Telugu Global
Others

9,000 కోట్ల ఓ.ఎన్‌.జి.సి. గ్యాస్‌ను దోచుకున్నరిలయన్స్‌

ఒండుకున్నమ్మకు ఒకే కూర. అడుక్కునే వాళ్లకు ఎన్నో కూరలు. దోచుకునే వారికి దోచుకున్నంత మహదేవ! కృష్ణా-గోదావరి బేసిన్ లో గ్యాస్‌ తవ్వకాలు చేపట్టిన ప్రైవేట్ సంస్థ రిలయన్స్ గ్యాస్ పరిస్థితి ఇలాగే ఉంది. కృష్ణా-గోదావరి బేసిన్ లో ప్రభుత్వ అధీనంలోని చమురు సహజ వాయువుల సంస్థ (ఓ ఎన్ జి సి), రిలయన్స్ గ్యాస్ సంస్థకు కేటాయించిన గ్యాస్ నిక్షేపాలు పక్కపక్కనే ఉన్నాయి. ఓ ఎన్ జి సి ప్రభుత్వ రంగంలో ఉన్న నవ రత్నాల్లో ఒకటి. అంటే […]

9,000 కోట్ల ఓ.ఎన్‌.జి.సి. గ్యాస్‌ను దోచుకున్నరిలయన్స్‌
X

RV Ramaraoఒండుకున్నమ్మకు ఒకే కూర. అడుక్కునే వాళ్లకు ఎన్నో కూరలు. దోచుకునే వారికి దోచుకున్నంత మహదేవ! కృష్ణా-గోదావరి బేసిన్ లో గ్యాస్‌ తవ్వకాలు చేపట్టిన ప్రైవేట్ సంస్థ రిలయన్స్ గ్యాస్ పరిస్థితి ఇలాగే ఉంది. కృష్ణా-గోదావరి బేసిన్ లో ప్రభుత్వ అధీనంలోని చమురు సహజ వాయువుల సంస్థ (ఓ ఎన్ జి సి), రిలయన్స్ గ్యాస్ సంస్థకు కేటాయించిన గ్యాస్ నిక్షేపాలు పక్కపక్కనే ఉన్నాయి. ఓ ఎన్ జి సి ప్రభుత్వ రంగంలో ఉన్న నవ రత్నాల్లో ఒకటి. అంటే అది అద్భుతంగా పని చేస్తోందనుకోవాలి. కాని ప్రభుత్వ వర్గాలలో సాధారణంగా ఉండే సాచివేత జబ్బు ఓ ఎన్ జి సి కి అంటకుండా ఉండదు కదా. ఈ సాచివేత వెనకా మళ్లీ పరమార్థాలు ఉండనే ఉంటాయి. అందుకే తమకు కేటాయించిన గ్యాస్ నిక్షేపాల నుంచి ఆ సంస్థ గ్యాస్ వెలికి తీయకుండా తాపీగా కూర్చుంది. ఈ లోగా రిలయన్స్ సంస్థ 2009 నుంచి తనకు కేటాయించిన కె.జి.డి-6 బ్లాకు నుంచి గ్యాస్ వెలికి తీస్తోంది. తమకు కేటాయించిన క్షేత్రం నుంచి రిలయన్స్ దొంగచాటుగా గ్యాస్ వెలికి తీస్తోందని ఓ ఎన్ జి సి ఫిర్యాదు చేస్తోంది. అలాగని ఓ ఎన్ జి సి కి కేటాయించిన క్షేత్రాల పరిధిలోంచి రిలయన్స్ దొంగతనం చేస్తోందని కాదు. ఓ ఎన్ జి సి కి కేటాయించిన క్షేత్రాల సరసనే రిలయన్స్ తవ్వకాలు చేపట్టినందువల్ల ఓ ఎన్ జి సి కి దక్కాల్సిన గ్యాస్ నిక్షేపాలు అప్పనంగా రిలయన్స్ పరమైనాయి. నీరు పల్లానికి చేరినట్టే గ్యాస్ కూడా ఖాళీ ఉన్న చోటికి చేరే అవకాశం ఉంది. భూగర్భం లో ఉన్న ద్రవ, వాయు రూప నిక్షేపాలు ఒకే చోట మఠం వేసినట్టు ఉండవు. ద్రవ, వాయు రూపంలో ఉన్న సహజ వనరులకు భౌగోళిక రాజకీయ సరిహద్దులు తెలియవు పాపం! ప్రభుత్వ వ్యవస్థలకు తాత్సారం నరనరానా జీర్ణించుకుపోయినట్టే ప్రైవేట్ సంస్థలు ఎప్పుడూ లాభాపేక్ష మీదే దృష్టి నిలుపుతాయి. రిలయన్స్ ఆ పనే చేసింది.

రిలయన్స్ తమ గ్యాస్ వనరులను దొంగిలిస్తోందని ఓ ఎన్ జి సి దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చమురు మంత్రిత్వ శాఖ తమ ఫిర్యాదును పట్టించుకోవడం లేదని కూడా అంగలార్చింది. ఆ మంత్రిత్వ శాఖకు, లేదా దాని అధిపతులకు ఉండే ప్రయోజనాలు ఉంటాయి మరి.

