కేంద్రమంత్రి వ్యాఖ్యలపై రాజ్‌నాథ్‌సింగ్‌ సీరియస్‌

నోరు అదుపులో పెట్టుకోవాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ బీజేపీ సీనియర్‌ నాయకులకు హితవు చెప్పారు. నోటికొచ్చినట్టు మాట్లాడడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని, కేంద్ర మంత్రులు వ్యక్తిగత హోదాలో ఉన్నట్టు మాట్టాడడం సరికాదని ఆయన అన్నారు. హర్యానాలోని సన్‌పెడ్‌ గ్రామంలో ఇద్దరు దళిత చిన్నారుల సజీవ దహనం ఘటన నేపథ్యంలో వి.కె. సింగ్‌ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. ‘కుక్కపై ఎవరో రాళ్లేస్తే కేంద్రంపై నిందలేస్తారా?’ అంటూ కేంద్ర మంత్రి వీకే సింగ్‌ వ్యాఖ్యానించడంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఇద్దరు చిన్నారులను సజీవ దహనం చేస్తే ఈ సంఘటనను ‘కుక్కపై రాళ్ళేసిన ఘటనతో పోలుస్తారా’ అంటూ ఆమ్‌ ఆద్మీ సీఎం కేజ్రీవాల్‌తోపాటు మాయావతి, రాహుల్‌గాంధీ తదితర నాయకులు… పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు తీవ్రంగా దుయ్యబట్టారు. కేంద్ర మాజీ మంత్రి షెల్జా, సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌, బీజేపీ మిత్రపక్ష నేతలు జితన్‌రామ్‌ మాంఝీ, రాంవిలాస్‌ పాశ్వాన్‌లు కూడా వి.కే.సింగ్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలని డిమాండు చేశారు. మరోవైపు సింగ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని షెడ్యూల్డు కులాల జాతీయ కమిషన్‌ ఉత్తరప్రదేశ్‌ డీజీపీ, ఢిల్లీ పోలీసు కమిషనర్లను ఆదేశించింది. దళితులపై బీజేపీ వైఖరేమిటో సింగ్‌ వ్యాఖ్యలతో స్పష్టమవుతోందంటూ ప్రస్తుత సీఎం నితీశ్‌కుమార్‌ ఎన్నికల ప్రచార సభల్లో ధ్వజమెత్తారు. కాగా, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. మంత్రులు, అధికార పార్టీ నేతలు అపార్థాలకు తావిచ్చేలా వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరించారు.