Telugu Global
Others

చంద్రబాబు మనస్సు మార్చడానికే ఈ దీక్ష

ప్రత్యేక హోదా కోసం పోరాట సభలో జగన్‌ ప్రకటన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండు చేస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌. జగన్మోహనరెడ్డి గుంటూరులోని నల్లపాడు ప్రాంతంలో నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభం కావాల్సిన దీక్ష విమానం మిస్‌ అవడంతో నాలుగు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌ నుంచి కారులో వచ్చిన ఆయన ముందుగా విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని దీక్ష స్థలికి చేరుకున్నారు. అనంతరం ఆయన నల్లపాడులో దివంగత […]

చంద్రబాబు మనస్సు మార్చడానికే ఈ దీక్ష
X

ప్రత్యేక హోదా కోసం పోరాట సభలో జగన్‌ ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండు చేస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌. జగన్మోహనరెడ్డి గుంటూరులోని నల్లపాడు ప్రాంతంలో నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభం కావాల్సిన దీక్ష విమానం మిస్‌ అవడంతో నాలుగు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌ నుంచి కారులో వచ్చిన ఆయన ముందుగా విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని దీక్ష స్థలికి చేరుకున్నారు. అనంతరం ఆయన నల్లపాడులో దివంగత వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన దీక్షకు ఉపక్రమించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష స్థలికి వేలాది మంది తరలి రావడం పట్ల జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు. అక్కా, చెల్లి, అన్న, తమ్ముడు, తల్లి… అందరికీ చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు.

ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్నానని, ఇంతకుముందు బంద్‌లు నిర్వహించామని, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశామని, ఢిల్లీలో కూడా హోదా కోసం దీక్ష చేశామని అయినా ఏ ఒక్కరికీ బుద్ధి రాలేదని, చివరకు ఈ పోరాటం కొనసాగింపులో భాగంగా గుంటూరులో నిరవధిక దీక్షకు ఉపక్రమించామని ఆయన అన్నారు. ఈ దీక్ష చూసిన తర్వాత అయినా చంద్రబాబు మీద ఒత్తిడి పెరిగి కేంద్రాన్ని నిలదీస్తారని ఆశిస్తున్నామని, అసలు చంద్రబాబుకు ప్రత్యేక హోదా అవసరం తెలిసి కూడా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని, హోదా కోసం ప్రతి వీధిలో తిరిగి ప్రచారం చేసిన సీఎం ఇపుడు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేకహోదా ఆంధ్రప్రదేశ్‌కు సంజీవినిగా పని చేస్తుందని అన్నారు. పార్లమెంటులో ప్రధాని మన్మోహన్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతుందని తమకు తెలుసని అందుకే ప్రత్యేక హోదా ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారని, దీన్ని సాధించుకోవడంలో ప్రభుత్వం ఎందుకు ప్రయత్నం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ అన్యాయాన్ని పూడ్చాల్సిన బాధ్యత ఇపుడు అధికారంలో ఉన్న బీజేపీకి లేదా అని, దాన్ని సాధించి తెచ్చుకోవలసిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు.

ఎన్నికల మ్యానిఫెస్టోలో తాము ప్రత్యేక హోదా పది సంవత్సరాలిస్తామని బీజేపీ పెట్టిందని, ప్రచారంలో వీధివీధిలోను పది సంవత్సరాల ప్రత్యేక హోదా సాధిస్తామని చంద్రబాబు ఊదరగొట్టారని గుర్తు చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసిన ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇపుడు ఉన్న జాబులు ఊడపీకుతుందని ఆరోపించారు. ఆయనకు ముఖ్యమంత్రి అనే ఉద్యోగం వచ్చింది కాని నిరుద్యోగులు మాత్రం ఇంకా రోడ్డుమీదే ఉన్నారని, వారికి ఇస్తానన్న రూ. 2 వేల నిరుద్యోగ భృతి ఊసు కూడా ఎత్తడం లేదని జగన్‌ ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం నెల్లూరు, తిరుపతి, విజయవాడ, వైజాగ్‌లో ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆత్మబలిదానాలు చేసిన వారికున్న జ్ఞానం కూడా ఈ ముఖ్యమంత్రికి లేదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వస్తే 90 శాతం గ్రాంటుగా వస్తుందని మిగిలిన 10 శాతం మాత్రమే తిరిగి చెల్లించాల్సి వస్తుందని, ఈ విషయాలన్నీ చంద్రబాబుకు తెలిసినా ఎందుకు మాట్లాడలేకపోతున్నారని ఆయన ప్రశ్రించారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులు కట్టిస్తామని కేంద్రం నాయకులు హామీ ఇచ్చారని, కాని దీన్ని కూడా ఏపీ నాయకులు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. అలాగే మెట్రో రైల్‌ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే 15 వేల కోట్లు అవుతుందని అనుకుంటే ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ఇందులో 90 శాతం గ్రాంటు రూపంలో లభిస్తుందని జగన్‌ అన్నారు.

