Telugu Global
Others

శంకుస్థాపనకు వెళ్ళొద్దని మోడీకి మేథావుల సలహా

అబద్ధాల పునాదిపై అమరావతి – 2  అక్టోబర్ 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాజధాని “అమరావతి” కి శంకుస్థాపన చేసే ఉత్సవానికి హాజరు కాకూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చండీగఢ్ పరిపాలకుడిగా వ్యవహరించిన దేవసహాయం ఓ లేఖ రాశారు. ప్రధాన మంత్రి ఈ శంకుస్థాపనకు హాజరు కావడం వేలాది మంది చిన్న, సన్నకారు రైతులకు వ్యతిరేకమైన చర్య అవుతుందని మాజీ ఐ ఎ ఎస్ అధికారి దేవసహాయం ఆ లేఖలో వివరించారు. రాజధాని నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు […]

శంకుస్థాపనకు వెళ్ళొద్దని మోడీకి మేథావుల సలహా
X

అబద్ధాల పునాదిపై అమరావతి – 2

RV Ramaraoఅక్టోబర్ 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాజధాని “అమరావతి” కి శంకుస్థాపన చేసే ఉత్సవానికి హాజరు కాకూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చండీగఢ్ పరిపాలకుడిగా వ్యవహరించిన దేవసహాయం ఓ లేఖ రాశారు. ప్రధాన మంత్రి ఈ శంకుస్థాపనకు హాజరు కావడం వేలాది మంది చిన్న, సన్నకారు రైతులకు వ్యతిరేకమైన చర్య అవుతుందని మాజీ ఐ ఎ ఎస్ అధికారి దేవసహాయం ఆ లేఖలో వివరించారు. రాజధాని నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపిక చేసిన ప్రాంతం సరైందో కాదో తేల్చడానికి నేషనల్ అలయన్స్ ఫర్ పీపుల్స్ మూవ్ మెంట్స్ పంపిన నిజ నిర్ధారణ సంఘానికి దేవసహాయం నాయకత్వం వహించారు. “అమరావతి” రాజధానిగా ఉపకరించడం కన్నా స్థిరస్తి వ్యాపారులకు బంగారు గనిలా అందివస్తుందని దేవసహాయం అంటున్నారు. అది నిజమే అయినా ఇలాంటి నిరసన గళాలను, ముందు చూపుతో చేసే హెచ్చరికలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖాతరు చేస్తుందన్న భ్రమ ఎవరికీ లేదు. ఉండే అవకాశమూ లేదు. అందువల్ల ప్రధాన మంత్రి కార్యాలయం కూడా దేవసహాయం రాసిన లేఖను ఓపిక ఉంటే ఫైళ్లలో జాగ్రత్త చేయవచ్చు.

కొత్త రాజధాని నిర్మించబోతున్న “అమరావతి” ప్రాంతంలో అనేక చోట్ల తాను పర్యటించానని, ఈ విషయంపై తనదగ్గర చాలా సమాచారం ఉందని దేవసహాయం పేర్కొన్నారు. దేవసహాయం చండీగఢ్ రాజధాని పథకం డిప్యూటీ కమిషనర్ గా, ఎస్టేట్ ఆఫీసరుగా వ్యవహరించారు.

దేశ విభజనతో పశ్చిమ పంజాబ్ పాకిస్తాన్లో భాగమైతే తూర్పు పంజాబ్ భారత్ లో అంతర్భాగమైంది. విభజన కన్నా ముందు లాహోర్ పంజాబ్ రాజధానిగా ఉండేది. విభజన వల్ల భారత్ లో అంతర్భాగమైన పంజాబ్ కు కొత్త రాజధాని కావాల్సి వచ్చింది. 1952లొ కొత్త రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ క్రమంలో మన దేశంలో ప్రణాళికా బద్ధంగా నిర్మించిన మొదటి నగరం చండీగఢే.

రాజధానుల నిర్మాణంలో, దానికి ప్రణాళికలు రూపొందించడంలో, నిధుల సమీకరణ మొదలైన అంశాలలో దేవసహాయానికి అనుభవం ఉంది.

ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఆయన శంకుస్థాపనోత్సవానికి హాజరు కాకూడదని ప్రధానికి సలహా ఇచ్చారు. ఆఘమేఘాల మీద నిర్మించ తలపెట్టిన “అమరావతి” నిర్మాణం రాజ్యాంగంలోని అంశాలకు, రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలకు, 2013 నాటి భూ సేకరణ చట్టానికి, పర్యావరణ పరిరక్షణ చట్టానికి వ్యతిరేకమైందని దేవసహాయం ఆవేదన. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ రాజధాని నిర్మించడం, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణ బాధ్యత తీసుకోవడం అన్నవి ఆచరణలో వాస్తవం కాదని సింగపూర్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, దిల్లీలో శక్తివంతులైన, డబ్బున్న ఆసాములే నిజానికి రాజధానిని నిర్మిస్తారని దేవసహాయం అంటున్నారు. ఆ ప్రాంతంలో రాజధాని నిర్మించడం వల్ల ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వ్యవస్థకు, ఆహార భద్రతకు, పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని ఆయన అంచనా.

2014 నాటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఆరవ సెక్షన్ ప్రకారం కొత్త రాజధాని నిర్మాణానికి అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేయడానికి కేంద్ర ప్రభుత్వం కె.సి. శివరామ కృష్ణన్ నాయకత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పరిశీలించవలసిన అంశాలను నిర్దిష్టంగా పేర్కొన్నారు. ఆ పరిశీలనాంశాల ప్రకారం:

* ప్రస్తుత వ్యవసాయ వ్యవస్థకు వీలైత తక్కువ ఇబ్బంది ఉండేట్టు చూడాలి, నిర్వాసితులయ్యే వారి సంఖ్య వీలైనంత తక్కువ ఉండాలి.

* వరదలు, తుపానులు, భూకంపాలకు గురికాని ప్రాంాన్ని ఎంపిక చేయాలి.

* రాజధాని నిర్మాణం, భూసేకరణకు అయ్యే ఖర్చు వీలైనంత తక్కువగా ఉండాలి.

ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని శివరామకృష్ణయ్య కమిటీ ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండే చోట రాజధాని నిర్మాణం చేపట్టాలని సూచించింది. రాజధాని నిర్మాణానికి విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి (వి.జి.టి.ఎం)ప్రాంతం ఎంత మాత్రం అనువైంది కాదని తేల్చి చెప్పింది. ఇప్పుడు సరిగ్గా ఆ ప్రాంతంలోనే రాజధాని నిర్మాణం జరగబోతోంది. శివరామకృష్ణయ్య కమిటీ నివేదికను నిరాకరించడానికి ఏ కారణం చూపకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014 డిసెంబర్ 30న ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి వ్యవస్థను ఏర్పాటు చేస్తూ చట్టం చేసింది. వి.జి.టి.ఎం మాత్రమే రాజధాని ప్రాంతమని ప్రకటించింది. ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లేదు కనక కేంద్ర ప్రభుత్వ చట్టాలతో పొసగని అంశాలు ఉన్నాయి.

ఈ రాజధాని నిర్మాణానికి దాదాపు 35,000 ఎకరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రాంతాలన్నీ సస్యశ్యామలమైన వ్యవసాయ క్షేత్రాలే. ఈ ప్రాంతం కృష్ణా డెల్టా ప్రాంతంలో భాగం. అక్కడ వరదలు,తుపానులు, భూకంపాలు రావడానికి, ప్రకృతి విపత్తులు సంభవించడానికి ఆస్కారం ఉందని అనేక అధ్యయనాల్లో నిర్ధారణ అయింది. కేంద్రం కూడా ఇలాంటి ప్రాంతాన్ని ఎంపిక చేయకూడదని శివరామకృష్ణయ్య కమిటీ పరిశీలనాంశాలలో పేర్కొంది.

రాజధాని నిర్మాణం లాంటి బృహద్ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముందు అవగాహనా పత్రం, జనాభా ఎంత ఉండబోతోంది, సామాజిక ప్రభావం ఏంత, ఎంత భూమి కావాలి అని నిర్ధారించడానికి సర్వే, సాధ్యాసాధ్యాల పరిశీలన, పర్యావరణం పై ప్రభావం మొదలైనవి కచ్చితంగా జరగాలి. ఆ తర్వాత వివరమైన పథకం నివేదిక రూపొందించాలి. మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. ఇవన్నీ మొక్కుబడి వ్యవహారాలుగా పూర్తి చేసి ఓ పనైందనిపించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగమైన పర్యావరణ విభాగంతో “సూత్ర రీత్యా” ఆమోద ముద్ర వేయించుకున్నారు. అందుకే అనుసరించవలసిన పద్ధతులను నియమానుసారం అనుసరించనేలేదని దేవసహాయం అభ్యంతరం.

