ప్రియుడిపై యాసిడ్ దాడి చేసిన ప్రియురాలు

ప్రేమించడం లేదని అమ్మాయిలపై అబ్బాయిలు యాసిడ్ పోసిన సంఘటనలు ఇప్పటి వరకు మనం చూశాం. కాని ఇక్కడ సీన్ రివర్స్ అయింది. అబ్బాయిలకు తనేమీ తీసిపోనన్నట్టు తనను ప్రేమించడం లేదన్న కోపంతో ఓ యువకుడిపై ఓ యువతి యాసిడ్ దాడి చేసింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా తెనాలిలో సంచలనం సృష్టించింది. వెంకటేష్ అనే యువకుడిపై గీతాంజలి అనే అమ్మాయి ఆశలు పెంచుకుంది. అతన్ని ప్రేమించడం మొదలు పెట్టింది. ఈమె ప్రేమకు వెంకటేష్‌ ఎంతకీ చలించకపోవడంతో గీతాంజలి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన దారికి తెచ్చుకోవాలనుకుంది. ఆమె పంతం నెరవేరలేదు. దీంతో వెంకటేష్‌పై గీతాంజలి యాసిడ్ దాడికి పాల్పడింది. తనను ప్రేమించక పోవడం ఒక్కటే కారణం కాదు. తనకు తెలియకుండా మరో అమ్మాయితో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నాడని కూడా ఆమె తెలుసుకుంది. దీంతో కోపం పట్టలేక అతని ముఖంపై యాసిడ్ పోసింది. ఈ సంఘటనలో వెంకటేష్‌ ముఖంతోపాటు శరీరంలోని పలు భాగాలు కాలిపోయాయి. ఇది జరిగిన వెంటనే స్థానికులు వెంకటేష్‌ను గుంటూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్ళారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.