ఇంకో విషయం ఏమిటంటే ప్రత్యేక హోదా కలిగి ఉన్న రాష్ట్రానికి పరిశ్రమలకు రాయితీలు వస్తాయని, ఈ పరిశ్రమలు వందశాతం పన్నులు మినహాయింపు లబిస్తుందని, అనేక రాయితీలు లభిస్తాయని, దీనివల్ల రాష్ట్రం నుంచి, ఇతర రాష్ట్రాలనుంచి, విదేశాల నుంచి అనేక మంది పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు పెట్టడానికి వస్తారని, దీనివల్ల అనేక మందికి ఉపాధి లభిస్తాయని జగన్‌ వివరించారు. ప్రత్యేక హోదా వస్తే నిరుద్యోగులు అసలు ఉండరని, ఉద్యోగుల కోసం పరిశ్రమలు ఎదురు చూసే పరిస్థితి వస్తుందని జగన్‌ చెప్పారు. ఇన్ని మంచి అవకాశాలు లభించే ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయక పోవడానికి కారణం ఆయన లంచాల కేసుల్లో ఇరుక్కోవడమేనని, ఓటుకు నోటు వంటి కేసుల్లో అడ్డంగా దొరికిపోవడమే అని జగన్‌ ఆరోపించారు.

దమ్మూధైర్యం లేని చంద్రబాబు: జగన్‌
కేంద్రం మాటలకు చంద్రబాబు తాళం వేస్తున్నారని, కేంద్రాన్ని నిలదీసే దమ్ము ధైర్యం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్‌ విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గరలోనే ఉందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌. జగన్‌ అన్నారు. అన్ని రంగాల్లోను ఆయన ఇచ్చిన హామీలు నెరవేరలేదని, నేరవేర్చాలన్న చిత్తశుద్ది కూడా చంద్రబాబుకు లేదని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదాపై పట్టుదల ఉంటే ఆంధ్రప్రదేశ్‌ సాధించుకోవడం పెద్ద కష్టం కాదని జగన్‌ చెప్పారు. కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఇద్దరు మంత్రులను ఉపసంహరించుకుంటామని చంద్రబాబు చెప్నిన మరుక్షణం ప్రత్యేక హోదా కేంద్రం ఇచ్చి తీరుతుందని, కాని ఆ మాట అంటే తాను ఎక్కడ జైలుకు పోవాల్సి వస్తుందోనన్న భయం చంద్రబాబును వెంటాడుతుందని జగన్‌ ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ చంద్రబాబని, ఆయనకు ప్రత్యేక హోదా అడిగే ధైర్యం, దమ్మూ లేవని ఆన్నారు. కేసులకు భయపడి ఆయన దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాడని జగన్‌ ఆరోపించారు. కేంద్రం ఏమి చెప్పినా దానికి తాళం వేస్తూ భజన చేస్తున్నాడని విమర్శించారు.

కేంద్రం 14వ ఆర్ధిక సంఘం పేరు చెప్పి తప్పించుకుంటుంటే చంద్రబాబు దానికి వంత పాడుతున్నారని, ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వాలని పేర్కొంటూ కేంద్ర కేబినెట్‌ తీర్మానం చేసి ప్రణాళికా సంఘానికి పంపిందని, మోడి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేనాటికి అది ప్రణాళికా సంఘం వద్ద ఉందని, మోడీ ప్రధాని అయిన ఏడు నెలల తర్వాత ప్రణాళికా సంఘాన్ని రద్దు చేశారని, అప్పటివరకు సదరు ఫైలు పెండింగ్‌లో ఉన్నా ఎందుకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేదని జగన్‌ ప్రశ్నించారు. ఆ రాష్ట్రం ఇవ్వొద్దంటుంది… ఈ రాష్ట్రం ఇవ్వొద్దంటుందంటూ చొప్పదంటు కబుర్లు చెబుతూ చివరికి ప్రణాళికా సంఘం పేరు చెప్పి తప్పించుకోజూస్తున్నారని ఆయన అన్నారు.

చంద్రబాబు పాలన అంతా మోసం… మోసం… మోసం… అని, ఇంకా వెన్నుపోట్ల మయం అని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా ఆయన నెరవేర్చలేదని, రైతుల రుణ మాఫీ, బాబు వస్తేనే జాబు అంటూ చేసిన మోసాన్ని, డ్వాక్రా రుణ మాఫీ, గృహ నిర్మాణ హామీ… ఇలా ఎన్నో హామీలు ఇచ్చినా ఒక్కటి కూడా నెరవేరలేదని ఆయన అన్నారు. ఇళ్ళు కట్టిస్తానన్నారు.. చివరకు కట్టిన ఇళ్ళకు బిల్లులు కూడా ఇవ్వడం లేదని జగన్‌ ఆరోపించారు. మనమంతా ఒక్కటవుదాం… గట్టిగా పోరాడుదామని అన్నారు. మనమంతా సంఘీభావం తెలిపితే చంద్రబాబు కేంద్రాన్ని నిలదీస్తాడని ఆశిద్దామని, కేంద్రం దిగిరాక తప్పని పరిస్థితి తీసుకువద్దామని జగన్‌ పిలుపు ఇచ్చారు.

First Published:  7 Oct 2015 4:55 AM GMT
Next Story