కేటీఆర్‌కు నోరిచ్చిన కేసీఆర్‌

ఆధునిక రాజ‌కీయ నేత‌ల్లో మాట‌ల మాంత్రికుడిగా పేరుగాంచాడు తెలంగాణ సీఎం కేసీఆర్‌. అంశం ఏదైనా అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌గ‌ల నేర్ప‌రి. చ‌రిత్ర‌, తెలుగుభాష‌తో పాటు ఇంగ్లీష్‌, హిందీ, ఉర్దూ భాష‌ల్లో ప్రావీణ్యం కేసీఆర్ సొంతం. కేసీఆర్ ప్ర‌సంగం ప్రారంభిస్తే..ప్ర‌త్య‌ర్థులు కూడా వినాల‌నుకునేంత ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంది. అయితే ఇటీవ‌ల కాలంలో త‌న‌దైన శైలి ప్ర‌సంగాల‌కు కేసీఆర్ కొద్ది కొద్దిగా దూరం అవుతున్నారు. ఇదే స‌మ‌యంలో త‌న‌యుడు, రాజ‌కీయ వార‌సుడు కేటీఆర్ త‌న స్టైల్‌లో దూసుకుపోతున్నాడు. అసెంబ్లీలో, బ‌హిరంగస‌భ‌ల్లో, కార్య‌క్ర‌మాల్లో తండ్రిని మించిన త‌న‌యుడిలా వాడివేడి ప్ర‌సంగాల‌తో ఆక‌ట్టుకున్నాడు. విప‌క్షాల‌పైనా ప‌దునైన విమ‌ర్శ‌ల‌తో విరుచుకు ప‌డుతున్నాడు. మాట‌కు మాట కౌంట‌రివ్వ‌డంలో తండ్రి త‌ర్ఫీదు ఇచ్చిన‌ట్టే మాట‌ల తూటాలు వ‌దులుతున్నారు. ఆరోప‌ణ‌ల‌కు స‌మాధాన‌మిస్తూనే ప్ర‌త్యారోప‌ణ‌ల‌తో ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో కేటీఆర్ వాగ్ధాటి చూస్తే ఇది స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతోంది.

ఢిల్లీలో ఒక నాయుడు..గ‌ల్లీలో ఒక నాయుడు
కేటీఆర్ మాట‌ల దూకుడు ప్ర‌ద‌ర్శిస్తూనే ఉన్నారు. మాట‌ల తూటాలు పేలుతున్నాయి. కేటీఆర్ ఎక్కుపెట్టే విమ‌ర్శ‌ల బాణాలు నేరుగా ఆయా నేత‌ల‌నే తాకుతున్నాయి. తాజాగా కేటీఆర్ ఇద్ద‌రు నాయుడుల‌ను టార్గెట్ చేస్తూ ప్ర‌సంగించిన తీరు హైలైట్ ఉంద‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాలు ప్ర‌శంసిస్తున్నారు. ఢిల్లీలో ఒక నాయుడు, గల్లీలో ఒక నాయుడు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని కేటీఆర్ విరుచుకు ప‌డ్డారు.
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులు క‌లిసిన తెలంగాణ‌కు తీర‌ని అన్యాయం చేస్తున్నార‌ని ఆరోపించిన కేటీఆర్‌..అటు ఆంధ్రా ప‌క్ష‌పాతాన్ని..ఇటు బీజేపీ, టీడీపీల‌ను ఇర‌కాటంలో పెట్టేలా నేర్ప‌రిగా విమ‌ర్శ‌లు సంధించారు.
 అసెంబ్లీలో అక్బ‌రుద్దీన్‌కు అడ్డుక‌ట్ట‌
తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతుండ‌గా కేటీఆర్ ఘాటుగా కౌంట‌రిచ్చారు. ఏదైనా చెప్పాలనుకుంటే సూటిగా చెప్పాలని సూచించారు.  మా స‌ర్కారుపై  తేడాగా మాట్లాడితే ఊరుకోమని సీదా…సీదాగా మాట్లాడాలని అక్బరుద్దీన్‌‌ను మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. అస‌లే అక్బ‌రుద్దీన్‌..ఆపై అస‌లు సిస‌లైన ఇంగ్లీష్‌.. గ‌న్‌లోంచి బుల్లెట్ల‌లా మాట‌లు దూసుకొస్తాయి. అటువంటి అక్బ‌రుద్దీన్‌ను అసెంబ్లీలో కేసీఆర్ స్టైల్ ఫాలో అయి కేటీఆర్ నిలువ‌రించ‌గ‌లిగారు.

 నా కొడుకే తినేదే పేద‌ల‌కు పెడుతున్నాం
 ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మనవడు (అంటే త‌న కొడుకు హిమాంశు) తింటున్న బియ్యమే పేద విద్యార్థులకు ఇస్తున్నామని, హాస్టళ్ల విద్యార్థులకు సన్న బియ్యం ఇస్తున్నామని చెప్ప‌డంలో తాము పేద‌ల‌కు ఎంత మేలు చేస్తున్నామో! త‌మ‌తో స‌మానంగా ఎలా చూసుకుంటున్నామో ఓ ఉదాహ‌ర‌ణ‌గా చెప్పారు. కేసీఆర్ చైనా ప‌ర్య‌ట‌న నుంచి వ‌చ్చిన త‌రువాత చాలా వ‌ర‌కూ జ‌రిగిన స‌మావేశాల్లో గ‌త శైలికి భిన్నంగా ప్ర‌సంగాలు సాగుతున్నాయి. అదే స‌మ‌యంలో కేటీఆర్ త‌న తండ్రి మాట‌తీరును పుణికిపుచ్చుకుని దూసుకుపోతున్నారు.

-కుసుమారావు