రాతియుగం వైపు మళ్ళొద్దు: రాష్ట్రపతి హితవు

రోజురోజుకీ భారతీయ నాగరికత, నైతికత కొత్త పోకడలతో విలువలను పెంచేవిధంగా ఉండాలేకాని నాగరికత, నైతిక విలువలను పతనం అంచుకు దిగజార్చనీయవద్దని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 28న ఉత్తరప్రదేశ్‌లోని దాద్రి సమీపంలోని బిసాడా గ్రామంలో గోవును వధించి దాని మాంసం తిన్నారన్న అభియోగంతో 55 ఏళ్ల మహ్మద్ అక్లాఖ్ కుటుంబంపై దాడి చేయడం అనాగరికమని ఆయన అన్నారు. సుమారు 200 మంది స్థానికులు దాడి చేసి ఆయనను రాళ్లతో కొట్టి చంపడాన్ని రాష్ట్రపతి రాతియుగం నాటి పోకడలుగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ దారుణ ఘటనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి బుధవారం స్పందించారు. వైవిధ్యం, సహనం భారత దేశానికి మూల విలువలని, ఏ ఒక్కరు కూడా వీటిని దిగజార్చేలేలా ప్రవర్తించవద్దని ఆయన హితవు పలికారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు పది మందిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు.