Telugu Global
Others

రక్త తర్పణానికి దేవరగట్టు రెడీ!

కళ్ళలో భక్తి. కర్రల్లో పౌరుషం. వెరసి రక్తాభిషేకం. అదే దేవరగట్టు బన్నీ ఉత్సవం. ప్రతి ఏటా భక్తి ముసుగులో విజయదశమి రోజు కర్రల సమరం జరుగుతుంది. కర్రలు కరాళ నృత్యం చేస్తాయి. కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో ఈ ఏడాది కూడా కర్రల సమరానికి గ్రామస్తులు సిద్దమవుతున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా పోలీసు యంత్రాంగం ఈ కర్రల యుద్ధాన్ని ఆపేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.  దేవరగట్టు సమీప ప్రాంతాలకు కులదైవం మాల మల్లేశ్వర స్వామి. కూర్మావతారంలో […]

రక్త తర్పణానికి దేవరగట్టు రెడీ!
X

కళ్ళలో భక్తి. కర్రల్లో పౌరుషం. వెరసి రక్తాభిషేకం. అదే దేవరగట్టు బన్నీ ఉత్సవం. ప్రతి ఏటా భక్తి ముసుగులో విజయదశమి రోజు కర్రల సమరం జరుగుతుంది. కర్రలు కరాళ నృత్యం చేస్తాయి. కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో ఈ ఏడాది కూడా కర్రల సమరానికి గ్రామస్తులు సిద్దమవుతున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా పోలీసు యంత్రాంగం ఈ కర్రల యుద్ధాన్ని ఆపేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
దేవరగట్టు సమీప ప్రాంతాలకు కులదైవం మాల మల్లేశ్వర స్వామి. కూర్మావతారంలో ఆయన్ని భక్తులు కొలుస్తారు. అయితే దసరా రోజున జరిగే ఉత్సవంతో ఉత్సవ విగ్రహాలను ఏ గ్రామానికి తీసుకెళ్తే ఆ ఊరికి మంచి జరుగుతుందని నమ్మకం. అందుకే స్వామి విగ్రహాలను తీసుకెళ్లేందుకు ఇక్కడి చుట్టుపక్కల గ్రామస్తులు తరలివస్తారు. అదే కర్రల యుద్ధానికి దారితీస్తోంది. స్థానికులు దీనికి బన్నీ ఉత్సవంగా పేరు పెట్టుకున్నారు.
మండలంలోని నెరణికి, నెరణికి తాండా, కొత్తపల్లి, సులువాయి, విరుపాపురం, అరికేర, కురుకుంద, ముద్దనగేరి, ఆలూరు గ్రామాల ప్రజలు దేవరగట్టు ఉత్సవాల్లో పాల్గొంటారు. వేల సంఖ్యలో కర్రలు తీసుకువెళ్తారు. దసరా రోజు రాత్రంతా మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం, బన్ని ఉత్సవం, భవిష్యవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మాలమల్లేశ్వర స్వామి విగ్రహాన్ని దక్కించుకునేందుకు ప్రజలు కర్రలతో కొట్టుకుంటారు. గత ఏడాది బన్ని ఉత్సవంలో నెరణికి గ్రామానికి చెందిన పదకొండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గతంలో పాతకక్షలతో ప్రత్యర్థులను మట్టుబెట్టేందుకు దేవరగట్టు బన్ని ఉత్సవాన్ని వేదికగా చేసుకునేవారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇంత నష్టం జరుగుతున్నా ఈ ఆటవిక ఆచారానికి అడ్డకట్డ పడటం లేదు. హింసను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని మానవహక్కుల కమిషన్ ఆదేశించినా ఫలితం కనిపించడం లేదు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించినా దైవం ముసుగులో హింస కొనసాగుతోంది. ఈ ఏడాది దసరా వచ్చేసింది. విజయదశమి దగ్గర పడుతోంది. మరి ఇక్కడి ప్రజల ఆచారం గెలుస్తుందా? పోలీసుల ప్రయత్నాలు ఫలిస్తాయా ? రక్తపు మరకలు లేకుండా ఈ ఏడాదైనా ఉత్సవం జరుగుతుందా? ఆ మల్లన్నకే తెలియాలి.

First Published:  20 Oct 2015 12:25 AM GMT
Next Story