Telugu Global
Cinema & Entertainment

రుద్రమదేవి సినిమా రివ్యూ

సంగీతం: ఇళయరాజా సినిమాటోగ్రఫి: అజయ్‌విన్సెంట్‌, ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌, ఆర్ట్‌: తోట తరణి, కథ-నిర్మాణం-దర్శకత్వం: గుణశేఖర్‌ సినిమాకి నాటకానికి తేడా ఏమంటే సినిమాలో దృశ్యం మాట్లాడుతుంది. నాటకంలో పాత్రలు మాట్లాడుతాయి. ఎందుకంటే నాటకంలో దృశ్యాన్ని చూపలేం. అంటే ఒక కోటనికానీ యుద్ధాన్ని కానీ రంగస్థలంపై చూపడం సాధ్యంకాదు. అయితే సినిమాలో కూడా దృశ్యం మాట్లాడకుండా పాత్రలే మాట్లాడ్డం మొదలుపెడితే… అది రుద్రమదేవి అవుతుంది. దర్శకుడు గుణశేఖర్‌ ఏదో అద్భుతాలు చేస్తాడనుకుని థియేటర్‌కి వెళ్ళినవారికి నిరాశ ఎదురైంది. హిస్టారికల్‌ […]

రుద్రమదేవి సినిమా రివ్యూ
X

సంగీతం: ఇళయరాజా
సినిమాటోగ్రఫి: అజయ్‌విన్సెంట్‌,
ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌,
ఆర్ట్‌: తోట తరణి,
కథ-నిర్మాణం-దర్శకత్వం: గుణశేఖర్‌

