కానిస్టేబుల్ ఓబులేసుకు జీవితఖైదు

అరవిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిని కిడ్నాప్‌కు ప్రయత్నించి, కాల్పులు జరిపిన కేసులో నిందితుడు ఏఆర్ కానిస్టేబుల్ పీ ఓబులేసు (39)కి నాంపల్లి మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రాసిక్యూషన్‌ పక్కా ఆధారాలను కోర్టు ముందు ఉంచడంతో ఈ కేసులో తీర్పు చాలా వేగంగా వచ్చిందని చెబుతున్నారు. అసలు ఎకే-47 గన్‌ను కూడా ఓబులేసు దొంగిలించిన విషయం కూడా ప్రాసిక్యూషన్‌ బయటపెట్టింది. ఈ గన్‌తోనే గతేడాది నవంబర్ 19వ తేదీన కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్‌కు వచ్చిన పారిశ్రామిక వేత్త నిత్యానందరెడ్డిని బెదిరించి… బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద కిడ్నాప్ చేసేందుకు ఓబులేసు ప్రయత్నించాడు. ఆ ఘటనలో అక్కడే ఉన్న నిత్యానందరెడ్డి సోదరుడు ప్రతిఘటించడంతో ఓబులేసు ఏకే-47 గన్‌తో కాల్పులు జరిపి పారిపోయాడు. అనంతరం ఓబులేసు కర్నూలు వెళ్ళి తలదాచుకోగా చాకచక్యంగా పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. పార్క్ వద్ద సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుడ్ని గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. పక్కా ఆధారాలతో ప్రాసిక్యూషన్‌ కేసును నిరూపించడంతో కోర్టు అతనికి జీవితఖైదు విధించింది.