Telugu Global
Others

విజయమే లక్ష్యంగా బీజేపీ 'మిషన్‌ బీహార్‌'!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశకు మరో వారం రోజుల్లో తెర లేస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు బీజేపీ కొత్త వ్యూహాలతో ముందుకు కదులుతోంది. ముందుగా రాష్ట్ర పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలపై దృష్టి పెట్టింది. దీన్ని చక్కబెట్టేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా బీహార్‌లోనే మకాం వేశారు. గెలుపు సాధించాలంటే క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తిని పోగొట్టాలని పార్టీ తీర్మానించింది. ఇందులో భాగంగా అమిత్ షా ‘మిషన్‌ బీహార్‌’ను ప్రారంభించారు. బీహార్‌ మొదటిదశలో 583 […]

విజయమే లక్ష్యంగా బీజేపీ మిషన్‌ బీహార్‌!
X
peddi rajuబీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశకు మరో వారం రోజుల్లో తెర లేస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు బీజేపీ కొత్త వ్యూహాలతో ముందుకు కదులుతోంది. ముందుగా రాష్ట్ర పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలపై దృష్టి పెట్టింది. దీన్ని చక్కబెట్టేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా బీహార్‌లోనే మకాం వేశారు. గెలుపు సాధించాలంటే క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తిని పోగొట్టాలని పార్టీ తీర్మానించింది. ఇందులో భాగంగా అమిత్ షా ‘మిషన్‌ బీహార్‌’ను ప్రారంభించారు.
బీహార్‌ మొదటిదశలో 583 మంది పోటీ చేస్తుండగా ఇదులో 174 మంది నేరచరితులున్నారు. హత్యలు‌, హత్యాయత్నం, మతకలహాలు సృష్టంచడం, కిడ్నాప్‌, మహిళలను వేధించడం వంటి అన్ని రకాల నేరాలు చేసినవాళ్లు ఇందులో ఉన్నారు. వీరిలో బీజేపీ టికెట్లు ఇచ్చినవారు కూడా ఉన్నారు. అన్ని పార్టీల మాదిరిగానే బీజేపీ కూడా కోటీశ్వరులకు టికెట్లిచ్చింది. మొత్తం తొలిదశలో 146 మంది కోటీశ్వరులున్నారు. పార్టీ కోసం శ్రమిస్తున్న వారికి కాకుండా నేరస్థులకు, కోటీశ్వరులకు టికెట్లు ఇవ్వడం అన్ని పార్టీల్లో కూడా అసంతృప్తికి కారణమైంది. ఇలాంటి అసంతృప్తిని తొలగించడానికి అమిత్‌ షా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.

రాజధాని పాట్నా కేంద్రంగా ప్రచార కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న అమిత్ షా పార్టీలోని అన్ని వర్గాలను ఒకతాటిపై తెచ్చేందుకు శ్రీకారం చుట్టారు. అంతర్గత విభేదాలను పక్కనబెట్టి పని చేయాలని ఆదేశించారు. బీహార్‌కు చెందిన కేంద్ర మంత్రులు విధిగా ప్రచారంలో పాల్గొనాలని ఆదేశించారు. ఈనెల 12న బీహార్ తొలిదశ ఎన్నికలు జరుగుతుండగా ఎక్కువ సమయం తీసుకోకుండా ఒకట్రెండు రోజుల్లో పరిస్థితులను చక్కబెట్టాలని అమిత్ షా నిర్ణయించుకున్నారు. అమిత్ షా తన వ్యూహంలో భాగంగా బీహార్ పార్టీని 12 జోన్లుగా విభజించారు.

బీహార్‌లో 37 జిల్లాలుండగా ప్రతి జోన్‌లో 3 జిల్లాలు ఉండేలా చూశారు. ప్రతీ జోన్‌కు ‘రాజనీతిక్ ప్రహారీ’ పేరుతో ఒక ఇంఛార్జ్‌ని నియమించారు. కేంద్ర మంత్రులైన రవిశంకర్ ప్రసాద్, గిరి రాజ్‌సింగ్, రాజీవ్ ప్రతాప్ రూఢి లాంటి వారిని రాజనీతిక్ ప్రహారీలుగా నియమించినట్లు సమాచారం. వీరికి అరెస్సెస్ నుంచి వచ్చిన ఒక నాయకుడు సహాయకుడిగా ఉంటారు. ఆరెస్సెస్ పర్వవేక్షణలో ఈ ఎన్నికల్లో గెలవటం సాధ్యమని బీజేపీ భావిస్తోంది. క్రిందిస్థాయిలో సంఘ్‌కు పట్టున్న ప్రాంతాల్లో ఆరెస్స్‌స్‌ కార్యకర్తల సహాయాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

బీహార్‌లో బీజేపీకి 80 లక్షల మంది క్రియాశీల సభ్యులున్నారు. గతేడాది నిర్వహించిన పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో చాలామంది పార్టీలో చేరారు. బీహార్‌లో 18 నుంచి 40 సంవత్సరాల వయసున్న ఓటర్లు 60 శాతం మంది ఉండటంతో బీజేపీ వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బస్సులు, ఆటోలు, రిక్షాలు, టీ షాపుల్లో ప్రచార కార్యక్రమం నిర్వహించాలని కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి జిల్లాలో ఒక బహిరంగ సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మోడీ ఇమేజ్ తమ విజయానికి దోహదం చేస్తుందని అమిత్ షా చెబుతున్నారు.

ప్రత్యర్థి మహాకూటమి పార్టీలు సైతం గెలుపుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అమిత్‌ షా మిషన్‌ బీహార్‌ ప్రారంభించడం విపక్ష కూటమికి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రధాని మోడీపై విమర్శలు గుప్పిస్తూ… ఆయన అనేక రంగాల్లో వైఫల్యం చెందారంటూ విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు ఆరెస్సెస్‌ క్యాడర్‌ను రంగంలోకి దించాలని భావిస్తున్నారు. మాటకారి తనం ఎక్కువగా ఉండే ఈ క్యాడర్‌ విపక్షాలకు ధీటైన సమాధానం చెప్పగలదని భావిస్తున్నారు. గడిచిన కాలంలో రాష్ట్రంలో సీఎం నితీష్ చేసిన పనుల్లో డొల్లతనాన్ని ఎత్తి చూపడానికి ప్రయత్నిస్తున్నారు.

– పీఆర్‌ చెన్ను
First Published:  3 Oct 2015 9:48 PM GMT
Next Story