ప్రశ్నించే పవన్ వీటిపైనా ప్రశ్నించాలట !

ప్రశ్నించే పవన్‌ను వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా ప్రశ్నించారు. పలు ప్రశ్నలు వేసి వీటిపై ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారామె. గుంటూరులో జగన్ నిరవధిక దీక్ష వద్ద ప్రసంగించిన రోజా … పవన్ కళ్యాణ్ కాస్త చంద్రబాబుకు కవరింగ్ కళ్యాణ్‌లా తయారయ్యాడని విమర్శించారు. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తానని ఎన్నికలకు మందుకు చెప్పిన పవన్ ఎప్పుడెందుకు ఆ పనిచేయడం లేదని నిలదీశారు.

పోర్టులు, ఎయిర్‌పోర్టుల పేరుతో రైతుల భూములు లాక్కుంటుంటే ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనిపించడం లేదా అని నిలదీశారు. నారాయణ కాలేజ్‌లో విద్యార్థులు ఆత్మహత్యలపై ఎందుకు మాట్లాడడం లేదన్నారు. ఇసుక మాఫియాను ప్రశ్నించరా అని నిలదీశారు.

పట్టిసీమ ద్వారా వందల కోట్లు టీడీపీ నాయకులు దోచేస్తే ఎందుకు ప్రశ్నించడం లేదని పవన్‌ను ప్రశ్నించారు. మహిళలపై టీడీపీ నాయకులు దాడి చేస్తుంటే కనిపించడం లేదా అని నిలదీశారు. ప్యాకేజ్ అవసరమైనప్పుడు మాత్రమే ప్రశ్నిస్తారా అని రోజా నిలదీశారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదాపై ప్రధాని మాట ఇచ్చి తప్పుతుంటే ఎందుకు మోదీని నిలదీయడం లేదని పవన్‌ను నిలదీశారామె.