని య‌జ‌మానికి త‌లుపు తీసింది.

వెంట‌నే ఆ మ‌హిళ‌ను కాటేయడానికి ఆ నాగు పాము య‌త్నించింది. ప్ర‌మాదాన్ని ప‌సిగ‌ట్టిన కుక్క ఒక్క ఉదుటున పాముపైకి దూకింది. రెండింటి మ‌ధ్య భీక‌ర పోరు జ‌రిగింది. రెండూ ప‌ర‌స్ప‌రం క‌రుచుకున్నాయి. మొత్తానికి పామును చంపిన కుక్క స్పృహ త‌ప్పిప‌డిపోయింది. తేరుకున్న య‌జ‌మానురాలు కుక్క‌ను హుటాహుటిన ప‌శువుల‌ ఆసుప‌త్రికి త‌ర‌లించింది. ఆసుప‌త్రి వైద్యులు ప‌రీక్షించి మార్గ‌మ‌ధ్య‌లోనే కుక్క చ‌నిపోయింద‌ని నిర్ధారించారు. తన యజమాని కోసం ప్రాణ త్యాగం చేసిన ఆ శునకాన్ని చూసి జనం చలించిపోయారు.