హిమాలయ రాజ్య పీఠం కమ్యూనిస్టు పరం

నేపాల్ ప్రధాని పీఠం కమ్యూనిస్టుల వశమైంది. నూతన ప్రధాని కమ్యూనిస్టు పార్టీ చీఫ్ ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి సుశీల్ కొయిరాలాపై అత్యధిక మెజారిటీతో గెలుపుపొందారు. పార్లమెంట్‌లో ఓటింగ్ జరగ్గా మొత్తం 587 సభ్యుల్లో 338 ఓట్లు ప్రసాద్ శర్మ ఓలికి పడ్డాయి. సుశీల్ కొయిరాలాకు కేవలం 249 ఓట్లు వచ్చాయి. కొందరు తటస్థంగా ఉండాలని భావించినా అందుకు లామేకర్స్ అనుమతించలేదు.

ఇటీవల నేపాల్ ప్రభుత్వం కొత్త రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చింది. హిందూదేశంగా ఉన్ననేపాల్‌ను ప్రజాస్వామ్యదేశంగా నూతన రాజ్యాంగం ద్వారా ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మదేశీలు, ఇతర మైనార్టీ వర్గాలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 40 మంది వరకు ఘర్షణల్లో చనిపోయారు.

సరిహద్దుల్లో ఆందోళన కారణంగా భారత్ నుంచి నేపాల్‌కు పెట్రోల్, డీజీల్‌తో పాటు ఇతర సరకు రవాణా స్తంభించిపోయింది. దీంతో అల్లర్లను నిరోధించడంలో విఫలమైన సుశీల్ కొయిరాలా శనివారం ప్రధాని పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసినప్పటికీ మరోసారి సుశీల్ బరిలో దిగారు. అయితే ఓటమి తప్పలేదు. సుశీల్ కొయిరాలా నేపాలి కాంగ్రెస్ తరపున బరిలో దిగారు.