Telugu Global
Others

చంద్రన్న భూసేకరణ మాయా జాలం...

అబద్ధాల పునాదిపై అమరావతి – 3 చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నది నానుడి. ఈ మాటకేంగాని చట్టాన్ని ఉల్లంఘించి నేరస్థులు, చట్టాన్ని పక్కనపెట్టి పాలకవర్గాలు తమపని తాము చేసుకుపోతుంటారు. అంధ్రప్రదేశ్ రాజధాని “అమరావతి” నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చట్టాన్ని పక్కన పెట్టేసి తన పని కానిచ్చేస్తున్నారు. చట్టం గిట్టం అంటే నానా తతంగమూ ఉంటుంది. ఆ బాదరబందీలేమీ లేకుండా చంద్రబాబు నాయుడు పోలీసు దెబ్బలు కొట్టినట్టు 29 గ్రామాల ప్రజల నుంచి భూమి […]

చంద్రన్న భూసేకరణ మాయా జాలం...
X

RV Ramaraoఅబద్ధాల పునాదిపై అమరావతి – 3

చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నది నానుడి. ఈ మాటకేంగాని చట్టాన్ని ఉల్లంఘించి నేరస్థులు, చట్టాన్ని పక్కనపెట్టి పాలకవర్గాలు తమపని తాము చేసుకుపోతుంటారు. అంధ్రప్రదేశ్ రాజధాని “అమరావతి” నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చట్టాన్ని పక్కన పెట్టేసి తన పని కానిచ్చేస్తున్నారు. చట్టం గిట్టం అంటే నానా తతంగమూ ఉంటుంది. ఆ బాదరబందీలేమీ లేకుండా చంద్రబాబు నాయుడు పోలీసు దెబ్బలు కొట్టినట్టు 29 గ్రామాల ప్రజల నుంచి భూమి సేకరించేశారు. కాదు సమీకరించారు. భూ సేకరణ అనకుండా భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) అనడంలోనే పెద్ద మతలబు ఉంది.

2013 భూసేకరణ చట్టం ప్రకారం భూ సేకరణకు కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంది. ఈ చట్టంలోని రెండవ సెక్షన్ ప్రకారం “ప్రజాప్రయోజనం కోసం” భూమి సేకరించవచ్చు. కాని రాజధాని నిర్మాణం ఈ నిర్వచనం పరిధిలోకి రాదు. ప్రజా ప్రయోజనం లాంటి మాటలేమీ చెప్పకుండానే 29 గ్రామాల ప్రజలను బుజ్జగించి, బతిమాలి, బామాలి, వినకుండా మొండికేసిన వారిని రకరకాల పద్ధతుల్లో బెదిరించి భూమి సమీకరించేశారు.

ఈ క్రమానికి అక్కడ సామాజికంగా ప్రాబల్యం కలిగిన వారు చంద్రబాబుకు బాగా తోడ్పడ్డారు. వారంతా పెద్ద భూస్వాములు. గ్రామంలో పెద్ద భూస్వాములే ముందుకొచ్చి భూమి ఇచ్చేస్తే ఇక తాము ఉండి చేసేదేమీ ఉండదని జడుసుకుని బక్క రైతులు కూడా భూమి ఇచ్చేశారు. ఇలా భూమి ఇచ్చిన వారికి పరిహారం చెల్లించలేదు. ప్రత్యామ్నాయ భూవసతి చూపించలేదు. చంద్రబాబు చేసింది భూసేకరణ కాకుండా భూ సమీకరణ కాబట్టి ఈ అంశాల ఊసే లేదు. చేసిందల్లా ఏమిటంటే భూములిచ్చిన రైతులకు ఒక సంవత్సరానికి కౌలు సొమ్ము చెల్లించారు. ఇలా ఐదేళ్ల పాటు చెల్లిస్తామని అంటున్నారు. ఇప్పుడైతే ఇచ్చారు కాని ఆ తర్వాత ఇవ్వకపోతే దిక్కేమిటి అని వాపోతున్న రైతులకు సమాధానం చెప్పే దిక్కే లేదు. రైతుల దగ్గరనుంచి నయాన్నో, భయాన్నో భూమి సమీకరించే బాధ్యతను దిప్యూటీ కలెక్టర్లకు అప్పగించారు. వారు కాగల కార్యం సాధించేశారు.

రాజధాని నిర్మాణం వల్ల గ్రామీణులకు ముప్పేమీ లేదన్న ప్రభుత్వ వాదన అబద్ధం కాదు. గ్రామాలుంటాయి. అక్కడి పొలాల్లో మాత్రమే రాజధాని నిర్మిస్తారు. పంట పొలాల్లో రాజధాని నిర్మించడం లేదని ప్రభుత్వం నమ్మ బలకడం మాత్రం పూర్తిగా అసత్యమే. ఇప్పుడు గ్రామాలున్న ప్రాంతాలలో జనం ఇళ్లు ముంగిలి అలాగే ఉంటాయి. కానీ వాటి సరసనే ఆకాశ హార్మ్యాలు వెలుస్తాయి. అప్పుడు ఈ గ్రామాలన్నీ మురికి వాడల రూపంలో సాక్షాత్కరిస్తాయి. అదీ గాక ఒక్క సారి పక్కన ఆకాశ హార్మ్యాలు వెలసిన తర్వాత సాదా సీదా ఇళ్లు ఉండే ప్రాంతానికి కూడా ధర పలుకుతుంది. అయితే అది గ్రామీణుల దృష్టిలో ఉపకరించేది కాదు. అంటే కాగితం మీదో, మార్కెట్లోనో ధర పెరిగినా వారి నోట్లోకి వచ్చేదేమీ ఉండదు. అమ్ముకుంటే తప్ప! ఆకాశ హార్మ్యాలు నిర్మించిన వారు లేదా వారి వత్తాసు దార్లు “నీకున్న సెంటు భూమి” ఎక్కువ ధరకు అమ్ముకుంటే మరో చోట 500లో వెయ్యిగజాలు వస్తుంది కదా” అని ప్రలోభ పెడ్తారు. పంట పొలాలు పోయి ఇళ్లు మాత్రమే మిగిలిన చోట గ్రామస్థులు ఉండి చేసేదేమీ ఉండదు కనక అయినకాడికి అమ్ముకోక తప్పని పరిస్థితి వస్తుంది. అది తక్షణం కాక పోవచ్చు. కాలక్రమేణా మాత్రం తప్పదు. సామాజిక ప్రభావం అంటే ఇదే. అందుకే చంద్రబాబు ఇలాంటి సామాజిక అంచనాల బాదరబందీ పెట్టుకోలేదు. గ్రామస్థులు విధి లేక ఇల్లు ముంగిలి అమ్ముకుని అక్కడి నుంచి వెళ్లి పోతే స్థానికులనే వారు ఉండడానికి అవకాశం ఉండదు. మరీ పెద్ద ఆసాములైతే తప్ప. అంటే నిర్వాసితులయ్యే వారు ఎవరూ ఉండరన్న ప్రభుత్వ వాదన కూడా తర్కానికి నిలిచేది కాదు.

