సింధు సంచ‌ల‌న విజ‌యం!

కొంత‌కాలంగా ఫిట్‌నెస్ స‌మ‌స్య‌లు.. పెద్ద‌గా విజ‌యాలు లేని తెలుగు తేజం, ష‌ట్ల‌ర్ సింధు సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. డెన్మార్క్‌లో జ‌రుగుతున్న డెన్మార్క్ ఓపెన్ సూప‌ర్ సీరిస్ ప్రీమియ‌ర్ టోర్న‌మెంట్‌లో  ఎలాంటి అంచ‌నాలు లేకుండా బ‌రిలోకి దిగిన సింధు సంచ‌ల‌న విజ‌యాల‌తో దూసుకుపోతోంది! శ‌నివారం జ‌రిగిన మహిళ‌ల సింగిల్స్‌ సెమీఫైనల్ లో ప్ర‌స్తుత ప్ర‌పంచ‌ చాంపియ‌న్‌, రెండో ర్యాంకు క్రీడాకారిణి క‌రోలినా మారిన్ (స్పెయిన్‌) ను ఓడించి సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసింది. 1.15 గంట‌ల‌పాటు నువ్వా-నేనా అన్న‌ట్లుగా ఉత్కంఠ‌గా సాగిన ఈ పోరులో చివ‌ర‌కు సింధుదే పైచేయిగా నిలిచింది. 21-15, 18-21, 21-17 పాయింట్ల‌తో విజ‌యం ద‌క్కించుకుంది. మూడోరౌండ్లో తొలుత 14-16 పాయింట్ల‌తో వెన‌క‌బ‌డ్డ సింధు అనూహ్యంగా తేరుకుని ఒకేసారి ఆరుపాయింట్లు సాధించింది. మొత్తానికి ఉత్కంఠ మ‌ధ్య సాగిన మూడోరౌండ్ 21-17తో ముగియ‌డంతో విజ‌యం సింధు వ‌శ‌మై టోర్నీ ఫైన‌ల్లోకి దూసుకెళ్లింది. సాయంత్రం జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్లో చెనా క్రీడాకారిణి లీ జురుయ్‌తో అమీతుమీకి సిద్ధ‌మైంది.