Telugu Global
Others

ఒత్తిడిని ఇలా....క‌డిగేయండి!

రోజంతా ఊపిరి స‌ల‌ప‌ని ప‌నులతో, సాయంత్రానికి భ‌రించ‌లేని మాన‌సిక ఒత్తిడిలో కూరుకుపోతున్నారా? జిమ్‌కి వెళ్ల‌డం ద్వారానో, ఒక గ్లాసు వైన్ తాగుతూనో లేదా హాయిగా టివి ముందు కూర్చునో ఒత్తిడిని వ‌దిలించుకోవాల‌నుకుంటున్నారా…ఇవ‌న్నీ కాక‌పోతే సంగీతం విన‌డం, స్నేహితుల‌తో క‌బుర్లు, న‌చ్చిన పుస్త‌కం చ‌ద‌వ‌డం…ఈ వ‌రుస చాలా పెద్ద‌ది. ఎవ‌రి అభిరుచిని బ‌ట్టి వారు ఎంపిక చేసుకుంటారు. అయితే ఒక నూత‌న అధ్య‌య‌నం, వీట‌న్నింటిని మించి మీ మాన‌సిక‌ అల‌స‌టని పోగొట్టే మార్గం ఒక‌టుంది అంటోంది…అదేంటంటే ఇంట్లో గిన్నెల‌ను త‌ళ‌త‌ళ‌లాడేలా తోమి క‌డిగేయ‌డం. మైండ్‌ఫుల్‌నెస్‌ అనే ప‌త్రిక‌లో ఈ […]

ఒత్తిడిని ఇలా....క‌డిగేయండి!
X

రోజంతా ఊపిరి స‌ల‌ప‌ని ప‌నులతో, సాయంత్రానికి భ‌రించ‌లేని మాన‌సిక ఒత్తిడిలో కూరుకుపోతున్నారా? జిమ్‌కి వెళ్ల‌డం ద్వారానో, ఒక గ్లాసు వైన్ తాగుతూనో లేదా హాయిగా టివి ముందు కూర్చునో ఒత్తిడిని వ‌దిలించుకోవాల‌నుకుంటున్నారా…ఇవ‌న్నీ కాక‌పోతే సంగీతం విన‌డం, స్నేహితుల‌తో క‌బుర్లు, న‌చ్చిన పుస్త‌కం చ‌ద‌వ‌డం…ఈ వ‌రుస చాలా పెద్ద‌ది. ఎవ‌రి అభిరుచిని బ‌ట్టి వారు ఎంపిక చేసుకుంటారు. అయితే ఒక నూత‌న అధ్య‌య‌నం, వీట‌న్నింటిని మించి మీ మాన‌సిక‌ అల‌స‌టని పోగొట్టే మార్గం ఒక‌టుంది అంటోంది…అదేంటంటే ఇంట్లో గిన్నెల‌ను త‌ళ‌త‌ళ‌లాడేలా తోమి క‌డిగేయ‌డం. మైండ్‌ఫుల్‌నెస్‌ అనే ప‌త్రిక‌లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

మ‌న ధ్యాసంతా పెట్టి స‌బ్బు వాస‌న‌ని పీలుస్తూ, గిన్నెల జిడ్డుని వ‌దిలిస్తూ, ఆ క్ర‌మంలో గిన్నెల్లో వ‌స్తున్న మార్పుల‌ను గ‌మ‌నిస్తూ, నీళ్ల తాకిడిని ఎంజాయి చేస్తూ అంట్లు తోమేస్తే చాలు మీ ఒత్తిడి కాస్తా చిత్త‌యిపోతుంద‌ని ఈ అధ్య‌య‌నంలో రుజువైంది. నెగెటివ్ ఆలోచ‌న‌ల‌ను వ‌దిలించుకునేందుకు చేస్తున్న ప‌నిలో పూర్తిగా మ‌మేక‌మైపోవ‌డం, పంచేద్రియాలు అదేప‌నిలో నిమ‌గ్నమ‌వ‌డం మైండ్‌ఫుల్‌నెస్‌. అప్పుడు మైండ్‌ ప్ర‌శాంతంగా పాజిటివ్‌గా ఉండ‌గ‌లుగుతుంది. మ‌రి రోజువారీ చేసే ప‌నుల్లోనూ ఈ మైండ్‌ఫుల్‌నెస్‌ని సాధించ‌డం సాధ్య‌మేనా…అనే కోణంలో చేసిన అధ్య‌య‌నంలో సానుకూల ఫ‌లితాలు క‌న‌బ‌డిన‌ట్టుగా దీని నిర్వాహ‌కులు చెబుతున్నారు. ఫ్లోరిడా స్టేట్ యూనివ‌ర్శిటీలో ఈ అధ్య‌య‌నం నిర్వ‌హించారు.

51మంది కాలేజి విద్యార్థుల‌ను ఎంపిక చేసుకుని వారిలో స‌గంమంది చేత అంట్లు ఎలా తోమాలి…అనే సాధార‌ణ విష‌యాల‌ను చ‌దివించారు. మిగిలిన స‌గం మందితో మైండ్‌ఫుల్‌నెస్‌తో ఎలా అంట్ల‌ను తోమాలి…అనే విష‌యాన్ని చ‌దివించారు. మైండ్‌ఫుల్ నెస్‌తో గిన్నెలు క‌డుగుతున్న‌పుడు మీ పూర్తి ఏకాగ్ర‌త దానిమీదే ఉండాలి…మీ ప్ర‌పంచ‌మంతా ఆ ప‌నే అన్న‌ట్టుగా అనుక్ష‌ణం ఫీల‌వ్వాలి…ఇలాంటి అంశాలు మైండ్‌ఫుల్ నెస్ కోసం ఎంపిక చేసుకున్న వారిచేత చ‌దివించారు.

రెండు గ్రూపులు ప‌ని పూర్తి చేశాక గ‌మ‌నించిన‌పుడు మైండ్‌ఫుల్‌నెస్‌తో అంట్లు తోమిన వ్య‌క్తుల మెద‌డు చ‌క్క‌ని సానుకూల వైఖ‌రితో ఉన్న‌ట్టుగా గ‌మ‌నించారు. కేవ‌లం ఒక‌ప‌నిలా మాత్ర‌మే అంట్లు తోమిన మొద‌టి వ‌ర్గం వారికంటే వీరిలో 27శాతం ఆందోళ‌న త‌గ్గిన‌ట్టుగా 25శాతం మాన‌సిక సామ‌ర్ధ్యం పెరిగిన‌ట్టుగా గుర్తించారు. అధ్య‌య‌న నిర్వాహ‌కుల్లో ఒక‌రైన హాన్లే మెడిక‌ల్ న్యూస్ టుడెకి ఈ వివ‌రాల‌ను వెల్ల‌డిస్తూ కేవ‌లం ఇంటిప‌నిగా భావించే ఈ ప‌ని ద్వారా ఇంత ప్ర‌యోజ‌నం పొంద‌గ‌ల‌గ‌డం అనేది త‌న‌కెంతో ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింద‌ని అన్నారు.

మైండ్‌ఫుల్‌నెస్‌తో ప‌నిచేస్తున్న‌పుడు మ‌న‌లో ఆందోళ‌న‌, చిరాకు, టెన్ష‌న్లు అన్నీ ప‌క్క‌కు వెళ్లిపోయి దృష్టిమొత్తం ప‌నిమీద‌ పెట్టే వీలు ఉంటుంద‌ని, అలా మ‌న‌సు భ‌విష్య‌త్తులోకి, గ‌తంలోకి ప‌రుగులు తీయ‌కుండా ప్ర‌స్తుతంలో ఉండ‌టం సాధ్య‌మ‌వుతుంది క‌నుక‌నే ఒత్తిడి ప‌టాపంచ‌లై పోతుంద‌ని హాన్లే అంటున్నారు. అమెరిక‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్ట్రెస్ ప్ర‌కారం మ‌న అనారోగ్యాల్లో 60శాతం కేవ‌లం ఒత్తిడి కార‌ణంగానే వ‌స్తున్నాయి.

మ‌రిన్ని ఇంటిప‌నులపై ఈ త‌ర‌హా అధ్య‌య‌నాలు నిర్వ‌హించాల‌ని ఈ అధ్య‌య‌న‌వేత్త‌లు భావిస్తున్నారు. ఒక క్ర‌మ ప‌ద్ధ‌తిలో చేసే మైండ్‌ఫుల్‌నెస్ సాధ‌న అనేది, ఒక ప‌ద్ధ‌తి అంటూ లేకుండా సాగే గెన్నెలు క‌డిగే ప‌నిలో ఎలా సాధ్య‌మైంది అనే విష‌యంపై ఇప్పుడు దృష్టి సారించే ప్ర‌య‌త్నంలో ఉన్నారు.

First Published:  27 Oct 2015 2:52 AM GMT
Next Story