బతుకులు చిదిమేసి మేడలా..?

RV Ramaraoఅబద్ధాల పునాదిపై అమరావతి – 4
ఆంధ్రప్రదేశ్ రాజధానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ. 300 కోట్ల ఖర్చుతో శంకుస్థాపన చేయడానికి ఇంకా కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలింది. ఆంధ్రప్రదేశ్ కు అద్భుతమైన రాజధాని ఉండకూడదని ఎవరూ అనడం లేదు. అయితే రాజధాని నిర్మాణానికి ఎంపిక చేసిన ప్రాంతం, దాని కోసం భూసమీకరణ చేస్తున్న తీరు సరైంది కాదనేదే విమర్శల్లోని అంతరార్థం.

రాజధాని నిర్మాణానికి చంద్రబాబు నాయుడు ఎంత ఉత్సాహం ప్రదర్శిస్తున్నారో పెట్టుబడిదారులు, స్థిరాస్తి వ్యాపారం చేసే వారు అంతకన్నా ఎక్కువ ఉత్సాహాన్నే ప్రదర్శిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి కంకణం కట్టుకున్న రాజకీయనాయకులు స్థిరాస్తి వ్యాపారులతో కుమ్మక్కై పోయారు. రాజధాని ఏర్పడితే ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఆస్తుల ధరలు పెరగడం సహజం. కాని ధరలు పెంచడం కోసమే రాజధాని నిర్మాణ ధ్యేయమైనట్టు ప్రభుత్వం వ్యవహరించడమే అభ్యంతరకరం. ఎవరి జీవితాలను బుగ్గి చేసి ఎవరి సదుపాయం కోసం రాజధాని నిర్మాణం జరుగుతోందన్నది నింపాదిగా, నిశితంగా ఆలోచించవలసిన అంశం. కాని ఈ ఓపిక ఉన్నవారి సంఖ్య సహజంగానే చాలా తక్కువగా ఉంది. ఇలాంటి వారు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎత్తి చూపే వారిని అభివృద్ధికి ఆటంకాలు కలగజేసే వారిగా జమకడుతున్నారు. సస్యశ్యామలమైన ప్రాంతంలో రాజధాని నిర్మించడం వల్ల అక్కడ వ్యవసాయ రంగం దెబ్బతింటుందని చెప్తే వినిపించుకునే నాధుడే కనిపించడం లేదు. ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించే ఓర్మి పాలకులలో ఏ దశలోనూ కనిపించలేదు. వ్యవసాయం మీద ఆధారపడిన వారి జీవనోపాధికి విఘాతం కలుగుతుందని, ఆహారభద్రతకు నష్టం కలుగుతుందని చెప్పే వారిని వెర్రివాళ్లను చూసినట్టు చూస్తున్నారు.

విజయవాడ-గుంటూరు నగరాల మధ్య 122 చదరపు కిలోమీటర్ల పరిధిలో కృష్ణా నది ఒడ్డున సుక్షేత్రాలను స్వాధీనం చేసుకుని రాజధాని నిర్మించడానికి సకల ఏర్పాట్లూ జరిగిపోయాయి. ఈ ప్రయత్నాన్ని వెనక్కు మళ్లించే అవకాశం లేదు. మొత్తం 7068 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని ప్రాంతం అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ఇది ప్రజల రాజధాని అంటున్నారు. ప్రజలు అన్న మాటకు ఎవరి నిర్వచనం వారిది. అక్కడున్న స్థానికులు జీవనోపాధి కోల్పోతే మిగిలేది ఏ ప్రజలో సులభంగానే అంచనా వేయొచ్చు. ఈ రాజధాని పర్యావరణకు అనుకూలమైందన్న వాదన నిఖార్సైన అసత్యం.

రాజధాని నిర్మాణం వల్ల 90,000 మంది సన్న, చిన్నకారు రైతులు, కౌలుదార్లు, వ్యవసాయ కార్మికులు, అవ్యవస్థీకృత రంగంలో పని చేసే వారు జీవనోపాధి కోల్పోతారు.  ఉపాధి కోల్పేయే వారిలో 80శాతం మంది కాయకష్టం చేసుకుని బతికే వారే. భూ సమీకరణకు సహకరించిన ఆసాములకు ఇళ్లస్థలాలు దక్కుతాయి, వాణిజ్యపరంగా ఉపయోగపడే స్థలాలూ దక్కుతాయి. భూమి లేని వారికి అయిదేళ్లపాటు నెలకు రూ. 2500 పింఛన్ మాత్రం అందజేస్తారు. భూమి లేని వారి జాబితా రూపొందించడంలోనూ అవకతవకలు జరిగాయని, చేర్చవలసిన వారి పేర్లన్నీ ఆ జాబితాలో చేర్చలేదన్న ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణల నిజానిజాల నిగ్గు తేల్చకుండానే రాజధాని నిర్మాణం జరిగిపోతోంది. జీవనోపాధి కోల్పోయిన వారి పిల్లలు విధిలేక బడి చదువులు, కళాశాల చదువులు మానేస్తున్నారు.

ప్రభుత్వం చెప్తున్నట్టు “అమరావతి” నిజంగానే ప్రజల రాజధాని అయి ఉంటే వ్యవసాయ కార్మికుల, అసంఘటిత రంగంలో పని చేసే కార్మికుల గోడు పట్టించుకోవాల్సింది. కాని జాబితాలో చేరిన వారికి నెలకు రూ. 2500 పింఛన్ తో సరిపెడుతున్నారు. నిజానికి ఈ వర్గాల వారికి కూడా రాజధానిపై హక్కుండాలి. అభివృద్ధి ఫలాలు వారికీ అందాలి. కాని జీవనోపాధి కోల్పోయిన వారు మరో చోటుకు వెళ్లక తప్పదు కనక ఈ రెండూ వారికి అందవు. భూమి లేని వారంతా అక్కడ గౌరవప్రదంగా బతికే అవకాశమే ఉండదు. రూ. 2500 పింఛన్ వారిని బిచ్చగాళ్లుగా దిగజార్చక తప్పదు. నిర్వాసితులయ్యే వారందరికీ ఉపాధి కల్పించే పూచీ ప్రభుత్వం తీసుకోకపోతే నిర్వాసితులు ఎవరూ ఉండరన్న వాదన బూటకంగా మిగిలిపోక తప్పదు.

పట్టణాల అభివృద్ధే అభివృద్ధి అన్న జాడ్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎంతగా ఆవరించిందో శంకుస్థాపన చేయనున్న నరేంద్ర మోదీని అంతకన్నా ఎక్కువే కబళించింది. ఈ రకమైన అభివృద్ధి ప్రణాళిక అప్రజాస్వామికమైంది, అమానుషమైంది. జనం బతుకులు ఛిద్రం చేసి కట్టే మేడలు ఎవరికోసమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

– ఆర్వీ రామారావ్