Telugu Global
Others

జానాలో పెద్దరికం మరీ ఎక్కువైందా?

తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి తీరు పదేపదే చర్చనీయాంశమవుతోంది. ఆయన వ్యవహార శైలిపై సొంత పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జానారెడ్డి టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతున్న వేళ జాగ్రత్తగా ఉండాల్సింది పోయి తనపై అనుమానాలు మరింత పెరిగేలా ఆయన వ్యవహరిస్తున్నారు. శనివారం జరిగిన తెలంగాణ బంద్ సందర్భంగా జానారెడ్డి సొంతపార్టీ నేతలకు మరోసారి టార్గెట్ అయ్యారు. అసెంబ్లీ నుంచి విపక్షాల సస్పెన్షన్ రోజు అది చేస్తాం ఇది చేస్తాం… అధికార పార్టీకి […]

జానాలో పెద్దరికం మరీ ఎక్కువైందా?
X

తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి తీరు పదేపదే చర్చనీయాంశమవుతోంది. ఆయన వ్యవహార శైలిపై సొంత పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జానారెడ్డి టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతున్న వేళ జాగ్రత్తగా ఉండాల్సింది పోయి తనపై అనుమానాలు మరింత పెరిగేలా ఆయన వ్యవహరిస్తున్నారు.

శనివారం జరిగిన తెలంగాణ బంద్ సందర్భంగా జానారెడ్డి సొంతపార్టీ నేతలకు మరోసారి టార్గెట్ అయ్యారు. అసెంబ్లీ నుంచి విపక్షాల సస్పెన్షన్ రోజు అది చేస్తాం ఇది చేస్తాం… అధికార పార్టీకి తమ తడాక చూపిస్తామని చెప్పిన జానారెడ్డి బంద్‌లో మాత్రం ఎక్కడా పాల్గొనలేదు. శ్రేణులను ముందుండి నడిపించాల్సిన ఆయన ఇంటికే పరిమితమయ్యారు. నేతలు కార్యకర్తలంతా అరెస్టయి పోలీస్ స్టేషన్లకు తరలించిన తర్వాత ఇంటి గడప దాటారు. నేరుగా గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కాంగ్రెస్ నేతల పుండుమీద కారం చల్లారు. ”బాగున్నారా” అంటూ పరామర్శ యాత్ర చేశారు. మీరు ఎందుకు బంద్‌లో పాల్గొనలేదు అని అడిగితే అనారోగ్యం వల్ల రాలేకపోయానని సమాధానం చెప్పారు.

ఈ సమాధానంతో కాంగ్రెస్ నేతలకు అసహనం తన్నుకొచ్చిందట. తామంతా తెల్లవారుజామునే రోడ్లపైకి వచ్చి నానా ఇబ్బందులు పడితే సీఎల్పీ నేతగా ఉండి కూడా బయటకు రాలేదని మండిపడుతున్నారు. కనీసం ఓ గంటపాటు ఇంటి నుంచి బయటకు రాలేనంత అనారోగ్యం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్‌ నేతలు పదేపదే పెద్దలు జానారెడ్డి గారు అంటూ ఆయనకు పెద్దరికాన్ని తలకెక్కించారని రుసరుసలాడుతున్నారు. అందుకే పెద్దమనిషినైనా తాను అందరిలాగా రోడ్డుమీదకు వచ్చి బంద్‌లో పాల్గొనడం ఏమిటన్న దోరణి జానారెడ్డిలో పెరిగిందంటున్నారు.

లలిత్ మోదీ వ్యవహారంలో సుష్మాస్వరాజ్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏకంగా లోక్‌సభ వెల్‌లోకి వెళ్లడం… సభ బయట ఆందోళనకు దిగడం వంటి ఘటనలను కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. సోనియా గాంధీ కన్నా జానారెడ్డి గొప్పవారా అని ప్రశ్నిస్తున్నారు. టీఆర్‌ఎస్ నేతల దగ్గర పెద్దరికాన్ని కాపాడుకునే ప్రయత్నంలో సొంత పార్టీ సంగతిని జానారెడ్డి మరచిపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే బంద్‌లో ఎందుకు పాల్గొనలేదని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా బంద్‌కు పిలుపునిచ్చిందే తానని జానారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ శ్రేణులు బంద్‌లో పాల్గొంటే తాను పాల్గొన్నట్టు కాదా అని ప్రశ్నించారు.

First Published:  10 Oct 2015 10:15 PM GMT
Next Story