రైతులకు బాసటలో కర్ణాటక ఆదర్శం

peddi rajuఆత్మహత్య చేసుకున్న అన్నదాత కుటుంబాలను ఎలా ఆదుకోవాలో కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్‌, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు కూడా రైతు కుటుంబాలకు, ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పరిహారాలు నిజంగా తెలుగు రాష్ట్రాలకు మార్గదర్నకంగా ఉంటాయనడం నిస్సందేహం. కాబట్టే… ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అక్కడ ప్రభుత్వ ప్రతిష్టను పెంచుతున్నాయి.

నిజానికి తెలంగాణ ప్రభుత్వం కన్నా అక్కడ ఇస్తున్న పరిహారం తక్కువే. తెలంగాణలో పరిహారాన్ని రెండు లక్షల నుంచి ఆరు లక్షలకు పెంచితే కర్ణాటక రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలకే పరిమితం చేసింది. అయినా అక్కడ ప్రభుత్వంపైనే రైతు కుటుంబాలు ఎక్కువగా ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇదొక్కటే అయితే బహుశా ప్రశంసలు కర్ణాటకకు దక్కి ఉండేవి కావు. ఐదు లక్షల పరిహారంతోపాటు కర్ణాటక రైతు కుటుంబాలను ఆర్ధికంగా నిలబడడానికి పలు చర్యలను చేపట్టింది.

ఉచిత భీమా వర్తింపేజేయడం… రైతు వితంతువులకు నెలకు రెండు వేల రూపాయలు పింఛనుగా ఇవ్వడం… పంట రుణాలపై వడ్డీని యేడాది కాలానికి ప్రభుత్వమే చెల్లిస్తుందని భరోసా ఇవ్వడం, అపరాధ వడ్డీలను మాఫీ చేస్తూ… ఆ వడ్డీని ప్రభుత్వమే చెల్లించడానికి అంగీకరించడం రుణాలను రీ షెడ్యూల్‌ చేయాలని బ్యాంకులను ఆదేశించడంతోపాటు యేడాదిపాటు రుణాలపై మారటోరియం విధించడం.. వంటి పలు చర్యలు రైతుకు, రైతు కుటుంబాలకు భరోసా ఇచ్చాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే… కేవలం పంట భూములున్న రైతులకే కాకుండా కౌలు రైతులకు, భూమి లేని వ్యవసాయ కూలీల ఆత్మహత్యలకూ పరిహారాన్ని వర్తింప జేయడం అన్నదాతల కుటుంబాల్లో ఎంతో భరోసా నింపింది. మరి ఇలాంటి చర్యలు చేపడితే మన తెలుగు ప్రభుత్వాలకు కూడా రైతు కుటుంబాల నుంచి ప్రశంసలు అందుకోవడం ఖాయం.