వైట్నర్‌ మత్తులో తెగింపు… అరాచకాలు

peddi rajuవైట్నర్‌… ఇపుడంతా దీనిపైనే చర్చ. హెరాయిన్‌, బ్రౌన్‌ షుగర్‌ అంత పవర్‌ ఫుల్‌ కాకపోయినా ఇది కూడా మెదడును మొద్దు బరిచే ఓ రకమైన మత్తు పదార్థం. ఇది ఓ రకమైన మాదక ద్రవ్యంలా పని చేస్తుంది. దీన్ని పీల్చి కొంతమంది… తాగి మరి కొంతమంది పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తున్నారు. అరాచకాలకు ఒడి గడుతున్నారు. అంతేకాదు… తెగించి దాడులకు దిగుతున్నారు. బరితెగించి దొపిడీలకు పాల్పడుతున్నారు. ఇది ఇచ్చే మత్తులోను వారేం చేస్తున్నారో వారికే తెలీదు. వైట్నర్‌ తీసుకున్న తర్వాత మనిషిలోను, మనసులో వచ్చే తెగింపే వారిని మృగాలుగా… కొంతమందిని దొంగలుగా… మరికొంతమందిని బానిసలుగా మార్చేస్తోంది. నిజానికి వెట్నర్‌ అనే ఈ రసాయనం ప్రింటింగ్‌లోను, రాత పూర్వకంగా వచ్చే తప్పులను సరిదిద్దడానికి పని చేస్తోంది. కాని దీన్ని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు. చైన్‌ స్నాచింగ్‌ దొంగలను పట్టుకున్నప్పుడు, మొన్న బంజారాహిల్స్‌లో సైకో దాడి చేసినప్పుడు పట్టుకున్న నిందితుల విచారణలో వీరు తీసుకున్న రసాయనం వెట్నర్‌ అని బయట పడింది. దీంతో పోలీసులు ఆ వైపు దృష్టి సారించి వరుసగా నగరంలోని హోల్‌సేల్‌ డీలర్‌ ఔట్‌లెట్లపైన, విక్రేతల షాపుల్లోను, డిస్ట్రిబ్యూటర్లపైన దాడి జరిపి ఒకేరోజు 2270 వైట్నర్‌ బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా పోలీసులకు వైట్నర్‌ను మాదక ద్రవ్యంగా వాడుతున్నారన్న విషయం స్పష్టమైంది. హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో రోజూ ఐదువేలకు పైగా వైట్నర్‌ బాటిళ్ళు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. నగరంలో దాదాపు రెండువేల మంది వైట్నర్‌కు బానిసలయినట్టు అంచనా. బాటిల్‌ ధర రూ. 16 ఉండగా దాదాపు రెట్టింపు ధరకు దుకాణాల్లో అమ్ముతున్నారు. దీనికి బానిసలయిన వారు ధర విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదు. సాధారణంగా వైట్నర్‌ రెండు బాటిల్స్‌లో ఉంటుంది. ఒక బాటిల్లొ స్పిరట్‌ ఉంటే మరో బాటిల్‌లో వైట్‌ కలర్‌ ఉంటుంది. ఈరెండింటి మిశ్రమాన్ని కలిపి కాగితాలపై ఏర్పడిన తప్పులను సరిదిద్దడానికి ఉపయోగిస్తారు. దీనిలో ఉండే స్పిరిట్‌లో అల్కహాల్‌ కలిసి ఉండటంతో మత్తుమందుగా ఉపయోగించటం పెరిగింది. ఇల్లు వదిలి వచ్చిన పిల్లలు, కూలీలు, పోకిరీలు, ఆటోడ్రైవర్లు ఎక్కువగా వాడుతుంటారు. చాలా చిన్న విషయంగా కనిపించే వైట్నర్‌ వాడకంపై పర్యవేక్షణ కొరవడటంతో దీనికి అడ్డుకట్ట వేసేవారు లేకుండా పోయారు. హైడ్రో కార్బన్‌ ఉత్పత్తులైన నెయిల్‌ పాలిష్‌, పెయింట్స్‌, వైట్నర్‌ వంటివి మత్తును కలిగిస్తాయి. ఇవి తీసుకున్న మత్తులో చైన్‌స్నాచింగ్‌లు, పిక్‌ పాకెటింగ్‌, హత్యల వంటివాటికి పాల్పడుతున్నారు.

  • – పిఆర్‌ చెన్ను