చివరకు ఈ వ్యవహారాన్ని అమెరికాకు చెందిన డె గొల్యర్ అండ్ మెక్నాటన్ సంస్థ పరిశీలనకు పంపించారు. ఆ సంస్థ ముసాయిదా నివేదిక తయారు చేసింది. ఆ నివేదిక ప్రకారం రిలయన్స్ సంస్థ ఓ ఎన్ జి సి కి చెందాల్సిన నిక్షేపాలలోంచి 900 కోట్ల ఘనపు మీటర్ల గ్యాస్ ను అక్రమంగా వినియోగించుకున్నట్టు తేలింది. ఇలా అక్రమంగా వాడుకున్న గ్యాస్ విలువ 9000 కోట్ల రూపాయల దాకా ఉంటుంది. ఈ ముసాయిదా నివేదిక ప్రతిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రో కార్బన్స్ కు కూడా పంపించారు. ఆ వ్యవస్థ వివాదంలో చిక్కుకున్న రెండు సంస్థలకు తమ అభిప్రాయం చేప్పడానికి పంపించింది. ఆ రెండు సంస్థల అభిప్రాయాలు అందిన తర్వాత తుది నివేదిక తయారు కావడానికి మరి కొన్ని నెలలు పడుతుంది.

ప్రకృతి న్యాయాన్ని బట్టి పక్కనున్న గ్యాస్ నిక్షేపాలు తమకు కేటాయించిన నిక్షేపాలలోకి చేరాయి తప్ప మేము అక్రమంగా ఓ ఎన్ జి సి ఆవరణలోకి వెళ్లి దొంగ తనం చేయలేదని రిలయన్స్ సహజంగానే వాదిస్తుంది. అసలు విషయం అది కాదు. ఓ ఎన్ జి సి కి గ్యాస్ నిక్షేపాలు కేటాయించిన తర్వాత అక్కడ ఇంతవరకు ఔన్సు గ్యాస్ కూడా వెలికి తీయలేదు. రిలయన్స్ మాత్రం 2009 నుంచి ఇప్పటి వరకు కె.జి. డి-6 నుంచి 59.5 బి.సి.ఎం.ల పరిమాణం గల గ్యాస్ వెలికి తీసింది. ఇందులో 900 కోట్ల ఘనపు మీటర్ల గ్యాస్ తమకు కేటాయించిందన్న వాదన ఓ ఎన్ జి సి ది. ఓ ఎన్ జి సి తాత్సారం చేయడం వల్లే రిలయన్స్ కు క్షేత్రంలోకి గ్యాస్ తరలి వెళ్లింది. ఓ ఎన్ జి సి జాప్యం వెనక మతలబు ఉండే ఉంటుంది. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం రాజ్యమేలుతున్న దశలో ఓ ఎన్ జి సి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు గ్యాస్ వెలికి తీతను నిర్లక్ష్యం చేస్తే మిగతా నిల్వలూ రిలయన్స్ పరమైనా ఆశ్చర్యపడనవసరం లేదు.

అధికారం కోసం రాజకీయ నాయకులు పార్టీలు మారినట్టే, రాజకీయ పార్టీలు అపవిత్ర కూటములలో చేరినట్టే పెట్టుబడిదారీ ఆసాములు కూడా అధికారంలో ఉన్న రాజకీయ పక్షాన్ని మచ్చిక చేసుకోవడానికి సకల ఎత్తుగడలూ వేస్తారు. ఆశ్రిత పెట్టుబడి దారీ విధానం వల్ల ఎక్కువగా లబ్ధి పొందింది రిలయన్సేనని చెప్పడానికి పెద్ద పరిశోధన అవసరం లేదు. అంబానీలు అందులో ఆరి తేరి పోయారు. ఓ ఎన్ జి సి కి ఈ వివాదంలో అదృష్టం కలిసొస్తే ఎంతో కొంత పరిహారం దక్కొచ్చు. కాని ఈ క్రమంలో ప్రజలకు చెందాల్సిన సహజ వనరులను కొల్లగొట్టడం నిరాఘాటంగా సాగిపోతూనే ఉంటుంది. ఈ దోపిడీని నివారించే ఆలోచనకు ఆర్థిక సంస్కరణల, నూతన ఆర్థిక విధానాల మంత్ర జపం ఎటూ అనుమతించదు. ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ ఆశ్రిత పెట్టుబడి దారీ విధానంలో కూరుకుపోయి చాలా కాలమే అయింది.

అయితే నిజం నిగ్గు తేల్చిన అమెరికా సంస్థను మాత్రం అభినందించాల్సిందే. ఇలాంటి వివాదాలు అమెరికాలోని టెక్సస్ లోనూ కువైత్ లోని రుమైలా చమురు బావుల్లోనూ తలెత్తాయి. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజలకు చెందాల్సిన సహజవనరులను పరిరక్షించడంలో విఫలమైనప్పుడు ఈ వివాదాలు అనివార్యం. ఆ మాటకొస్తే సహజ వనరులు ప్రభుత్వ సొత్తు కూడా కాదు. ప్రభుత్వం ఆ వనరుల కాపలాదారు మాత్రమే. ప్రజావసరాల కోసం ఆ వనర్లను ప్రభుత్వం వినియోగించ వచ్చు. ఏ రీతిలో అనేది ప్రభుత్వం అనుసరించే విధానాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రైవేటు రంగానికి ద్వారాలు బార్లా తెరిచిన తర్వాత ఇక అడ్డేముంటుంది? ఎన్ డి ఎ ప్రభుత్వానికి ఆద్యుడైన అటల్ బిహారీ వాజపేయి మాటల్లో చెప్పాలంటే ప్రభుత్వానికి వ్యాపారంతో ఏం పని? సహజ వనరులను కూడా ప్రైవేట్ సంస్థలకు దోచి పెట్టే ఆర్థిక విధానాల నుంచి మెరుగైన ఫలితాలు ఆశించలేం.

-ఆర్వీ రామారావ్

First Published:  13 Oct 2015 4:45 AM GMT
Next Story