Telugu Global
Others

త్వరలో కేసీఆర్‌ ఇంటికి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా తెలంగాణ సీఎం కె. చంద్రశేఖరరావు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే కేబినెట్‌లో చెప్పారు. అదే విధంగా  ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లకు నేరుగా ఆహ్వాన పత్రికలు అందజేస్తానని చంద్రబాబు తెలిపారు. కేబినెట్‌ భేటీలో మంత్రుల కుర్చీల దగ్గరకు వెళ్లి రాజధాని శంకుస్థాపన ఆహ్వాన పత్రికలను మంత్రులకు, చంద్రబాబు అందజేశారు. కుటుంబ సమేతంగా కార్యక్రమానికి రావాలని […]

త్వరలో కేసీఆర్‌ ఇంటికి చంద్రబాబు
X
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా తెలంగాణ సీఎం కె. చంద్రశేఖరరావు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే కేబినెట్‌లో చెప్పారు. అదే విధంగా ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లకు నేరుగా ఆహ్వాన పత్రికలు అందజేస్తానని చంద్రబాబు తెలిపారు. కేబినెట్‌ భేటీలో మంత్రుల కుర్చీల దగ్గరకు వెళ్లి రాజధాని శంకుస్థాపన ఆహ్వాన పత్రికలను మంత్రులకు, చంద్రబాబు అందజేశారు. కుటుంబ సమేతంగా కార్యక్రమానికి రావాలని మంత్రులందరినీ చంద్రబాబు ఆహ్వానించారు. అయితే దీనికి కేసీఆర్‌ ఎలా స్పందిస్తారన్నదానికి ఇపుడే సమాధానం దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే వీరిద్దరూ ప్రస్తుతం ఎడమొగం పెడమొగంతో ఉన్నారు. తనను ఓటుకు నోటు కేసులో ఇరికించినందుకు చంద్రబాబు ఆగ్రహంగా ఉండగా… ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుల ద్వారా తెలంగాణ నాయకుల్ని, అధికారుల్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించినందుకు కేసీఆర్‌ ఉడికిపోతున్నారు. వీరిరువురూ కలిసే అవకాశం గవర్నర్‌ నరసింహన్‌ రెండుసార్లు కల్పించినా వారికి సాధ్యం కాలేదు. జ్వరమని ఒకసారి కేసీఆర్‌ ఎగొట్టగా మరోసారి ఒకరు వస్తారని ఇంకొకరు అనుకుని ఇద్దరూ రాకుండా పోయారు. ఆ తర్వాత కూడా కలిసే అవకాశం ఉన్నప్పుడు కూడా వారు కలవలేదు. మరిప్పుడు చంద్రబాబు పిలిస్తే వస్తారా అనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. శంకుస్థాపనకు ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. శంకుస్థాపనకు ప్రధాని మోదీతో సహా ప్రపంచ వ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు. పలువురుకి ఇప్పటికే ఆహ్వాన పత్రికలను కూడా పంపించారు. ఇది మంచి అవకాశం కాబట్టి కేసీఆర్‌ కూడా వచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే టేపుల కేసు, ట్యాపింగ్‌ కేసు కూడా కొన్ని పరిస్థితుల కారణంగా అటకెక్కాయి. మళ్ళీ వాటిని పదేపదే గుర్తు చేసుకుని గ్యాప్‌ పెంచుకునే కన్నా ఇరు రాష్ట్రాలు సామరస్యంగా తమ ముందు ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని అనే వారు కుడా ఉన్నారు. ఈ నేపథ్యం ఏం జరుగుతుందనేది కొన్నాళ్ళు ఆగితేగాని తెలిసే అవకాశం లేదు.
First Published:  10 Oct 2015 8:17 AM GMT
Next Story