Telugu Global
Others

దాద్రి ఘటన- మేధావుల ఆగ్రహం

ఉత్తరప్రదేశ్ లోని దాద్రి ఘటనకు వ్యతిరేకంగా సాహిత్యకారులు, రచయితలు ఏకమవుతున్నారు. గోవు మాంసం తిన్నారన్న ప్రచారంతో ఓ మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిని హత్య చేయడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు నిరసనగా ప్రముఖ రచయిత, జర్నలిస్టు నయనతార సెహగల్‌ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని వెనక్కు ఇచ్చేశారు. మరో కవి అశోక్‌ వాజ్‌పేయి కూడా ఇదే బాట పట్టారు. దేశంలో జరుగుతున్న విపరీత పరిణామాలపై ప్రధాని నరేంద్రమోడీ మౌనంగా ఉంటున్నారని.. దానికి నిరసనగా తన పురస్కారాన్ని వెనక్కి […]

దాద్రి ఘటన- మేధావుల ఆగ్రహం
X

ఉత్తరప్రదేశ్ లోని దాద్రి ఘటనకు వ్యతిరేకంగా సాహిత్యకారులు, రచయితలు ఏకమవుతున్నారు. గోవు మాంసం తిన్నారన్న ప్రచారంతో ఓ మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిని హత్య చేయడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు నిరసనగా ప్రముఖ రచయిత, జర్నలిస్టు నయనతార సెహగల్‌ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని వెనక్కు ఇచ్చేశారు. మరో కవి అశోక్‌ వాజ్‌పేయి కూడా ఇదే బాట పట్టారు. దేశంలో జరుగుతున్న విపరీత పరిణామాలపై ప్రధాని నరేంద్రమోడీ మౌనంగా ఉంటున్నారని.. దానికి నిరసనగా తన పురస్కారాన్ని వెనక్కి పంపుతున్నట్లు అశోక్‌ వాజ్‌పేయి ప్రకటించారు.
మరోవైపు దాద్రిలో జరిగిన ఘటనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణ సభలో ప్రణబ్ మాట్లాడారు. మన నాగరికతలోని భిన్నత్వం, వైవిధ్యం, సహనం వంటి మౌలిక విలువలను దిగజార్చవద్దని ప్రణబ్‌ ప్రజలకు ఉద్బోధించారు. మూల విలువలు ఉన్న సమాజంలో ఇలాంటి సంఘటనలకు చోటు లేదన్నారు. సహనంతో ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు.
ఇటీవల కాలంలో దాద్రి ఘటనలోపాటు కలబుర్గి, అరవింత్ పన్సారే లాంటి ప్రముఖుల హత్యలు సాహిత్య అభిమానులు, రచయిలతను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రముఖులు అవార్డుల్ని వెనక్కి ఇచ్చేయడం, రాష్ట్రపతి వ్యాఖ్యలు, ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సైలెంట్ గా ఉండడంపై ఆగ్రహం పెరుగుతోంది. ముఖ్యంగా ప్రధాని మోడీనే దీనిపై స్పందించాలన్న ఒత్తిడి పెరుగుతోంది. దాద్రి విషయంలో కేంద్రం ఇప్పటికైనా స్పందిస్తుందా? రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్న బీజేపీ నేతలను కట్టడి చేస్తారా? అన్నది చూడాలి.

First Published:  8 Oct 2015 1:58 AM GMT
Next Story