“అమరావతి” నిర్మాణానికి అవసరమైన భూమి కన్నా చాలా ఎక్కువ భూమి సేకరిస్తున్నారు. ఈ అంశాన్ని దేవసహాయం చండిగఢ్ తో పోల్చి చూపారు. చండీగఢ్ నిర్మాణానికి మొదటి దశలో 9,000 ఎకరాలు, రెండో దశలో 6,000 ఎకరాలు మొత్తం 15,000 ఎకరాలు మాత్రమే సేకరించారు. చండీగఢ్ లో ఆకాశ హార్మ్యాలు నిర్మించలేదు. “అమరావతి” లో ప్రధానంగా అలాంటివే నిర్మిస్తారు. అలాంటప్పుడు అంత భూమి ఎందుకు సేకరించాలన్నది ప్రశ్న. చండీ గఢ్ లో బహుళ అంతస్తుల భవనాలు లేక పోయినా ఉద్యానవనాలు, చెట్ల మధ్యలో ఉండే ప్రాంతాలు, రోడ్లకిరువైపులా విశాలమైన ఖాళీ స్థలాలు ఉన్నాయి. “అమరావతి”లో బహుళ అంతస్తులు నిర్మిస్తున్నప్పుడు చండీగఢ్ కన్నా రెండున్నర రెట్ల స్థలం ఎందుకన్నదే అసలు ప్రశ్న. ప్రభుత్వం చెప్పే సమాధానం ఏమైనప్పటికీ స్థిరాస్తి వ్యాపారానికి తెరతీయడమేనన్నది వాస్తవం.

సువిశాలమైన “అమరావతి” నిర్మించడానికి మూడు లక్షల కోట్లు అవసరమని అంచనా. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లోంచి ఇంత భారీ మొత్తం ఖర్చు చేయడం కుదరని పని.

“అమరావతి” నిర్మించతలపెట్టిన చోట ఏడాదికి రెండు మూడు పంటలు పండే నీటి వసతి గల భూములు, వర్షాధారంగా పంటలు పండించే భూములూ ఉన్నాయి. ఆ గ్రామాల్లో వ్యవసాయ కార్యకలాపాలు జోరుగా సాగుతాయి. ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయల విలువగల పంటలు పండిస్తారు. భూ వసతి ఉన్న వారు, కౌలుదార్లు, వ్యవసాయ కార్మికులు మొదలైన వారందరికీ వ్యవసాయమే జీవనాధారం. దాదాపు 120 రకాల పంటలు పండిస్తారు. ఈ గ్రామాలలో లక్ష మంది దాకా వ్యవసాయం మీదే ఆధారపడ్డారు. ఈ గ్రామాలలో 32,153 మంది ప్రధానంగా వ్యవసాయం మీద ఆధార పడ్డారని, ఇందులో 10,556 మంది తమ సొంత భూముల్లో సేద్యం చేసుకుంటున్నారని ప్రభుత్వమే చెప్తోంది. మొత్తం మీద అక్కడి జనాభాలో 80శాతం మందికి సేద్యమే జీవనాధారం. వీరికి పరిహారం అందించే పథకాలేవీ ప్రకటించలేదు.

రాజధాని నిర్మాణానికి బృహద్ ప్రణాళిక రూపొందిస్తున్న విదేశీ సలహా సంస్థలు స్థానికులను సంప్రదించకుండానే ప్రణాళికలు ఖరారు చేస్తున్నాయి. ఈ సంస్థలు పర్యావరణ, జీవావరణ, సామాజిక, ఆర్థిక తదితర వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటున్న దాఖలాలు లేవు. పైగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రాజధాని నిర్మించాలని అనుకుంటున్న చోట పర్యావరణ అనుమతి లభించేదాకా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఇటీవలే ఆదేశించింది. కనీసం నేలను చదును చేసే పని కూడా చేపట్టకూడదని నిర్దేశించింది.

ఇలాంటి పరిస్థితిలో ప్రధాని మోదీ శంకుస్థాపనకు హాజరైతే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నది దేవసహాయం వాదన. ప్రధాని శంకుస్థాపన చేయడం అంటే చిన్న, సన్నకారు రైతుల, వ్యవసాయ కార్మికుల పొట్ట కొట్టడాన్ని ప్రోత్సహించడమేనని ఆయన ఆవేదన. అయితే శంకుస్థాపనకు సకల ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునే ఆలోచన ప్రభుత్వానికి ఏ కోశాన లేదు. ప్రస్తుతానికి అభ్యంతరాలన్నీ అరణ్య రోదనగా మిగిలిపోక తప్పదు.

– ఆర్వీ రామారావ్

First Published:  17 Oct 2015 8:59 PM GMT
Next Story