ఏఈని కొట్టిన ఎమ్మెల్యే- మంత్రుల జ్యోక్యంతో సారీ

ఆయనో అధికారపార్టీ ఎమ్మెల్యే.. మిషన్‌ కాకతీయ పనుల్లో తన అనుచరులైన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారంటూ సాగునీటి పారుదల శాఖలో ఏఈఈగా పనిచేస్తున్న ఉద్యోగిపై తన ప్రతాపం చూపించాడు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నుంచి మూడు రోజుల క్రితం ఏఈఈ దేవేందర్ కు ఫోన్ వచ్చింది. ఎమ్మెల్యేనే పిలవడంతో దేవేందర్ ముందస్తుగా తన ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇక ఎమ్మెల్యే ఇంటికి వెళ్లాడు. 
దేవేందర్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లగానే ఎమ్మెల్యే చిన్నయ్య రెచ్చిపోయారు. మిషన్ కాకతీయ బిల్లులు ఎందుకు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. పని ఒత్తిడి ఉందని, చేస్తున్నాని చెప్పినా వినకుండా ఎమ్మెల్యే తన గల్లాపట్టి చెంపమీద కొట్టారని.. గోడకేసి కొట్టారని దేవేందర్ వాపోయాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల‌కు చెప్పినా పెద్దగా మ‌ద్దతు రాలేదు. కానీ ఇంజ‌నీర్స్ అసోషియేన్ సభ్యులు ఈ విషయాన్ని సీరియ‌స్ గా తీసుకొనిఆ శాఖ మంత్రి హ‌రీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం కలెక్టరేట్‌లో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్షకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. వెంటనే ఈ విషయమై మంత్రి హరీశ్‌రావుతో మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చర్చించారు.
చిరవకు మంత్రి హరీష్ రావు జోక్యంతో మంత్రుల సూచనతో క్షమాపణ చెబుతున్నట్లు ఎమ్మెల్యే చిన్నయ్య ప్రకటించారు. ఏఈఈపై దాడి చేయలేదు. ఆరు నెలలుగా ఎన్ని సార్లు చెప్పినా మిషన్‌కాకతీయ బిల్లులు చేయకపోవడంతో కోప్పడ్డా. వివాదం పెద్దది కావొద్దనే, అధికారి మనసు నొచ్చుకుంటే విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణ కోరాను అని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివరణ ఇచ్చారు. మరో కొసమెరుపేంటంటే నెన్నెల్ల మండలంలోని మిషన్ కాకతీయ పనులన్నీ ఎమ్మెల్యే బంధువులు, అనుచరులే దక్కించుకున్నట్లు ఆరోపణలున్నాయి.