Telugu Global
Others

మురళీ మోహన్‌, ఇదేం పని..?

సినీపరిశ్రమలో శ్రీమంతుడు… సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన వ్యక్తి మురళీ మోహన్. నమ్మి జనం ఓట్లేశారు. రాజమండ్రి టీడీపీ ఎంపీగా గెలిచిపోయారు. అలా ఎంపీ అయ్యాక ఆయనలోనూ సగటు రాజకీయ నాయకుడు ఉదయించారు. వాగ్దానాలు ఓట్ల కోసమే అన్న చందంగా ఆయన తీరు తయారైందట. ఆయన తీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు రాజమండ్రి లోక్‌సభ పరిధి మొత్తం తిరిగాల్సిన అవసరం లేదంటున్నారు జనం. అడక్కుండానే ఆయన దత్తత తీసుకున్న గ్రామానికి వెళ్తే చాలు వారే చెబుతున్నారు […]

మురళీ మోహన్‌, ఇదేం పని..?
X

సినీపరిశ్రమలో శ్రీమంతుడు… సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన వ్యక్తి మురళీ మోహన్. నమ్మి జనం ఓట్లేశారు. రాజమండ్రి టీడీపీ ఎంపీగా గెలిచిపోయారు. అలా ఎంపీ అయ్యాక ఆయనలోనూ సగటు రాజకీయ నాయకుడు ఉదయించారు. వాగ్దానాలు ఓట్ల కోసమే అన్న చందంగా ఆయన తీరు తయారైందట. ఆయన తీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు రాజమండ్రి లోక్‌సభ పరిధి మొత్తం తిరిగాల్సిన అవసరం లేదంటున్నారు జనం. అడక్కుండానే ఆయన దత్తత తీసుకున్న గ్రామానికి వెళ్తే చాలు వారే చెబుతున్నారు మురళీ మోహన్ పనితీరు గురించి.

ప్రతి ఎంపీ ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలన్న ప్రధాని పిలుపుతో ఆగమేఘాల మీద స్పందించిన మురళీమోహన్… తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని రంగాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. దత్తత విషయాన్ని ఢిల్లీ నుంచే ప్రకటించారు. అప్పటి వరకు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సదరు గ్రామం మురళీ మోహన్ దత్తత తీసుకున్న విషయం తెలియగానే ఎగిరి గంతేసింది.

తమది ఆదర్శ గ్రామం అవుతుందనుకున్నారు. కలగానే మిగిలిపోయిన ఎర్రబస్సు కల నెరవేరుతుందని నమ్మేశారు. సినీ పరిశ్రమలో అందరికంటే ఎక్కువ సిరి కలిగిన శ్రీమంతుడు అన్న ప్రచారం కూడా ఉండడంతో తమ గ్రామంలో సమస్యలు తీర్చడం మురళీమోహన్‌కు ఒక లెక్కనా అనుకున్నారు. కానీ ఆరు నెలలు గడిచిపోయాయి. ఇప్పటి వరకు ఒక్క పని కూడా జరగలేదు. దత్తత ముందు ఆ తర్వాత ఒక్కశాతం కూడా మార్పు లేదు. చుట్టుపక్కల గ్రామాల వారు మాత్రం మీకేం బాస్ మురళీ మోహనే మీ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు ఇక సమస్యలేంముంటాయని అంటుంటారు. కానీ రంగాపురంవాసులకే తెలుసు అసలు పరిస్థితి.

ఇప్పటికీ తాగేందుకు మంచినీరు దొరకనిపరిస్థితి. డ్రైనేజ్‌ రోడ్డు పక్కన కాకుండా రోడ్లమీదే ప్రవహిస్తుంటుంది. గ్రామంలో స్వచ్చ భారతం సంగతి సరేసరి. మురళీ మోహన్ పంపిస్తారనుకున్న ఎర్రబస్సు ఇప్పటికీ రంగాపురం చేరలేదు. రంగాపురం సంగతి ఎంపీగారు చూసుకుంటార్లే అన్న ఉద్దేశంతో అధికారులు కూడా ఇప్పుడు ఆ గ్రామాన్ని లైట్‌గా తీసుకోవడం మొదలుపెట్టారు. ఆరునెలల నిరీక్షణ అనంతరం రంగాపురం గ్రామస్తులు మురళీమోహన్‌ గారి విషయంలో ఇక ఇంతే అనుకుని మానసికంగా సిద్దమవుతున్నారు. గ్రామ అభివృద్ధి ఏమో గానీ… కనీసం ఆ దగా చేసిన దత్తపుత్రుడి దర్శనమైనా తమకు దక్కుతుందో లేదో అని నిట్టూర్పు విడుస్తున్నారు. కొసమెరుపు ఏమిటంటే ఆరు నెలలు గడిచినా మురళిమోహన్‌ ఒక్కసారి కూడా రంగాపురం గ్రామానికి రాలేదు.

First Published:  13 Oct 2015 8:07 AM GMT
Next Story