క్రిష్ తో అఖిల్…..

హీరోగా ఎదుగుతున్న టైమ్ లో ఎవరూ ప్రయోగాలు చేయరు. మరీ ముఖ్యంగా ఫుల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలంతా మాస్ సినిమాలకే ఇంపార్టెన్స్ ఇస్తారు. అక్కినేని అఖిల్ కూడా అదే చేశాడు. తొలి సినిమాగా మాస్ మసాలాస్ ఉన్న కథనే ఎంచుకున్నాడు. కానీ రెండో సినిమా నుంచి తన స్టయిల్ చూపిస్తున్నాడు అఖిల్. తండ్రి బాటలో ప్రయోగాలు చేసేందుకు సిద్ధమౌతున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. తన రెండో సినిమాకు క్రిష్ ను దర్శకుడిగా తీసుకునే ఆలోచనలో ఉన్నాడు అఖిల్. కాస్త షాకింగ్ కు గురిచేసినా ఇది నిజమేనంటోంది ఫిలింనగర్ సర్కిల్. మాస్ మసాలా సినిమాలకు దూరంగా క్రిష్ మూవీస్ ఉంటాయి. మరీ ముఖ్యంగా బలమైన సందేశాన్నిచ్చే విధంగా తెరకెక్కుతాయి. గతంలో వచ్చిన వేదం, గమ్యం, కృష్ణంవందే జగద్గురుం లాంటి సినిమాలతో పాటు తాజాగా వచ్చిన కంచె సినిమా కూడా బలమైన సోషల్ మెసేజ్ తోనే తెరకెక్కింది. ఈ దర్శకుడి సినిమాల్లో కమర్షియల్ హంగులు, ఐటెంసాంగ్స్ ఉండవు. ఇలాంటి దర్శకుడితో తన రెండో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు అఖిల్. తండ్రి నాగార్జున తరహాలోనే ప్రయోగాల బాట పడుతున్నాయి. ఈ కాంబినేషన్ పై త్వరలోనే ప్రకటన రానుంది.