మోదీ వచ్చారు… మన్ను ఇచ్చారు

peddi rajuఆర్భాటంగా… ఎంతో హడావుడిగా… ఎంతో అద్భుతంగా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని శంకుస్థాపన కార్యక్రమం ఘనంగానే జరిగింది. దీనికి ప్రత్యేక ఆహ్వానితునిగా వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోది రాజధాని నగరం అమరావతికి శంకుస్థాపన చేశారు. శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం మొదలు పెట్టినప్పటి నుంచి ఆయన అమరావతి నిర్మాణానికి… ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఎలాంటి హామీ ఇస్తారని అందరూ ఆశగా ఎదురు చూశారు.

మరోసారి ఏపీ ప్రజల ఆశలపై ఆయనే తెచ్చిన యమునా నది నీళ్ళు చల్లారు. ఆయన ప్రసంగమంతా రాజకీయ తరహాలోనే సాగింది. ఆంధ్రప్రదేశ్‌ను విభజించేటప్పుడు కాంగ్రెస్‌ దగా చేసిందని, ఏ అంశమూ సజావుగా చేయలేదని అంటూనే విభజన సమయంలో ఇచ్చిన హామీలను తూ.చ. తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలో నిజాయితీ లేదు… అసలు హామీలే సరిగా ఇవ్వలేదన్న కాంగ్రెస్‌ను ఓ వైపు నిందిస్తూనే ఆ పార్టీ చట్టంలో పొందుపరిచిన హామీలు నూరు శాతం అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. అంటే కాంగ్రెస్‌ చేసిన మోసానికి మోదీ కూడా రాజముద్రతో సర్టిఫై చేశారు.

తనను ఆహ్వానించడానికి వచ్చిన సమయంలో చంద్రబాబు చెప్పిన ఆలోచన తనకు ఎంతగానో నచ్చేసిందని, ఆ స్ఫూర్తితోనే పార్లమెంట్‌ భవన ప్రాంగణం నుంచి పుట్టమన్నును, ఢిల్లీలో పారుతున్న యమునా నది జలాన్ని తెచ్చానని ఎంతో ఘనంగా ప్రకటించారు. వచ్చీరాని తెలుగులో శ్రీశ్రీ కవిత్వాన్ని జోడించి మరీ చెప్పారు. ఇది విన్న ఏపీ ప్రజలు ఎంతో ఆనందించారు. ఆయన ఆ తర్వాత చేసే ప్రసంగంలో ఇంతకన్నా ఎక్కువగా చెబుతారని, ఆయన ఇచ్చే హామీలతో ఆంధ్రప్రదేశ్‌ తరించి పోతుందని ఎంతో గొప్పగా నమ్మారు.

ప్రధాని మోదీ చేస్తున్న ప్రసంగాన్ని చెవులు రిక్కించి విన్న ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. ఆయన్ని ఎందుకు పిలిచామా అని నాయకులు కూడా అనుకునే స్థాయికి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశలపై యమునా నది నీళ్ళు చల్లేసి వెళ్ళిపోయారు. ఆయన వచ్చి చేసింది ఏమిటయ్యా అంటే… చంద్రబాబు కుటుంబంతో ఓ మంచి ఫొటో దిగారు. చంద్రబాబు మనవడు దేవాంశ్‌కు తన కళ్ళజోడు పెట్టి కాసేపు మురిసిపోయారు. రాజధాని నగరం అమరావతి రోడ్‌ మ్యాప్‌ను తిలకించారు. ఈ పదిహేను నెలల కాలంలో కేంద్రం నుంచి వచ్చిన 11 విద్యాసంస్థల పేర్లు వల్లించారు. భవిష్యత్‌లో అమరావతి కోసం ఇరగదీసేస్తామని హామీ గుప్పించారు. ప్రధాని మోది అమరావతి పర్యటనలో అసలు ఆంధ్రప్రదేశ్‌కు ఏమి చేస్తారో చెప్పిస్తామన్న భారతీయ జనతాపార్టీ నేతల నోటికి కూడా మాట రాకుండా చేశారు.

నాలుగు వందల కోట్లు ఖర్చు చేసినట్టు చెబుతున్న ఈ క్రతువుకు కనీసం ఆ నాలుగు వందల కోట్లయినా వస్తాయన్న భరోసా ప్రధాని మోదీ ప్రసంగంలో ఎక్కడా కనిపించలేదు. నిగ్గదీసి అడిగే పరిస్థితి లేదన్న భరోసాతో మోదీ ప్రసంగం సాగిందని విశ్లేషకులు అంటున్నారు. బాబు-మోదీ జోడి అంటూ చాలా పెద్ద మాట వాడినప్పటికీ కేంద్రం వైఖరిగాని, మోది వైఖరిగాని స్పష్టం కాలేదు. లక్ష కోట్ల ప్యాకేజీతో వస్తారని కొందరు… ప్రత్యేక హోదా ప్రకటనతో వస్తారని మరికొందరు రకరకాల విశ్లేషణలు చేశారు. తీరా ఆయన ప్రసంగం చూసిన వారికి భ్రమలు తొలగిపోయాయి. చివరికి సిగ్గులేని తెలుగుదేశం నాయకులు ఎలా విశ్లేషిస్తున్నారంటే… లక్ష కోట్ల ప్యాకేజీ, ప్రత్యేక ప్యాకేజీ వంటి వన్నీ మీడియా సృష్టి అని, తామెక్కడా చెప్పలేదని చెబుతున్నారు. మోది వచ్చి వెళ్ళిపోయారు. కాని చేదు జ్ఞాపకంగా ఆయన పర్యటన మిగిలిపోయింది. 
– పీఆర్‌ చెన్ను