మళ్ళీ రామోజీ చుట్టూ రాజకీయ గణం!

PR Chennuమీడియా మొఘల్‌ రామోజీరావు చుట్టూ రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. ఆయనను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో నాయకులున్నారా? లేక ఆయనే నాయకులను తమ చుట్టూ తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నారా? అనే సందేహం కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రభ వెలిగిపోవడం ఖాయమనుకున్న వారు అధికమే. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడే కాకుండా ప్రతిపక్ష నాయకులు కూడా ఆయన వెంట తిరుగుతున్నారు. దీనికి కారణాలు ఏమైనప్పటికీ రామోజీ మాత్రం వార్తల్లో వ్యక్తి అయిపోయారు.

ఇటీవల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్మోహనరెడ్డి రామోజీని కలిశారు. ఆయన తన వద్దకు పిలిపించుకున్నారా? లేక జగనే స్వయంగా వెళ్ళి ఆయనను దర్శించుకుని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారా? అన్నది ఇంకా తేలలేదు. అయితే ఏపీ రాజధాని శంకుస్థాపన వంకతో చంద్రబాబునాయుడు కూడా రామోజీని కలిసి వెళ్ళారు. మామూలుగా అయితే… ఇదివరకటి పరిస్థితుల్లో చంద్రబాబు చాలా తరచుగా రామోజీని కలిసేవారు. కాని ఇటీవల కాలంలో ఈ పరిస్థితి లేదు. ఇద్దరు సమావేశమవడం బాగా తగ్గిపోయింది. దీన్ని ఆసరాగా తీసుకుని జగన్‌ను దగ్గర చేసుకునే ప్రయత్నం రామోజీ చేస్తున్నారన్న వాదనా లేకపోలేదు.

ఇక తెలంగాణ విషయానికొస్తే రామోజీరావు స్వయంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును కలిశారు. టెంపుల్‌ టౌన్‌ విశేషాలను ఆయనకు చెప్పడానికే తమ సమావేశం జరిగినట్టు రామోజీ వర్గాలు ప్రచారం చేశాయి. ఈ సమావేశం మాత్రం ఉభయ తారకంగా లాభపడేందుకేనని అందరూ భావించారు. అదే నిజం కూడా. తెలంగాణలో రామోజీ ఫిల్మ్‌ సిటీకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకోవడం రామోజీకి చాలా అవసరం. తనకున్న ఆస్తుల రక్షణకు కూడా ఇది అవసరం. అలాగే కేసీఆర్‌ కూడా రాష్ట్రంలోనే అతి పెద్ద మీడియా గ్రూపు తన అవసరాలకు ఉపయోగపడేలా చేసుకోవాలనుకోవడం సహజం.

ఆంధ్రజ్యోతి ఇప్పటికే తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందున ఈనాడు వంటి గ్రూపును కూడా దూరం చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులుంటాయో ఆయనకు తెలుసు. ఇప్పటికిప్పుడు సమస్యలు లేకపోయినా భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారన్నదానికి ఈ సమావేశం నిదర్శనం. తనను కలవడంతోనే పని అయిపోయినట్టు భావించకుండా కేసీఆర్‌ కూడా స్వయంగా ఫిల్మ్‌ సిటీకి వెళ్ళి రామోజీతో చేతులు కలిపి వచ్చారు.

ఈ వ్యవహారాలన్నింటి కన్నా ముందే రామోజీరావు ఈటీవీ ఉత్సవాల పేరుతో కాంగ్రెస్‌ నాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవిని, ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఆహ్వానించి వేడుక నిర్వహించారు. ఒకే డయాస్‌ మీదకి ఇద్దరిని తీసుకువచ్చారు. బీజేపీలోని అగ్రనాయకుల్లో చాలామంది రామోజీకి సన్నిహితులుగా వ్యవహరిస్తారు. కాబట్టే ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఏమీ చేయలేక పోయారు.

సరిగ్గా ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తానేందుకు మీడియా మొఘల్‌తో దూరం పెంచుకోవాలన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్‌ కూడా పావులు కదపడం మొదలెట్టినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలకు కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా ఉన్న దిగ్విజయ్‌సింగ్‌ రామోజీరావును కలిసివెళ్ళినట్టు వార్తలు వస్తున్నాయి. ఆయనతోపాటు టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఉన్నట్టు చెబుతున్నారు. ఇవి మర్యాద పూర్వక సమావేశమే అని చెబుతున్నా సహజంగానే దీనికి ప్రాముఖ్యత ఏర్పడింది.

ఆంద్రజ్యోతి ఎటూ తెలంగాణలో టిఆర్ఎస్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని కాంగ్రెస్‌ తనకు అనుకూలంగా మలచుకునేందుకు దిగ్విజయ్‌సింగ్‌ ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. మొత్తం మీద పార్టీలకతీతంగా… నాయకులను రామోజీ తన ఛత్రం కిందకు తెచ్చుకుంటున్నట్టు ఈ వ్యవహారాలను బట్టి అర్దమవుతోంది. పార్టీల ప్రయోజనాల కన్నా రామోజీ ప్రయోజనాలే ఇందులో ఎక్కువగా ఉంటాయన్నది కాదనలేని సత్యం. ఎవరితో ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో తెలియని రామోజీరావు అన్ని పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవడంలో అందెవేసిన చెయ్యి. అందుకే పార్టీలకతీతంగా… వ్యక్తుల ప్రాబల్యమొక్కటే ప్రాతిపదికగా ఆయన పావులు కదుపుతారన్న నిజం మరోసారి నిరూపితమవుతోంది. నాయకుల బలహీనతలే రామోజీకి బలం.
– పీఆర్‌ చెన్ను