వినియోగంలో లేని భూ విక్రయాలకు టీ-నిర్ణయం

వినియోగంలో లేని ప్రభుత్వ భూములను విక్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రెవిన్యూ శాఖ పరిధిలో ఉన్న భూముల అమ్మకానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయడం వెనుక ప్రభుత్వ ఉద్దేశ్యం వేరేగా ఉంది. ఖాళీగా ఉన్న భూముల ఆక్రమణ విపరీతంగా పెరిగిపోయింది. ఒకసారి భూ ఆక్రమణ జరిగిన తర్వాత వాటిని క్రమబద్దీకరించడం తప్ప మరో దారి ప్రభుత్వానికి కనిపించడం లేదు. ఒకవేళ తిరిగి వాటిని స్వాధీనం చేసుకోవాలన్న సవాలక్ష సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఆక్రమణల బారి నుంచి కాపాడడంలో ఎక్కువ నిమగ్నమయ్యే కన్నా అవసరం లేని భూములను విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే భూముల విక్రయానికి తెర తీసింది. రెవిన్యూ శాఖ బహిరంగ వేలం ద్వారా భూములను విక్రయించాలని భావిస్తోంది.