చక్కెర వ్యాధికి ఆక్రోట్‌తో చెక్‌!

డయాబెటిస్‌ అంటే కొంతమందికే తెలుసు… మధుమేహం అంటే మరికొంతమందికి తెలుసు… కాని చక్కెర వ్యాధి అంటే తెలియనోళ్ళు ఉండరు. ఈ వ్యాధి ఎందుకొస్తుంది? అనే దానికి సమాధానాలు రెండే రెండు. ఒకటి వంశపారపర్యం… మరొకటి టెన్షన్‌. వీటినే వైద్యపరిభాషలో టైప్‌-1. టైప్‌-2గా వ్యవహరిస్తున్నారు. శరీరంలో ఇన్సులిన్‌ హార్మోన్‌ తగ్గడమే మధుమేహ వ్యాధికి ప్రధాన కారణం అని వైద్యులంటున్నారు. మరోరకంగా చెప్పాలంటే… రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగడం అనే ఒక రుగ్మత. ఒకసారి ఈ వ్యాధి వచ్చిన తర్వాత తగ్గిపోవడం ఉండదు. నియంత్రించి అదుపులో ఉంచుకోవడం ఒక్కటే మార్గం… ఈ వ్యాధి ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం భారతదేశం, చైనా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అధికంగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులు లేవు. జీవితాంతం తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే మార్గం. చక్కెర వ్యాధి నియంత్రణలో కాయకష్టం ఒక మార్గమైతే… వ్యాయామాలు మరో మార్గం. ఇవన్నీ వ్యాధిని అదుపులో పెట్టుకోవడానికే. దీనికి మరో మార్గం…
ఆక్రోట్ తో చెక్….
ఆక్రోట్ తీసుకోవడం ద్వారా మధుమేహానికి చెక్ పెట్టవచ్చునని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. ఆక్రోటులో ఆల్ఫాలినోలెనిక్‌ యాసిడ్‌, గామా టోకో ఫెరాల్‌, ఫైటోస్టెరాల్స్‌ ఉంటాయి. గుండె మంచి శక్తిమంతంగా ఉండడానికి, మెరుగ్గా పనిచేయడానికి ఇవి ఎంతో మేలు చేస్తాయట. అంతే కాకుండా గుండెను కూడా పదిలం చేసుకోచ్చు. రక్త శుద్ధి పరంగా శరీరానికి రకరకాల ఉపయోగాలున్నాయి. కొలెస్ట్రాల్ మోతాదు కూడా తగ్గించే గుణం ఆక్రోట్‌ కలిగి ఉంది. సో ఆక్రోటును రోజుకు రెండేసైనా తీసుకుంటే చాలా మంచిదంటున్నారు వైద్యులు. ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండేవాళ్లు జీడిపప్పు వంటి కొవ్వు పదార్ధాల జోలికి వెళ్లకుండా… బాదం, పిస్తా వంటివి పరిమిత స్థాయిలో తీసుకోవాలి. డ్రైఫ్రూట్స్ తీసుకునే అలవాటున్నవారు… ఇకపై వాల్ నట్స్ అనే ఆక్రోటును కూడా మీ డైట్ లిస్టులో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. అసలు మధుమేహం రానివారు… వారానికి రెండు మూడుసార్లు ఆక్రోటు తింటే వారికి మధుమేహం సోకే అవకాశాలు తగ్గుతాయని బోస్టన్ పరిశోధనల ద్వారా వెల్లడైంది. దాదాపు లక్షన్నర మంది నర్సుల మీద పరిశోధనలు చేస్తే… మధుమేహం మలిదశకు వెళ్లే ప్రమాదం 24 శాతం తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారట. మగవాళ్ల మీద కూడా ఆక్రోటు ప్రభావం బాగా పని చేస్తుందని వారంటున్నారు.