ఆప్ఘన్ హాస్పిటల్‌పై అమెరికా బాంబుల వర్షం

ఆప్ఘ్ఘనిస్తాన్‌లో తీవ్రవాదులను లక్ష్యంగా చేసుకుని అమెరికా వైమానిక దళం వేసిన బాంబులు కుందుజ్ నగరంలోని ఓ దవాఖాన మీద పడటంతో 19 మంది మరణించారు. పదుల సంఖ్యలో జనం గాయపడ్డారని ఈ దవాఖాను నిర్వహిస్తున్న ఫ్రాన్స్ వైద్యసేవాసంస్థ మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ (ఎంఎస్‌ఎఫ్) ప్రకటించింది. దవాఖానాపై అమెరికా జరిపిన దాడి అంతర్జాతీయ వివాదాలకు కారణమవుతోంది. సామర్థ్యానికి మించి రోగులను చేర్చుకుని చికిత్స చేస్తుండడంతో నష్టం ఎక్కువగా జరిగిందని ఎంఎస్‌ఎఫ్ తెలిపింది. అరగంటపాటు ఎడతెరిపి లేకుండా జరిగిన బాంబుదాడుల్లో అత్యవసర చికిత్సా విభాగం తీవ్రంగా దెబ్బతిన్నది. 12 మంది వైద్య సిబ్బంది, ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో 37 మంది గాయపడ్డారు. ఈ దాడి అంతర్జాతీయ మానవహక్కుల ఉల్లంఘన తప్ప మరోటి కాదని ఎంఎస్‌ఎఫ్ విమర్శించింది.