సినిమాకి నాటకానికి తేడా ఏమంటే సినిమాలో దృశ్యం మాట్లాడుతుంది. నాటకంలో పాత్రలు మాట్లాడుతాయి. ఎందుకంటే నాటకంలో దృశ్యాన్ని చూపలేం. అంటే ఒక కోటనికానీ యుద్ధాన్ని కానీ రంగస్థలంపై చూపడం సాధ్యంకాదు. అయితే సినిమాలో కూడా దృశ్యం మాట్లాడకుండా పాత్రలే మాట్లాడ్డం మొదలుపెడితే… అది రుద్రమదేవి అవుతుంది. దర్శకుడు గుణశేఖర్‌ ఏదో అద్భుతాలు చేస్తాడనుకుని థియేటర్‌కి వెళ్ళినవారికి నిరాశ ఎదురైంది.
హిస్టారికల్‌ సినిమాలు తీయాలనుకున్నపుడు ఎంతో రిసెర్చివర్క్‌ అవసరం. హాలివుడ్‌లో కూడా ఇలాంటి సినిమాలు తీసేటపుడు వేల పేజీల సమాచారాన్ని సేకరిస్తారు. అయితే సినిమాకి ఎంత అవసరమో అంతే వాడుకుంటారు. గుణశేఖర్‌ కూడా ఈ మేరకు రుద్రమదేవి చరిత్రపై బోలెడు సమాచారం సేకరించాడు. సినిమాకి అనుగుణంగా వాడుకోవడంలో విఫలమయ్యాడు. ప్రేక్షకుల్ని సరిగా కనెక్ట్‌ చేయకపోవడం వల్ల ఒకోసారి తెరమీద ఏం జరుగుతుందో మనకి అర్ధంకాదు.
కథ గురించి చెప్పాలంటే మహారాజు గణపతి దేవుడికి కుమారుడు పుడతాడని అందరూ ఆశిస్తే కూతురు పుడుతుంది. వారసుడు లేకపోతే రాజ్యంలో తిరుగుబాట్లు జరుగుతాయని భావించిన మంత్రి (ప్రకాష్‌రాజ్‌) ఒక ఆలోచన చేస్తాడు. ఆమెని మగవాడిలా పెంచాలని నిర్ణయిస్తాడు. రుద్రమదేవి రుద్రమదేవుడిగా పెరుగుతుంది.
ఒక వయసు వచ్చినతరువాత ఆమెకి అర్ధమవుతుంది, తాను స్త్రీనని. అయినా రాజ్యంకోసం, ప్రజలకోసం తాను పురుషుడిగా ఉండడానికే నిశ్చయించుకుంటుంది. రుద్రదేవుడికి పెళ్ళికూడా జరుగుతుంది. అయితే భార్యగా వచ్చిన అమ్మాయికి (నిత్యామీనన్‌) ఈ విషయం తెలుసు.
ఇదిలావుండగా దేవగిరి పాలకుడు మహాదేవుడు కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తాలని చూస్తూవుంటాడు. తప్పనిసరి పరిస్థితుల్లో రుద్రమదేవి తాను స్త్రీనని ప్రజలకు తెలుపుతుంది. చివరికి శత్రు సంహారం చేసి సుస్థిర రాజ్యాన్ని స్థాపిస్తుంది. ఈ మధ్య జరిగే కథలో ఇద్దరు నాయకులుంటారు. రుద్రమదేవిని ప్రేమించే వీరభద్రదేవుడు, ఆమె రాజ్యంలో గజదొంగగా ఉంటూ శత్రువులా నటించే గోన గన్నారెడ్డి.
రుద్రమదేవిగా అనుష్క అద్భుతంగా నటించింది. రాజ్యంకోసం పురుషుడిగా నటిస్తూ ఆమె అనుభవించే వేదనని గొప్పగా ఆవిష్కరించింది. ఒకరకంగా ఈ సినిమా భారం మొత్తం ఆమెదే. అయితే గోనగన్నారెడ్డిగా అల్లుఅర్జున్‌ వచ్చి ఆ భారాన్ని కొంత పంచుకుని గట్టెక్కిస్తాడు.
మొదటి 20 నిముషాలు నాటకంలా నడుస్తుంది. గుణశేఖర్‌ ఇలా తీసాడేంటి అని విసుగొచ్చినపుడు కాసేపు బావుంటుంది. మళ్ళీ డైలాగుల హోరు నడుస్తుంది. తరువాత కాసేపు బావుంటుందేమోనని ఆశ కలిగిస్తుంది. ఇలా ప్రేక్షకుడు ఊగిసలాడి బయటికి వస్తాడు. గ్రాఫిక్స్‌, లండన్‌లో రికార్డింగ్‌ ఇలా ఏవేవో చెప్పారుకానీ చాలా సన్నివేశాల్లో పాత జానపద సినిమాల సెట్టింగులు గుర్తుకొస్తాయి.
డైలాగుల్లో నాటకీయత ఎక్కువైంది. అలాకాకుండా ఆ పాత్రలు మామూలుగా మాట్లాడినా నష్టమేమి ఉండేదికాదు. నాటకీయ డైలాగులు వినివిని గోనగన్నారెడ్డి రాకతో ప్రేక్షకులు రిలీఫ్‌గా ఫీలవుతారు. ఎందుకంటే స్వచ్ఛమైన తెలంగాణా యాసతో మాట్లాడుతూవుంటే చెవులకు తుప్పువదిలిపోతుంది. “గమ్మునుండవయా” అనేది హిట్‌ డైలాగయినా ఆశ్చర్యంలేదు.
అనుష్క పై అంత:పురంలో చిత్రించిన రెండు పాటలు సూపర్భ్‌. అదే టేకింగ్‌ సినిమా మొత్తం ఉండివుంటే ఈ సినిమా రేంజ్‌ ఎక్కడో ఉండేది. కృష్ణంరాజుతో సహా చాలామంది పాత్రదారులున్నారు కానీ వాళ్ళకి నటించడానికి పెద్ద అవకాశం లేదు. ఉన్నంతలో ప్రకాష్‌రాజ్‌ పరవాలేదు. కృష్ణభగవాన్‌, వెన్నెలకిషోర్‌, వేణుమాధవ్‌ ఉన్నారు కానీ ఒకటిరెండు నిముషాలకి మించి కనపడరు. ఇలాంటి సీరియస్‌ సినిమాలో కామెడీ ఆశించడం కూడా కరెక్ట్‌ కాదు.
తోట తరణి కళాదర్శకత్వం కొన్నిచోట్ల అద్భుతంగా ఉంటే మరి కొన్ని చోట్ల పేలవంగా ఉంది. ఈ కాలంలో కూడా సెట్టింగులు మరీ తెలిసిపోయేవిధంగా ఉంటే ప్రేక్షకులు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు బాహుబలి చూసారు. బాహుబలి చూసినకళ్ళతో దీన్ని పోల్చుకోవటం ఒక మైనస్‌. ఎందుకంటే రాజమౌళి ప్లానింగ్‌ ఎంతగొప్పగా ఉంటుందంటే సినిమాలో రిచ్‌నెస్‌ ఎక్కడా తగ్గడు.
రుద్రమదేవికి చాలా ఖర్చుపెట్టారుకానీ, కొన్నిచోట్ల దారుణంగా రాజీపడిపోయారని అర్ధమవుతుంది. కాకతీయుల మహారాణి చరిత్రను సంఘర్షణను అద్భుతంగా చూపించే అవకాశం ఉన్నప్పటికీ కథకి స్ట్రెయిట్‌ నేరేషన్‌ లేకపోవడంవల్ల పట్టుతప్పి అక్కడక్కడ డాక్యుమెంటరీ లక్షణాలు కనిపిస్తాయి.
ఇటలీ యాత్రికుడు మార్కోపోలోతో ఈ కథ చెప్పిస్తారు. మెగాస్టార్‌ చిరంజీవి వ్యాఖ్యానం అందరిని రంజింపచేస్తుంది. ఏది ఏమైనా ఇన్నాళ్లుగా ఎదురుచూసిన రుద్రమదేవి కొన్నిచోట్ల జడిపిస్తూ, అక్కడక్కడ మెరిపిస్తూ ఎలాగోలా ప్రేక్షకుల్ని బయటపడేస్తుంది.

– జిఆర్‌. మహర్షి

First Published:  9 Oct 2015 5:44 PM GMT
Next Story