రైతుల దగ్గర నుంచి సమీకరించిన భూమిని రాజధాని నిర్మాణంలో భాగస్వాములైన ఆసాములకు 99 ఏళ్ల లీజుకిస్తారు. దీనిని వారు వాణిజ్యపరంగా వినియోగించుకుంటారు. దీని కోసం 2015 మే 5వ తేదీన ప్రభుత్వం జి.ఓ.ఎం.ఎస్ నెం. 110 జారీ చేసింది. ఇలా ప్రైవేటు ఆసాములకు స్థానం కల్పించడం కోసమే రాజధాని అభివృద్ధి వ్యవస్థ చట్టం 54వ సెక్షన్ లో “డెవలపర్ ఎంటిటీస్” (వ్యవస్థాపక వ్యక్తులు/సంస్థలు) అన్న మాట చేర్చారు. ఈ ఆసాములు ఆ ప్రాంతాన్ని వాణిజ్యపరంగా “అభివృద్ధి” చేసిన తర్వాత భూమి ఇచ్చిన రైతులకు ఒక భూమి చెక్క ఇస్తారు. అది కోట్లాది రూపాయల ధర పలుకుతుందని ఆశ పెట్టారు. ఈ వాగ్దానం చేసినందువల్ల సామాజిక ప్రభావం అంచనా వేయడం, ప్రజాప్రయోజనం ఇమిడి ఉందని నిరూపించడం, రైతుల సమ్మతి పొందడం, పరిహారం చెల్లించడం, పునరావసం కల్పించడం లాంటి గొడవల నుంచి ప్రభుత్వం తప్పించుకుంది. భవిష్యత్తులో కోట్లు పలికే భూమి చెక్క కోసం రైతులు మహత్తరమైన రాజధాని నిర్మాణ క్రతువులో తమ హరితశాద్వలాలను సమిధలుగా అర్పించడానికి ఈ ఎత్తుగడ భేషుగ్గా ఉపకరించింది. రైతులకు ఈ ఫలాలు అందినా అందొచ్చు. ఎప్పుడన్నదే జవాబు లేని ప్రశ్న. సంవత్సరాలు పట్టొచ్చు. తరాలు పట్టినా ఆశ్చర్యం లేదు.

పట్టణ ప్రాంతంలో భూమి చెక్క దక్కుతుందన్న ఎండమావి వేటకు రైతులు సిద్ధపడేట్టు చేయడంలోనే చంద్రబాబు ప్రభుత్వం చాకచక్యమంతా ఉంది. ఈ లోగా వాళ్లెలా బతకాలి అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ముందు చూపు గల పాలక వర్గాల దగ్గర సమాధానం సిద్ధంగానే ఉంది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలి చేసుకుని బతకొచ్చు అని చెప్తోంది. రైతులు కూలీలుగా మారడానికి బోలెడు వెసులుబాటు కల్పించారు ఏలిన వారు.

రాజధాని నిర్మాణం వల్ల ఎక్కువగా నష్ట పోయేది వ్యవసాయ కార్మికులే. వారి దగ్గర ఇవ్వడానికి భూమి లేదు కనక వారికి వాణిజ్యపరంగా “అమరావతి” దేదీప్యమానంగా వెలిగినా భూమి చెక్క దక్కదు. కౌలుదార్లదీ ఇదే పరిస్థితి. 2013 నాటి భూసేకరణ చట్టం ప్రకారం గనక భూమి సేకరించి ఉన్నట్టైతే కౌలుదార్లకు, వ్యవసాయ కార్మికులకు కూడా పరిహారం దక్కేది. ఊహల లోకంలో తేలియాడుతున్న రాజధాని బాధితులకు ఆ సదుపాయమూ లేదు. రైతులు ఉపాధి హామీ పథకం కింద కూలి చేసుకుని బతికే అవకాశం ఉన్నట్టే కౌలుదార్లు, వ్యవసాయకార్మికులు సుందర నగరం వెలిసిన తర్వాత బిచ్చమెత్తుకుని బతకడానికి వీలుండదా! అంత వరకు ఓపికపట్టే శక్తి లేకపోతే పొట్ట చేతపట్టుకుని వలస వెళ్లొచ్చుగా. కూలినాలి జనానికి ఎక్కడైతేనేం?

– ఆర్వీ రామారావ్

First Published:  19 Oct 2015 2:33 AM GMT
Next Story