Telugu Global
Others

రామోజీకి లేని రూల్స్‌ పవన్‌కా?

అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానాలు పలికే విషయంలో చంద్రబాబు లేనిపోని చిక్కులను ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు దృష్టిలో ఆత్మీయులెవరు?.. ఆటలో అరటి పండులెవరు అన్న విషయం శంకుస్థాపన ఆహ్వానాల ద్వారా తేటతెల్లమవుతోంది. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును చంద్రబాబు నేరుగా వెళ్లి ఆహ్వానించిన తర్వాత దీనిపై చర్చ మరింత ఎక్కువైంది. ప్రధాన ప్రతిపక్ష నేత జగన్‌ను నేరుగా చంద్రబాబే ఆహ్వానించవచ్చు కదా అని కొందరు సలహా ఇస్తే టీడీపీ మంత్రులు కస్సున లేచారు. ప్రతిపక్షనేతది జస్ట్ కేబినెట్ హోదా మాత్రమేనని […]

రామోజీకి లేని రూల్స్‌ పవన్‌కా?
X

అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానాలు పలికే విషయంలో చంద్రబాబు లేనిపోని చిక్కులను ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు దృష్టిలో ఆత్మీయులెవరు?.. ఆటలో అరటి పండులెవరు అన్న విషయం శంకుస్థాపన ఆహ్వానాల ద్వారా తేటతెల్లమవుతోంది. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును చంద్రబాబు నేరుగా వెళ్లి ఆహ్వానించిన తర్వాత దీనిపై చర్చ మరింత ఎక్కువైంది.

ప్రధాన ప్రతిపక్ష నేత జగన్‌ను నేరుగా చంద్రబాబే ఆహ్వానించవచ్చు కదా అని కొందరు సలహా ఇస్తే టీడీపీ మంత్రులు కస్సున లేచారు. ప్రతిపక్షనేతది జస్ట్ కేబినెట్ హోదా మాత్రమేనని అందుకే సీఎం అవసరం లేదు మేమే వెళ్లి పిలుస్తామని మంత్రి కామినేని మీడియా ముఖంగా చెప్పారు. ప్రతిపక్షాలకు ప్రోటోకాల్ గురించి తెలియదా అంటూ పాఠాలు చెప్పారు. పవన్ విషయంలోనూ ఇదే జరిగింది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డి క‌ృషి చేసిన పవన్ కల్యాణ్‌ను కూడా కరివేపాకును చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్‌ను ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రే నేరుగా వచ్చేవారని కానీ ప్రోటోకాల్ ప్రకారం బాగోదు కాబట్టి రాలేదంటూ అధికార పార్టీ బాగానే కవర్ చేసుకుంది. ఆ క్షణంలో పవన్ కల్యాణ్‌ కూడా ఏమీ మాట్లాడలేకపోయారు. చూసేవారు కూడా అంతే కదా సీఎం నేరుగా వెళ్లడం సరికాదని అభిప్రాయపడ్డారు.

అయితే జగన్, పవన్ కల్యాణ్‌ విషయం గుర్తుకొచ్చిన ప్రోటోకాల్ రామోజీరావు విషయంలో ఎందుకు అడ్డురాలేదన్నదే ఇప్పుడు పవన్ అభిమానుల పశ్న. పవన్ మాట ప్రకారం టీడీపీకి ఓటేసిన కాపులది ఇదే ప్రశ్న. పవనే లేకుంటే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చేదా అని ప్రశ్నిస్తున్నారు. పవన్‌తో పనైపోయింది కాబట్టి ప్రోటోకాల్ గుర్తుకొచ్చిందా?… రామోజీ రావు దగ్గర పేపరు, టీవీలు ఉన్నాయి కాబట్టి ఆయన ఇంటికి మాత్రం నేరుగా వెళ్తారా అని మండిపడుతున్నారు. ఒక వేళ వయసులో పెద్దవాడు కాబట్టి నేరుగా వెళ్లి ఉంటారనుకున్నా… మరి గవర్నర్ రోశయ్యకు తొలుత కొరియర్‌ ఆహ్వానం పంపారు కదా అని గుర్తుచేస్తున్నారు. నిజంగా వయసుకే గౌరవం ఇచ్చేవారయితే రోశయ్యకు అలా తొలుత కొరియర్‌లో ఆహ్వానం పంపేవారా అని ప్రశ్నిస్తున్నారు.

ఒడ్డు చేరక ముందు ఓడ మల్లన్న… ఒడ్డు చేరాక బోడి మల్లన్న అనడం చంద్రబాబుకు బాగా అలవాటైపోయిందని పవన్ ఫ్యాన్స్ రుసరుసలాడుతున్నారు. ఒక్క పవన్ విషయంలోనే కాకుండా చాలా అంశాల్లో తమను ప్రభుత్వం అవమానిస్తోందని కాపులు విమర్శిస్తున్నారు. కాపుల సంక్షేమం కోసం వెయ్యి కోట్లు ఇస్తామన్న చంద్రబాబు అధికారంలోకి రాగానే కేవలం వంద కోట్లు ప్రకటించి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాపుల రిజర్వేషన్ అంశం పత్తా లేకుండా పోయిందంటున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన చినరాజప్పకు డిప్యూటీ సీఎం, హోంమంత్రి పదవి ఇచ్చినా ఆ శాఖల విషయంలో అధిపత్యం మొత్తం లోకేష్ బాబుదేనని మండిపడుతున్నారు.

First Published:  19 Oct 2015 11:20 PM GMT
Next Story