ప్రత్యేక హోదాపై రామోజీ వైఖరేంటి ?

peddi rajuఈ విషయం మరో 24 గంటల్లో తేలిపోతుంది. ఈ మధ్య రామోజీ-జగన్‌ కలయికతో కొంచెం… కొంచెం తెలిసిన ఈ విషయం మరికొన్ని గంటల్లో పూర్తిగా తేలిపోతుంది. ఎలాగంటే… వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్మోహనరెడ్డి ప్రత్యేక హోదాపై ఏపీ రాజధాని నగరంలో దీక్షకు దిగుతున్నారు. అది కూడా నిరవధిక నిరాహారదీక్ష. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ దీక్ష ముచ్చటగా మూడోసారి జరిపేందుకు ఆ పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ దీక్ష వాయిదాకు-అమలుకు మధ్యలో జగన్‌-రామోజీ కలిసి కొన్ని విషయాలపై చర్చించారు. ఆ విషయాలేమిటన్నది అప్రస్తుతం. కాని ఉప్పు, నిప్పులా ఉండే వీరిద్దరి కలయికా కొంత సంచలనం సృష్టించి మీడియాలో పలు ఆసక్తికర కథనాలకు తెర తీసింది. వీరిద్దరూ కలిసి పోయారని కొంతమంది అనగా… చంద్రబాబుతో ఏర్పడుతున్న దూరమే వీరిని దగ్గర చేసిందని మరి కొంతమంది భాష్యం చెప్పారు. ఎవరి భాష్యం ఏమైనా రేపటి దీక్షకు ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు ఎంతమేర సమర్ధిస్తాడన్న విషయం ఇపుడు అందరినీ ఆలోచింపజేసే అంశం.

ఇప్పటివరకు జగన్‌ ఏ దీక్ష చేసినా, ఏ కార్యక్రమం నిర్వహించినా తన ప్రసార సాధనాల్లో మమ అనిపించే రామోజీరావు వీరిద్దరి కలయిక తర్వాత ఏదో కొంత ప్రతిపక్షం కూడా ఉందన్నట్టు వార్తలు కనిపిస్తున్నాయి. దానికి కారణం సడలిన వాతావరణం. మరిప్పుడు ఏకంగా అధికారపక్షాన్నే సవాలు చేసే విధంగా జగన్‌ దీక్ష చేస్తున్నాడు. అది కూడా ఆంద్రప్రదేశ్‌ ప్రయోజనాలే లక్ష్యంగా. మరి ఈ నిరవధిక దీక్షకు తన ప్రసార సాధనాల్లో రామోజీరావు ఎంతటి ప్రాధాన్యత ఇస్తాడో చూసేందుకు అందరూ ఆరాటపడుతున్నారు. నిజంగా వీరిద్దరూ దోస్తి చేస్తున్నారా? లేక జనాన్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా? అని తెలుసుకునేందుకు ఇది మంచి అవకాశం. పైగా చంద్రబాబుతో బెడిసి ఉంటే జగన్‌కు అండగా ఉండాలి. కాని రామోజీ అంత త్వరగా ఏ విషయాన్ని బయటపడడు. బయటికి చెప్పడు.

రామోజీ-జగన్‌ కలిసినంత మాత్రాన పూర్తిగా ఈనాడు త‌న రూటు మార్చేసుకుంటుంద‌ని చెప్పడం తొంద‌ర‌పాటే అవుతుంది. గ‌తంలో దాస‌రి, ఉండ‌వ‌ల్లి, ల‌క్ష్మీపార్వతి… ఇలాంటి ప్రముఖులు ఎంద‌రినో టార్గెట్‌ చేసిన రామోజీ తన పత్రిక, ఛానల్‌ ద్వారా మీడియా ప‌వ‌ర్‌ ఏమిటో చూపించాడు. అలాంటి రామోజీ జగన్‌కు ఒక్కసారిగా పూర్తి స్థాయి అండదండలు అందిస్తాడంటే నమ్మని వారు కూడా అధికంగానే ఉన్నారు. అదీగాక వీరిద్దరి క‌ల‌యిక అనంతరం జ‌గ‌న్ చెప్పుకోద‌గిన కార్యక్రమం ఏదీ చేప‌ట్టని నేప‌ధ్యంలో నిజంగానే జ‌గ‌న్‌పై రామోజీ వైఖ‌రి మారిందో లేదో తేల‌డానికి, ఈ రాజీలో క‌వ‌రేజీ సైతం భాగ‌మేనా కాదా అనేది నిరూప‌ణ కావ‌డానికి గుంటూరులో ప్రత్యేక‌హోదాపై జ‌గ‌న్ చేప‌ట్టే దీక్ష తేటతెల్లం చేస్తుందని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.