ఉరి కొయ్యకు వేలాడిన నారాయణ విద్యార్థిని

నారాయణ విద్యాసంస్థల్లో పసిమొగ్గులు రాలిపోతున్నారు. కాసుల వేట కోసం సృష్టించిన కృత్తిమ చదువుల రేసులో తడబడి చివరకు తనువు చాలిస్తున్నారు. తాజాగా రాజమండ్రిలో మరో విద్యార్థిని ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. రాజమండ్రి దానవాయిపేటలోని నారాయణ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న దాసరి నందిని అనే 17 ఏళ్ల విద్యార్థిని ఒత్తిడి చదువులకు బలైపోయింది.

కాలేజ్ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న  నందిని  రాత్రి  హాస్టల్ ఆవరణలోని చెట్టుకుని ఉరేసుకుంది.  ఉదయం విద్యార్థులు చూసేసరికి విగతజీవిగా చెట్టుకు వేలాడుతూ కనిపించింది.  తాను చదువులో ఒత్తిడిని భరించలేకపోతున్నానని ఇటీవల స్నేహితుల దగ్గర నందిని వాపోయేదని చెబుతున్నారు. దీనికి తోడు పరీక్షల్లో మార్కులు కూడా తక్కువ రావడంతో చివరకు నారాయణ మార్కు చదువులకు స్వప్తి చెప్పి లోకాన్నే విడిచివెళ్లింది.