సామాజిక న్యాయంలో చంద్రబాబు అన్యాయం!

naniతెలుగుదేశం పార్టీ స్థాపన ముఖ్య ఉద్దేశం బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలను కల్పించడం… సామాజిక న్యాయాన్ని అమలు చేయడమేనని ఆనాడు ఎన్టీఆర్‌ చెప్పారు. కాని ఈనాడు చంద్రబాబునాయుడు… ఎన్టీఆర్‌ ఆశయాలను, పార్టీ సిద్ధాంతాలను తుంగలోకి తొక్కి తనకు నచ్చిన విధంగా, తన కొడుకు మెచ్చిన విధంగా పని చేస్తున్నాడు. రోజురోజుకీ టిడిపిలో సామాజిక న్యాయమనేదానికి అర్ధం లేకుండా చేస్తున్నాడు…
అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు తనకు సమానమని… తను ఏపని చేసినా అన్ని వర్గాలను సంతృప్తి పరుస్తానని చంద్రబాబునాయుడు పదేపదే చెబుతాడు. ఈ మధ్య చంద్రబాబు చెప్పే మాటలకు చేసే పనులకు అసలు పొంతన ఉండట్లేదు. ఆయన సామాజిక న్యాయాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాడు. తన సామాజిక వర్గానికి తప్ప… మిగిలిన ఏ కులాలకు ఆయన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత తను ఏర్పాటు చేసుకున్న మంత్రిమండలి కూర్పును చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన ప్రభుత్వంలో అన్ని కీలక శాఖలను తన సామాజికవర్గానికే కట్టబెట్టాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పదవి మొదలుకొని కీలకమైన మంత్రి పదవులన్నీ ఆయన తన సామాజికవర్గానికే ఇచ్చుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఈ రాష్ట్రంలో నీటిపారుదల కూడా ఎక్కువే. ఇక ప్రజలకు నిత్యావసరాలు ఎంత అవసరమో వేరే చెప్పనక్కరలేదు. ఈ మూడు రంగాలకు చెందిన శాఖలను తన సామాజికవర్గానికి చెందినవారినే పెట్టుకున్నాడు. వ్యవసాయం, నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల సారధులను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అదేవిధంగా కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు మంత్రి పదవులను కేటాయిస్తే అందులో ఒకటి తన సామాజిక వర్గానికే అప్పగించాడు. అంతే కాకుండా ఢిల్లిలో ఎపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా కంభంపాటి రామ్మోహన్ రావును నియమించి ఆయన తన సామాజిక వర్గం అంటే ఎంత మక్కువో ప్రదర్శించాడు. 
ఇప్పటికే రాష్ట్రంలో అనేక ప్రభుత్వ, ప్రభుత్వేతర పదవులను తన సామాజికవర్గానికి అప్పగించిన చంద్రబాబునాయుడు …. ఇంతటితో ఆగాకుండా త్వరలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో పయ్యావుల కేశవను, గాలి ముద్దుకృష్ఞమనాయుడును మంత్రిమండలిలోకి తీసుకొవాలని భావిస్తున్నాడన్న వార్తలు ఆయనలో ఆ సామాజికవర్గం పట్ల ఉన్న మమకారాన్ని తెలియజేస్తోంది. చంద్రబాబు ఇలా వ్యవహరించడం తెలుగుదేశం పార్టీలో ఉన్న మిగిలిన సామాజికవర్గాల్ని కుంగదీస్తోంది. రాష్ట్రంలో కేవలం ఒక సామాజికవర్గం మాత్రమే ఓట్లేస్తే టిడిపి అధికారంలోకి రాలేదని… ఆనాడు అన్ని కులాలకు చెందిన ఓటర్లు ఓట్లేయడం వలనే చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం దక్కిందన్న విషయాన్ని మిగిలిన సామాజికవర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఈ విషయం మరిచిపోతే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాభవాల్ని చవి చూడాల్సి వస్తుందని బాబు తీరుపై ఆగ్రహంగా ఉన్న సామాజికవర్గాలు హెచ్చరిస్తున్నాయి.
– సవరం నాని