సౌఖ్యంతో క్రిస్ మ‌స్ సంద‌డి

యాక్ష‌న్ చిత్రాలు చేసే గోపిచంద్ అప్పుడుప్పుడు  హండ్రెట్ ప‌ర్సెంట్  ఫ్యామిలీ  స్టోరిస్ తో   అభిమానుల‌కు మ‌రింత  ద‌గ్గ‌ర‌వుతున్న విష‌యం తెలిసిందే.   తాజాగా  సౌఖ్యం పేరు తో  పూర్తి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ చేయ‌డానికి సిద్దం అయ్యాడు.
సాధార‌ణంగా ఇద్దరు మ‌నుషులు ఎదురైన‌ప్పుడు పెదాల మీద చిరున‌వ్వుతో పాటు మ‌న‌సులోనుంచి వ‌చ్చే మాటే `సౌఖ్యంగా ఉన్నారా` అని. ఎదుటివారి సౌఖ్యాన్ని గురించి ఆలోచించేది ఆత్మీయులే. అలాంటి ఆత్మీయులంద‌రూ సౌఖ్యంగా ఉండాల‌నుకునే వ్యక్తి క‌థ‌తో తెర‌కెక్కుతున్న సినిమా `సౌఖ్యం`. గోపీచంద్ హీరోగా భవ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తున్న సినిమాకు `సౌఖ్యం` అనే పేరును ఖ‌రారు చేశారు. ఎ.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో గోపిచంద్ సరసన రెజీనా నటిస్తోంది.
ఈ చిత్రంలోని పాటలు మినహా టాకీ పూర్తయింది. ఈ నెల 26 నుంచి న‌వంబ‌ర్ 7 వ‌ర‌కు విదేశాల్లో మూడు పాట‌ల‌ను చిత్రీక‌రిస్తున్నట్లు నిర్మాత తెలిపారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పాట‌లు చాలా హుషారుగా సాగుతాయన్నారు. స్విట్జ‌ర్లాండ్‌, ఆస్ట్రియాలో ర‌ఘు మాస్టర్ నేతృత్వంలో హీరో, హీరోయిన్‌పై మూడు పాట‌ల‌ను చిత్రీక‌రిస్తారు. మిగిలిన రెండు పాట‌ల‌ను హైద‌రాబాద్‌లో చిత్రీక‌రించనున్నట్లు తెలిపారు. దాంతో మొత్తం సినిమా పూర్తవుతుంది. క్రిస్‌మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 25న సినిమాను విడుద‌ల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.