Telugu Global
Others

ఆధిప‌త్యం.. అస్తిత్వం.. గంద‌ర‌గోళం

వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌కు ముందే.. టీడీపీ-బీజేపీల మ‌ధ్య యుద్ధం మొద‌లైంది. కేంద్రం, తెలుగు రాష్ర్టాల్లో పొత్తు నేప‌థ్యంలో బీజేపీ ఆధిప‌త్య ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా.. ఎలాగైనా ఈసారి పోటీ చేసి తెలంగాణ‌లో త‌మ అస్తిత్వాన్ని చాటుకోవాల‌న్న ధోర‌ణిలో టీడీపీ ఉంది. ఎవ‌రు పోటీ చేయాల‌న్న విష‌యంలో ఇప్ప‌టికీ స్ప‌ష్ట‌త రాక‌పోవ‌డంతో మిత్ర ప‌క్షాల మ‌ధ్య ఎన్నిక‌ల‌కు ముందే.. ఆధిప‌త్యానికి.. అస్తిత్వానికి మ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర పోరు జ‌రుగుతోంది. మ‌రోసారి త‌మ‌కే అవ‌కాశం ఇవ్వాల‌ని బీజేపీ ప‌ట్టుబ‌డుతుండ‌గా.. ఈ సారి అవ‌కాశం […]

ఆధిప‌త్యం.. అస్తిత్వం.. గంద‌ర‌గోళం
X
వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌కు ముందే.. టీడీపీ-బీజేపీల మ‌ధ్య యుద్ధం మొద‌లైంది. కేంద్రం, తెలుగు రాష్ర్టాల్లో పొత్తు నేప‌థ్యంలో బీజేపీ ఆధిప‌త్య ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా.. ఎలాగైనా ఈసారి పోటీ చేసి తెలంగాణ‌లో త‌మ అస్తిత్వాన్ని చాటుకోవాల‌న్న ధోర‌ణిలో టీడీపీ ఉంది. ఎవ‌రు పోటీ చేయాల‌న్న విష‌యంలో ఇప్ప‌టికీ స్ప‌ష్ట‌త రాక‌పోవ‌డంతో మిత్ర ప‌క్షాల మ‌ధ్య ఎన్నిక‌ల‌కు ముందే.. ఆధిప‌త్యానికి.. అస్తిత్వానికి మ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర పోరు జ‌రుగుతోంది. మ‌రోసారి త‌మ‌కే అవ‌కాశం ఇవ్వాల‌ని బీజేపీ ప‌ట్టుబ‌డుతుండ‌గా.. ఈ సారి అవ‌కాశం త‌మ‌కే ఇవ్వాల‌ని టీడీపీ నేత‌లు బ‌లంగా వాదిస్తున్నారు.
ఈ ద‌ఫా మాదే!
2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఇప్ప‌టికే ఈ స్థానంలో పోటీ చేసిన బీజేపీకి టీడీపీ మ‌ద్ద‌తిచ్చింది. ఆ ఎన్నిక‌లో క‌డియం శ్రీ‌హ‌రి (టీఆర్ ఎస్‌) 6,61,639 ఓట్ల‌తో విజేత‌గా నిల‌వ‌గా తరువాత స్థానంలో సిరిసిల్ల రాజ‌య్య (కాంగ్రెస్) 2,69,065, బీజేపీ అభ్య‌ర్థి రామ‌గ‌ల్ల ప‌ర‌మేశ్వ‌ర్ (బీజేపీ) 1,87,139 నిలిచారు. అస‌లు బీజేపీకి స్థానికంగా అంత‌గా ప‌ట్టులేద‌ని, వ‌చ్చిన ఆ మాత్రం ఓట్ల‌యినా త‌మవేన‌ని టీడీపీ త‌మ్ముళ్లు వాదిస్తున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్న మైనారిటీలు ఎవ‌రూ బీజేపీకి ఓట్లే వేయ‌ర‌ని, ఇప్ప‌టికైనా ఈ స్థానంలో పోటీ చేసి కేడ‌ర్‌లో ఉత్సాహం నింపి, తెలంగాణ‌లో ఉన్న వ్య‌తిరేక‌త‌ను పొగొట్టుకుందామ‌ని భావిస్తున్నారు. అవ‌స‌ర‌మైతే వ‌రంగ‌ల్ ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో బీజేపీ-టీడీపీల‌లో ఎవరికి ఎంత బ‌ల‌ముందో తేల్చేందుకు స‌ర్వేకు తాము సిద్ధ‌మేన‌ని టీటీడీపీ నేత ఎర్ర‌బెల్లి స‌వాలు విసురుతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన‌ మెద‌క్ ఉప ఎన్నిక‌లో బీజేపీకే అవ‌కాశ‌మిచ్చినా వారు దాన్ని స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయార‌ని గుర్తు చేస్తున్నారు.
బాబు… ఎందుకు వెన‌క‌డుగు?
వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడికి గ‌ట్టి ప‌రీక్షే పెట్టింది. ప‌ట్టమంటే క‌ప్ప‌కు కోపం.. విడ‌వమంటే పాముకు కోపం అన్న‌ట్లుగా త‌యారైంది ఆయ‌న ప‌రిస్థితి.
తెలంగాణ‌లో రోజురోజుకు జారిపోతున్న కేడర్‌ను కాపాడుకోవాలంటే..ఈ ఎన్నిక‌లో పోటీ చేయ‌క త‌ప్ప‌దు. పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఇదే అభిప్రాయంతో చంద్ర‌బాబుపై ఒత్తిడి చేస్తున్నారు. మ‌రోవైపు ఏపీ పున‌ర్నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు చాలా అవ‌స‌రం. ఈ ద‌శ‌లో వ‌రంగ‌ల్లో పోటీకి ప‌ట్టుబ‌డితే బీజేపీకి కోపం తెప్పించ‌డం ఎందుకు? అన్న ధోర‌ణిలో చంద్ర‌బాబు ఆలోచ‌న చేస్తున్నారు. అందుకే ఈసారి కూడా బీజేపీకే అవ‌కాశం ఇచ్చేందుకు మొగ్గు చూపుతార‌ని ప‌లువురు భావిస్తున్నారు.
First Published:  27 Oct 2015 12:09 AM GMT
Next Story