ఇద్ద‌రు పిల్ల‌ల‌కు విష‌మిచ్చి దంప‌తుల ఆత్మ‌హ‌త్య‌

ఆర్థిక స‌మ‌స్య‌లు తాళ‌లేక‌ ఒకే కుటుంబంలో న‌లుగురిని బ‌లి తీసుకున్న ఘ‌ట‌న హైద‌రాబాద్‌లో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున జ‌రిగింది. జీడిమెట్ల పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఇంద్ర‌సింగ్ న‌గ‌ర్‌లో నివ‌సిస్తున్న కేశ‌వ‌రావు (35), వ‌న‌జ (32) దంప‌తులు. స్థానికంగా స‌మోసాల వ్యాపారం చేసుకుంటున్నారు. వీరికి దీప‌క్ (5), నందిని (3) ఇద్ద‌రు పిల్ల‌లు. 12 ఏళ్ల క్రితం కోల్‌క‌తా నుంచి న‌గ‌రానికి వ‌ల‌స వ‌చ్చారు. మొద‌ట్లో చేసిన వ‌డ్డీ వ్యాపారంలో న‌ష్టాలు చ‌వి చూశారు. దీంతో కొంత‌కాలంగా స‌మోసాల వ్యాపారం చేస్తున్నారు. ఇందులోనూ న‌ష్టాలే రావ‌డంతో ఆర్థిక స‌మ‌స్య‌లు చుట్టుముట్టాయి. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం రాత్రి పిల్ల‌లు దీప‌క్‌, నందినిల‌కు విష‌మిచ్చి చంపారు. అనంత‌రం దంప‌తులిద్ద‌రూ చెరోక గ‌దిలో ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఇరుగు పొరుగువారు ఉద‌యం గ‌మ‌నించి పోలీసుల‌కు స‌మాచార‌మిచ్చారు. జీడిమెట్ల పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు.