హత్య చేయబోయిన శ్రీచైతన్య విద్యార్థులు

విశాఖ శ్రీచైతన్య కాలేజీ విద్యార్థులు ఇద్దరు ఏకంగా హత్య చేసేందుకు సిద్ధమయ్యారు. తోటి విద్యార్థిని కత్తులతో పొడిచి చంపేందుకు విఫలయత్నం చేశారు. బాధితుడు తీవ్ర కత్తిపోట్లతో ఆస్పత్రి పాలయ్యాడు.

విశాఖ శ్రీచైతన్య కాలేజీలో గిరిష్, మనోహర్, పవన్ ఇంటర్ చదవుతున్నారు. అయితే సెల్‌ఫోన్ చోరి విషయంలో వీరి మధ్య గొడవ జరిగింది. దీంతో కక్ష పెంచుకున్న పవన్, మనోహర్‌లు… గిరీష్‌ను నమ్మించి మాట్లాడాల్సిన పని ఉందంటూ ఆటోలో ఊరి బయటకు తీసుకెళ్లారు. స్నేహితులను నమ్మిన గిరీష్ వారు చెప్పినట్టు ఊరి బయటకు వెళ్లాడు.

అక్కడికి వెళ్లిన తర్వాత గిరీష్‌తో పవన్, మనోహర్‌ గొడవ పడ్డారు. హఠాత్తుగా తమ వద్ద ఉన్న బటన్ కత్తులు తీసి విచక్షణారహితంగా పొడిచారు. కడపు, మెడ, చేతులపై కత్తిపోట్లు పడ్డాయి. అయితే ప్రాణభయంతో పరుగులు తీసిన గిరీష్ సమీపంలోని ఇళ్ల వద్దకు వెళ్లి కేకలు వేశాడు. దీన్ని గమనించిన మహిళలు కొందరు మనోహర్, పవన్ బారి నుంచి గిరీష్‌ను కాపాడారు.

అనంతరం పోలీసులకు, విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రస్తుతం గిరీష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పవన్, మనోహర్‌పై పెందుర్తి పీఎస్‌లో కేసు నమోదైంది.  నిందితులు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.